సినిమా రివ్యూ: నా నువ్వే

రివ్యూ: నా నువ్వే రేటింగ్‌: 2/5 బ్యానర్‌: కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌, ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ తారాగణం: కళ్యాణ్‌రామ్‌ నందమూరి, తమన్నా భాటియా, వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భరణి, ప్రవీణ్‌, బిత్తిరి సత్తి, ప్రియదర్శి,…

రివ్యూ: నా నువ్వే
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌, ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌
తారాగణం: కళ్యాణ్‌రామ్‌ నందమూరి, తమన్నా భాటియా, వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భరణి, ప్రవీణ్‌, బిత్తిరి సత్తి, ప్రియదర్శి, సురేఖవాణి తదితరులు
కథ, కథనం: జయేంద్ర, శుభ
కూర్పు: సతీష్‌ సూర్య
సంగీతం: శరత్‌
ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరామ్‌
సమర్పణ: మహేష్‌ కోనేరు
నిర్మాతలు: కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ వట్టికూటి
దర్శకత్వం: జయేంద్ర
విడుదల తేదీ: జూన్‌ 14, 2018

''ఏ కాలంలో ఉన్నావ్‌ నాన్నా'' అంటూ తన ప్రేమకి అడ్డు పడుతోన్న తండ్రిని తమన్నా ఓ సీన్లో నిలదీస్తుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపూ ఈ చిత్ర దర్శకుడిని కూడా ఇదే ప్రశ్న అడగాలనిపిస్తుంది.

విధి కారణంగా ఒక్కటయ్యే ప్రేమజంట కథ ఇది. ఇలాంటి కాలం చెల్లిన కాన్సెప్ట్‌ని ఎంచుకున్నప్పుడు దానిని మెప్పించేలా చెప్పడానికి దర్శకులు సృజనాత్మకత వాడాలి. కథనంలో చాతుర్యం చూపించాలి. 'హలో' చిత్రంలో విక్రమ్‌ కుమార్‌ ఈ కాన్సెప్ట్‌ని కాంటెంపరరీ స్టయిల్లో డీల్‌ చేస్తేనే ఈ కాలంలో విధి, నిధి ఏమిటంటూ మెజారిటీ ప్రేక్షకులు పెదవి విరిచేసారు. 'నా నువ్వే' దర్శకుడు జయేంద్ర అయితే ఇంకా అప్పటి తొలిప్రేమ రోజుల్లోని సన్నివేశాలతో ఇప్పటి ప్రేక్షకులకి ప్రేమ భావనలు రేకెత్తించాలని చూసారు.

అయితే ఈ ప్రేమకథ చూసి అటు ఎమోషనల్‌గాను, ఇటు ఫీల్‌ గుడ్‌గాను ఫీలవలేని ప్రేక్షులు ఇందులోని ఒక సన్నివేశం మాదిరిగా బయటకి వచ్చి ప్రతి సీన్‌ని తలచుకుని, తలచుకుని నవ్వుకుంటారు. కళ్యాణ్‌రామ్‌, తమన్నా ఓ సినిమాకెళ్లి, ముందు వరసలో వున్న ప్రేమ జంట సరసాలు చూసి బయటకి వచ్చి, అది గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటారు. 'నా నువ్వే' ప్రేక్షకులయితే తెర మీద చూసిన ప్రేమ జంట తాలూకు ప్రేమ సన్నివేశాలనే తలచుకుని రోజంతా నవ్వుకోవచ్చు.

ఒక వ్యక్తి తన ప్రేమకథని ఎంతో ఆర్ద్రతతో చెబుతున్నపుడు కళ్లు చెమ్మగిల్లకున్నా ఫరవాలేదు కానీ పళ్లు ఇకిలించకూడదు. కానీ ఇందులో తమన్నా తడి కళ్లతో తన ప్రేమకథని ఏకరవు పెడుతోంటే చాలా సందర్భాల్లో ఆ పిచ్చితనానికి నవ్వే వస్తుంది తప్ప మనసుకి హత్తుకోదు. 'విధి' ఆడిన స్క్రీన్‌ప్లేతో ఏకమైన ప్రేమజంట తాలూకు కథని చాలా జాగ్రత్తగా డీల్‌ చేయాలి. ఒక విధంగా అది రోప్‌ వాక్‌ చేయడం లాంటిదే. బ్యాలెన్స్‌ పాటించి ఈ ఎండ్‌ నుంచి ఆ ఎండ్‌కి వెళ్లిపోతే 'వాహ్వా' అంటూ చప్పట్లు పడతాయి. అదే బ్యాలన్స్‌ కుదరక బొక్క బోర్లా పడితే 'అవసరమా నీకు' అంటూ వెక్కిరింతలు వినిపిస్తాయి.

