మేం నిందితులం కాదు.. కానీ బెయిల్ కావాలి..!

టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల క్రెడిబిలిటీ బాగా దెబ్బతిన్నది, ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా కోలుకోలేనంత నష్టం జరిగింది. అందుకే దీన్ని పొలిటికల్ యాంగిల్ లో టర్న్ చేశారు. ఊరూవాడా టీడీపీ జెండాలు…

టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల క్రెడిబిలిటీ బాగా దెబ్బతిన్నది, ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా కోలుకోలేనంత నష్టం జరిగింది. అందుకే దీన్ని పొలిటికల్ యాంగిల్ లో టర్న్ చేశారు. ఊరూవాడా టీడీపీ జెండాలు పట్టుకుని మా అయ్యోరిని అరెస్ట్ చేస్తారా అంటూ రెచ్చిపోయారు. 

చివరకు నారాయణ తాను అసలు ఆ విద్యాసంస్థలకు చైర్మన్ కాదు అని చెప్పి తప్పించుకున్నారు. కానీ తప్పు చేశామన్న భయం మాత్రం వారిని వెంటాడుతోంది. అది ఎప్పటికైనా ముప్పుగా మారుతుందనే భావనతోనే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నారాయణ కూతుళ్లు, అల్లుడు.

వాస్తవానికి పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల చైర్మన్ గా నారాయణను అరెస్ట్ చేశారే కానీ, ఎక్కడా ఆయన పిల్లల పేర్లు, విద్యాసంస్థలతో సంబంధం ఉన్న ఇతరుల పేర్లు ఆ కేసులో ఇరికించలేదు. కానీ ఇప్పుడు పిల్లలు టెన్షన్ పడుతున్నారు. అరెస్ట్ చేస్తారేమోనని భయపడుతున్నారు. భుజాలు తడుముకుంటూ హైకోర్టు మెట్లెక్కారు. 

మేం నిందితులం కాము, మాపై కేసులు పెట్టలేదు, కానీ మాకు బెయిల్ కావాలంటూ నారాయణ ఇద్దరు కూతుళ్లు శరణి, సింధూర.. అల్లుడు పునీత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 18 వరకు వారిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

నిందితులు కానప్పుడు బెయిల్ ఎందుకు..?

ఈ వ్యవహారంలో పూర్తి సమాచారంతో పిటిషన్ వేస్తామని హైకోర్టుకి తెలిపారు పోలీసుల తరపు న్యాయవాది. వారు నిందితులే కానప్పుడు బెయిల్ పిటిషన్ పై వాదనలు ఎందుకని ప్రశ్నించారు. నిందితులు కాదంటున్నారు కదా, ఇక ముందస్తు రక్షణ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు న్యాయమూర్తి. 

ఈ కేసులో ఈనెల 18 వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని, పిటిషన్ దారులకు రక్షణగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ కేసు విచారణను కూడా ఈనెల 18కి వాయిదా వేసింది.

మొత్తమ్మీద బెయిల్ వ్యవహారంతో మరోసారి నారాయణ విద్యాసంస్థలకు చెందిన వ్యక్తులు పేపర్ లీకేజీతో ఎలా వణికిపోతున్నారో అర్థమవుతోంది. ఇన్నాళ్లూ బయటపడకుండా తప్పులు చేశారు, వ్యవస్థల్ని మేనేజ్ చేశారు. ఇప్పుడు సాక్ష్యాధారాలతో దొరికేసరికి, అసలు ఆ సంస్థలే మావి కావు అంటున్నారు.