టాలీవుడ్ లో అన్ని విధాలా జోరు మీద వున్న సంస్థల్లో యూవీ క్రియేషన్స్ ఒకటి. ఇటు సినిమాల నిర్మాణం, అటు పంపిణీ, థియేటర్లు, ఇలా అన్ని విధాలా స్పీడ్ గా వెళ్తున్న సంస్థ యువి. గుంటూరు జిల్లాతొ మొదలుపెట్టి పంపిణీ వ్యవస్థను విస్తరించుకంటూ వస్తున్నారు. అదే సమయంలొ థియేటర్ల ను కూడా వీలయినంతగా అక్వైర్ చేస్తున్నారు. ఎప్పుడయితే థియేటర్లు, పంపిణీ వ్యవస్థ పెరిగిందో, సినిమాల కొనుగోలు, నిర్మాణం పెంచుకుంటూ వెళ్తున్నారు.
రంగస్థలం సినిమాతో తొలిసారి నైజాంలో అడుగు పెట్టింది యూవీ క్రియేషన్స్. దాదాపు ఆరు కోట్లకు పైగా లాభం కళ్ల చూసారు. మళ్లీ మరోసారి నైజాంలో భారీ ప్రాజెక్టును తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అదే సమయంలో సీడెడ్ లో, విశాఖ, కృష్ణ, గుంటూరు, ఈస్ట్ లో తమ పంపిణీ వ్యవస్థ వుంది కాబట్టి, టోటల్ ఆంధ్ర మీద కూడా కన్ను వేసారు.
అందుకే ఓ భారీ ప్రాజెక్టు నైజాం, ఆంధ్ర, సీడెడ్ థియేటర్ హక్కులను యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థవి సెల్యూలాయిడ్స్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ లో డివివి దానయ్య నిర్మించే భారీ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల హక్కులను యూవీ క్రియేషన్స్ సంస్థ బేరం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా రేటు సెటిల్ కాలేదు కానీ, వాళ్లకే ఇవ్వడం అన్నది ఫైనల్ అయిపోయింది.
రామ్ చరణ్ తో యూవీ క్రియేషన్స్ కు సాన్నిహిత్యం వుండడంతో రంగస్థలం సినిమాతో నైజాం రంగంలోకి దిగారు. ఇప్పుడు మళ్లీ అదే రామ్ చరణ్ సినిమాతో ఏపీ తెలంగాణ మొత్తం తామే దున్నేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ డీల్ ఎలా లేదన్నా 70 కోట్లకు కాస్త అటుగానే వుండే అవకాశం వుంది. ఆంధ్ర 35 కోట్లకు పైగా రేంజ్ లో సీడెడ్ 15 వరకు, నైజాం 20 కోట్లకు పైగా చూసుకున్నా, 70కోట్ల వరకు వుంటుంది. అయితే నిర్మాత దానయ్య 75 వరకు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బేరం ఫిక్స్ కావాల్సి వుంది. బహుశా 70కు కాస్త అటుగా ఫిక్స్ కావచ్చు.
రామ్ చరణ్ మార్కెట్, చరిష్మా రంగస్థలం సినిమాతో సర్రున పైకి ఎగిసాయి. ఇక బోయపాటితో కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ చెప్పనక్కరలేదు. సీడెడ్ లో బోయపాటి సినిమాలకు మాంచి క్రేజ్ వుంటుంది. నైజాంలో రామ్ చరణ్ రంగస్థలం పాతిక కోట్లకు పైగా వసూలు చేసింది. ఆంధ్రలో కూడా అదే పరిస్థితి. అమెజాన్ లో సినిమా లోడ్ చేసినా కూడా ఇంకా చాలా సెంటర్లలో షేర్ వసూలు చేస్తోంది. వీటన్నింటి రీత్యా రామ్ చరణ్-బోయపాటి సినిమాకు ఆ క్రేజ్ తప్పదు మరి.