చాలా కాన్ఫిడెంట్‌గా ఈ కాన్సెప్ట్‌ని ఎంచుకున్న దర్శకుడు ముందుగా తన ప్రేమకథకి తగిన జంటని సెట్‌ చేసుకోవడంలోనే తప్పటడుగు వేసాడు. కళ్యాణ్‌రామ్‌ తన ఇమేజ్‌కి భిన్నమైన పాత్రలో కొత్తగా కనిపించాడు, తన వరకు బాగానే చేసాడు. అలాగే తమన్నా కూడా తన గ్లామర్‌తో ఈ చిత్రానికి విజువల్‌ అప్పీల్‌ పెంచింది. అయితే ఇద్దరూ కూడా ఈ లవ్‌స్టోరీని నడిపించే యువ జంటలా కనిపించలేదు. దానికి తోడు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా కుదర్లేదు.

కళ్యాణ్‌రామ్‌ కళ్లల్లోకి చూస్తూ అతని ఎదపై వాలిపోయిన తమన్నా డైరెక్టర్‌ ఇన్‌స్ట్రక్షన్‌ మేరకు యాక్ట్‌ చేస్తున్నట్టే అనిపిస్తుంది తప్ప ఎక్కడా ఇద్దరి మధ్య ఫీలింగ్స్‌ వున్న ఫీల్‌ కూడా రాదు. ఒక ప్రేమకథకి తగిన జంట కుదరడంతో పాటు ఇద్దరి నడుమ చక్కని కెమిస్ట్రీ వుండడం ఫస్ట్‌ అండ్‌ ఫోర్‌మోస్ట్‌ లక్షణం. అందులోనే 'నా నువ్వే' విఫలం కాగా, ఇక దర్శకుడు 'మ్యాజికల్‌ మూమెంట్స్‌'గా భావించిన ఏ సన్నివేశం కూడా తెరపైకి ఆ 'మాయ'ని తీసుకురాలేకపోవడం మరో లోపం.

ఈ లవ్‌స్టోరీకి వేసుకున్న బేస్‌ కూడా నమ్మశక్యంగా, లాజికల్‌గా లేదు. ఒక పుస్తకం అదే పనిగా తనని వెంటాడుతూ వస్తోంటే, దానిని ఓపెన్‌ చేసి చూస్తుంది తమన్నా. అందులో కళ్యాణ్‌రామ్‌ ఫోటో కనిపిస్తుంది. అది చూడగానే ఆమెకి అంతా మంచి జరగడం మొదలవుతుంది. దాంతో ఆ ఫోటోని పర్సులో పెట్టుకుని తిరుగుతుంటుంది. తనకి ఏదైనా కలిసి రాకపోతే వెంటనే ఆ ఫోటో తీసి చూస్తుంది. వెంటనే అది జరిగిపోతుంది.

ఈ క్రమంలో ఒకసారి థియేటర్‌కి వెళితే టికెట్లు వుండవు. దాంతో ఫోటో తీసి చూస్తుంది. వెంటనే ఓ అమ్మాయి వచ్చి వాళ్లకి కావాల్సిన టికెట్లు ఇచ్చేసి వెళుతుంది. ఈ సన్నివేశాలని ప్రేమ అనుకోవాలనేది దర్శకుడి ఉద్దేశం. ఇదేమి డ్రామా అని అనిపిస్తే మనది కాదు తప్పిదం. కళ్యాణ్‌రామ్‌ కనిపించనంత వరకు ఆ ఫోటో చూసి కావాల్సింది సాధించిన హీరోయిన్‌ అతను కనిపించిన తర్వాత ఆ ఫోటో ఊసెత్తదు. తన ప్రేమికుడి జాడ తెలియక ముప్పయ్‌ ఆరు గంటలు గడువు పెట్టి రైల్వే స్టేషన్‌లో మకాం వేసి తన లవ్‌స్టోరీతో రొద పెట్టడానికి బదులు ఆ ఫోటో చూసి అతడు మళ్లీ కనిపించాలని కోరుకుంటే అయిపోతుందిగా?

