నమ్రత డీల్ నచ్చలేదా?

పెద్ద సినిమాలు పేరు, హడావుడి, బ్యానర్ వాల్యూకే తప్ప, ఒక్కోసారి పెద్దగా గిట్టుబాటు కావు. పెద్ద సినిమాలు రంగస్థలం మాదిరిగా ముఫైకోట్ల లాభాలు ఇవ్వలేవు. ఆ మధ్య వచ్చిన ఓ భారీ సినిమాకు అయితే,…

పెద్ద సినిమాలు పేరు, హడావుడి, బ్యానర్ వాల్యూకే తప్ప, ఒక్కోసారి పెద్దగా గిట్టుబాటు కావు. పెద్ద సినిమాలు రంగస్థలం మాదిరిగా ముఫైకోట్ల లాభాలు ఇవ్వలేవు. ఆ మధ్య వచ్చిన ఓ భారీ సినిమాకు అయితే, అన్ని ఖర్చులు, అందరి వాటాలు పోను, నిర్మాతకు మిగిలింది ఏడుకోట్లు మాత్రమే. అందులోనూ ఇప్పుడు కోటిన్నర రెండున్నర కోట్లు వెనక్కు ఇవ్వాల్సిన పరిస్థితి వుంది. మరి అలాంటి నేపథ్యంలో పెద్దహీరో, భారీ సినిమాలో వాటాలు పెరిగిపోతూ వుంటే ఎలా వుంటుంది?

మహేష్ తో దిల్ రాజు-అశ్వనీ దత్ సినిమా చేస్తున్నారు. అది ఇప్పుడు కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. మహేష్ బాబు చాలా తెలివైనవాడు. ఎప్పడో అశ్వనీదత్ కు ఇచ్చినమాట, తీసుకున్న అడ్వాన్స్ చెల్లు అయిపోవాలని, దిల్ రాజు సినిమాలో పార్టనర్ గా చేర్చేసారు. దిల్ రాజు అయిష్టంగానైనా ఒప్పుకొక తప్పదు. ఇఫ్పుడు లాభాలు ఎలా పంచుకోవాలి. మహేష్ కు రెమ్యూనిరేషన్ కాకుండా లాభాల్లో సగం వాటా అన్నది డీల్. అంటే లాభాల్లో సగం మహేష్ కు, మిగిలిన సగం దిల్ రాజు, అశ్వనీదత్ పంచుకోవాలి. అంటే నిర్మాతలుగా పావలా, పావలా వాటాలు అన్నమాట.

ఇలాంటి టైమ్ లో పీవీపీ వివాదం వచ్చింది. మహేష్-నమ్రత మళ్లీ తెలివిగా ఆలోచించారు. పీవీపీకి 2018 డిసెంబర్ లోగా ఓ సినిమా చేయాల్సిన అగ్రిమెంట్ వుంది. వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వివాదం వుంది. ఈ రెండూ ఒకే దెబ్బకు క్లియర్ అయిపోతాయి. అందుకే దిల్ రాజు-అశ్వనీదత్ ప్రాజెక్టులో పీవీపీని కూడా వాటాదారుగా చేర్చుకోవాలని ప్లాన్ చేసారు. ఈ మేరకు నమ్రత రాయబారం నడిపినట్లు తెలుస్తోంది.

నమ్రత సూచన మేరకు తప్పక, అశ్వనీదత్, దిల్ రాజు కూడా పీవీపీతో ఒక సిటింగ్ వేసాం అనిపించి, ఊరుకున్నారు. అంతేతప్ప అంతకన్నా ముందుకు దాన్ని తీసుకువెళ్లలేదు. అక్కడే పీవీపీకి చికాకు పుట్టింది. వచ్చారు, సిటింగ్ వేసారు, ప్రొపోజల్ పెట్టారు. కానీ మరోపక్క స్టే వెకేట్ పిటిషన్ పై సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారు. ఇదేం వ్యవహారం అని ఆయన తన లీగల్ బాటిల్ తను కొనసాగించారు. ఒకసారి కలిసిన దిల్ రాజు, అశ్వనీదత్ మళ్లీ ఎందుకు కలవలేదు? పీవీపీ పాజిటివ్ గా వున్నా కూడా ఆ ప్రపోజల్ ను ఎందుకు ముందుకు తీసుకెళ్లలేదు. దీనికి కారణం ఒకటే అనుకోవాలి.

రూపాయి  లాభంలో అర్థరూపాయి మహేష్ తీసుకుని, మిగిలిన అర్థరూపాయిని ముగ్గురును తీసుకోమంటే, ఒక్కో నిర్మాతకు వచ్చేది 16 పైసల వాటా. అందుకే ఏదో విధంగా కోర్టులో స్టే వెకేట్ చేయించి, పీవీపీని సీన్లోంచి తప్పిద్దాం అనుకున్నారు. కానీ ఆ పాచిక పారలేదు. వివాదం జటిలం అయింది.