రణ్‌బీర్ కపూర్ పెళ్లి వార్తలు కొత్తవి ఏమీకాదు. గతంలో ఇతడి పెళ్లి కబుర్లు వినిపించాయి. అదిగో.. ఇదిగో.. త్వరలోనే రణ్‌బీర్, కత్రినా కైఫ్‌లు ఒక ఇంటివారు అయిపోతున్నారని అప్పట్లో మీడియాలో బాగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో రణ్‌బీర్ కుటుంబం కూడా ఇన్‌వాల్వ్ అయ్యింది. కత్రినాను కోడలిగా తీసుకోవడానికి రణ్‌బీర్ తల్లి కూడా సానుకూలంగా ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి.
రణ్‌బీర్ కుటుంబంతో కత్రినా కూడా క్లోజ్‌గా కనిపించింది. అప్పటికే వారిద్దరూ తమ లవ్‌నెస్ట్‌లో బస చేసినట్టుగా ప్రచారం జరిగింది. ఇక పెళ్లే తర్వాయి అనుకుంటున్న సమయంలో బ్రేకప్ అన్నారు. సినిమా షూటింగుకు ప్యాకప్ చెప్పేసినంత ఈజీగా ఆ లివింగ్ రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పారు. ఇప్పుడు మళ్లీ పాత కథే. రణ్‌బీర్ పెళ్లి అట, ఈసారి అలియా భట్‌తో! వీళ్లిద్దరి ప్రేమ గురించి ఈ మధ్యే ప్రచారం మొదలైంది.
అప్పుడే పెళ్లి అనేంత వరకూ వచ్చేశారు. ఈసారి కూడా రణ్‌బీర్ కుటుంబం ఇన్‌వాల్వ్ అవుతోంది. ఈ మధ్యనే రణ్‌బీర్ తల్లి, చెల్లెలుతో కలిసి కనిపించింది అలియా. త్వరలోనే పెళ్లి భాజాలు అని బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది. ఇదంతా చూస్తుంటే కత్రినా, రణ్‌బీర్‌ల ప్రేమ కథే గుర్తుకు వస్తోంది. దీని ముగింపు ఎలా ఉంటుందో!