అమ్మాయి విధి ఇలాగుంటే అబ్బాయి సైడ్‌ విధి ఇంకోలా గేమ్‌ ఆడుతుంటుంది. యుఎస్‌లో జాబ్‌ వచ్చిన కళ్యాణ్‌రామ్‌ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారీ ఏదో కారణంతో వెనక్కి వచ్చేస్తుంటాడు. ఓసారి అతని వీసా పసుపు నీళ్లలో పడిపోయిందనే కారణం మీద వెనక్కి పంపేస్తారు! ఇదిలావుంటే విధిని నమ్మను, అదంతా ట్రాష్‌ అన్న హీరోనే మలి సీన్లోనే కారణం తెలియకుండా హీరోయిన్‌ కోసం ఆరాట పడిపోతుంటాడు. ఆమె ఎలాగైనా తనది కావాలని తపిస్తాడు. తమన్నా పిచ్చికి అయినా గంట సమయం కేటాయించారు కానీ కళ్యాణ్‌రామ్‌ దానిని ఆమోదించడానికి, ప్రతిస్పందించడానికి కనీసం కారణం కూడా సరిగా చూపించలేదు.

ఇక డెస్టినీ పేరు చెప్పి తమన్నా చేసే ఆగడాలకి అంతు పంతు వుండదు. ఒక సందర్భంలో ఆమె ప్రేమని పరీక్షించడానికి కళ్యాణ్‌రామ్‌ ఓ టెస్ట్‌ పెడతాడు. ''నేనొక ట్రెయిన్‌ ఎక్కి మధ్యలో ఎక్కడో ఒక చోట దిగిపోతాను, మర్నాడు నువ్వు అదే ట్రెయిన్‌ ఎక్కి నేనెక్కడ దిగానో సరిగ్గా అక్కడే దిగాలి. అలా అయితేనే నీ ప్రేమని, డెస్టినీని నమ్ముతాను'' అంటాడు. మర్నాడు ట్రెయిన్‌ ఎక్కిన తమన్నా 'రంగస్థలం'లో అంజనం వేసి ఫణీంద్ర భూపతి ఎక్కడున్నాడో చెప్పే మంత్రగత్తెలా 'ఇక్కడ కాదు, ఇక్కడ కాదు… ఎస్‌, ఇక్కడే దిగిపోవాలి' అంటూ ఎగ్జాక్ట్‌ ప్లేస్‌లో దిగిపోతుంది! ఈ సీన్‌కి 'జయహో జయేంద్రా' అనుకోవాల్సిందే ఎవరైనా!

అన్నట్టు తమన్నాకి మాదిరిగా డెస్టినీని అంచనా వేయగలిగే వారు ఎవరైనా 'నా నువ్వే' టీమ్‌లో వుండుంటే ఎంత బాగుండేదో. ఈ సినిమా డెస్టినీ ఏంటనేది ముందే చెప్పేసినట్టయితే ఇంత కష్టపడి, అంత ఖర్చుపెట్టి దీనిని తెరపై చూసుకుని, ఫలితం తెలుసుకుని వుండేవాళ్లు కాదుగా!

పాటలు వినడానికి కొన్ని బాగానే వున్నా కానీ వాటిని క్రియేటివ్‌గా తీసే ఉద్దేశంతో ఏదేదో చేసి ఎంజాయ్‌ చేయనివ్వలేదు. గ్రాఫిక్స్‌ వర్క్‌ పుణ్యమా అని పి.సి. శ్రీరామ్‌ పనితనం కూడా చిన్నబోయిన సందర్భాలున్నాయి. మొదటి గంట గడవడానికి యుగం పట్టినట్టు అనిపించిన ఈ చిత్రం రెండో గంటతో ఎన్ని గండాలో దాటి వచ్చిన అనుభూతినిచ్చింది. 'డెస్టినీ' అంటూ అన్ని సార్లు అంటోంటే.. ఎన్నో కోట్ల మంది థియేటర్‌ బయట స్వేఛ్ఛగా విహరిస్తోంటే, 'మనకి మాత్రమే ఎందుకీ 'చిత్ర'వధ.. పాడు డెస్టినీ కాకపోతే!' అనుకోవాల్సి వస్తుంది.

బాటమ్‌ లైన్‌: హత 'విధీ'!
– గణేష్‌ రావూరి