కేసీఆర్, చంద్ర‌బాబు కిక్కురుమ‌న‌రే!

ఒక‌వైపు ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, బెంగాల్ లో అధికారంలో ఉన్న మ‌మ‌తా బెన‌ర్జీ ఢీ కొడుతూ ఉన్నారు. బెంగాల్ లో పాగా వేయ‌డానికి బీజేపీ గ‌త…

ఒక‌వైపు ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, బెంగాల్ లో అధికారంలో ఉన్న మ‌మ‌తా బెన‌ర్జీ ఢీ కొడుతూ ఉన్నారు. బెంగాల్ లో పాగా వేయ‌డానికి బీజేపీ గ‌త ఐదేళ్లుగా ఎంతో క‌స‌ర‌త్తు చేస్తూనే ఉంది.

క‌మ్యూనిస్టులు తుడిచిపెట్టుకుపోతున్న ద‌శ నుంచి, కాంగ్రెస్ ఉనికి చాటుకోలేక అవ‌స్థ‌లు ప‌డుతున్న ప‌రిస్థితుల నుంచి బీజేపీ ఎద‌గాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూ ఉంది. అందుకు త‌గ్గ‌ట్టుగా 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బెంగాల్ గ‌డ్డ‌పై బీజేపీకి వ‌చ్చిన సానుకూల ఫ‌లితాలు ఆ పార్టీకి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయి. దీంతో అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఆ పార్టీకి కొత్త ఆశ‌లు మొద‌ల‌య్యాయి. దీంతో త‌న క‌స‌ర‌త్తును ప‌తాక స్థాయికి తీసుకెళ్లింది.

మ‌రోవైపు మ‌మ‌తా బెన‌ర్జీ పాల‌న కూడా ప‌దేళ్ల‌ను పూర్తి చేసుకుంటూ ఉంది. ప‌దేళ్ల పాల‌న త‌ర్వాత ఏ పాల‌కులు అయినా వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంది. దానికి మ‌మ‌త మిన‌హాయింపు కాక‌పోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో చైత‌న్య‌వంత‌మైన బెంగాల్ లో మ‌మ‌త‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను కూడా క్యాష్ చేసుకోవ‌డానికి బీజేపీ త‌న ప్ర‌య‌త్నాల‌ను మ‌రింత ముమ్మ‌రం చేసింది.

ఇక బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌న్నీ మ‌మ‌త‌కు మద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నాయి. కాంగ్రెస్, క‌మ్యూనిస్టులు, ఎంఐఎం లు మాత్రం.. అక్క‌డ బీజేపీని, మ‌మ‌త‌ను వ్య‌తిరేకిస్తూ ఉన్నాయి.  వీరిలో ఒవైసీ పూర్తిగా బీజేపీ బాగు కోస‌మే బ‌రిలోకి దిగుతున్నాడ‌నేది ప్ర‌ముఖంగా వినిపిస్తున్న విశ్లేష‌ణ‌. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పోటీలో ఉన్నా.. అవి చీల్చుకునేది కూడా బీజేపీ వ్య‌తిరేక ఓటునే. అందుకే బీజేపీకి మ‌రింత ఉత్సాహం వ‌చ్చిన‌ట్టుగా ఉంది.

త‌న వ్య‌తిరేక ఓటును మూడు ప‌క్షాలు చీల్చుకోవాలి. బీజేపీ మాత్రం వాట‌న్నింటినీ ఒక‌టిగా చూపిస్తూ ప్ర‌యోజ‌నం పొందే అవ‌కాశం ఉంది. ఇక బెంగాల్ ఆవ‌లి బీజేపీ వ్య‌తిరేక పార్టీలు మాత్రం మ‌మ‌త‌కే త‌మ మ‌ద్ద‌తు అని  ప్ర‌క‌టిస్తున్నాయి. శివ‌సేన‌, ఆర్జీడీ, జేఎంఎం వంటి పార్టీలు మ‌మ‌త‌కు అనుకూలంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ఉన్నాయి.

ఇక తెలుగునాట మ‌మ‌త పేరును బాగా ప్ర‌స్తావించిన ఇద్ద‌రు ఘ‌టాఘ‌ట స‌మ‌ర్థులు మాత్రం బెంగాల్ ఎన్నిక‌ల‌పై కిక్కురుమ‌న‌డం లేదు. వారే తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. వీరిద్ద‌రూ గ‌త లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు మ‌మ‌త బెన‌ర్జీని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించే వారు. తాము ఏర్ప‌రిచే కూట‌ముల్లో మ‌మ‌తా బెన‌ర్జీని క‌లుపుకుపోయే ఉద్దేశం ఉన్న‌ట్టుగా స్పందించే వారు. 

చంద్ర‌బాబు నాయుడు అయితే.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ప్పుడు మ‌మ‌త తో క‌లిసి చ‌ర్చ‌లు, కూట‌మి ఏర్పాటు ప్ర‌య‌త్నాలు, కూట‌మి త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా చేశారు! మ‌మ‌త బెన‌ర్జీకి త‌ను ఎంత చెబితే అంత అనేంత స్థాయిలో క‌ల‌రింగ్ ఇచ్చుకున్నారు. చంద్ర‌బాబును ప్ర‌ధాని పీఠంపై కూర్చోబెట్టాల‌ని మ‌మ‌త అనుకుంటున్నారేంత స్థాయిలో అప్ప‌ట్లో ప‌చ్చ‌మీడియా క‌వ‌రేజ్ చేసింది. తీరా ఇప్పుడు.. బెంగాల్ ఎన్నిక‌ల‌పై కానీ, మ‌మ‌త దీదీ ఒంట‌రి పోరుపై కానీ చంద్ర‌బాబు నాయుడు కిక్కురుమ‌న‌డం లేదు.

ఢిల్లీలో ఎన్నిక‌లు జ‌రిగినా, మ‌హారాష్ట్ర‌లో ఎన్నిక‌లు జ‌రిగినా అప్ప‌ట్లో చంద్ర‌బాబు నాయుడు అక్క‌డి తెలుగు వారు  ఎవ‌రికి ఓటేయాలో త‌నే చెప్పే వారు! త‌న మాట ప్ర‌కార‌మే తెలుగు వారు ఎక్క‌డున్నా ఓటేస్తార‌నేంత స్థాయిలో వీరి కామెడీ ఉండేది. మ‌రి ఇప్పుడెందుకు బెంగాల్ ఎన్నిక‌ల విష‌యంలో కిక్కురుమ‌న‌డం లేదు! బీజేపీ క‌థ అయిపోయింద‌నుకున్న లెక్క‌లేసిన‌ప్పుడేమో మ‌మ‌త ప‌క్క‌న నిల‌బడ్డారు చంద్ర‌బాబు. ఇప్పుడేమో య‌థారీతిన తన అవ‌కాశ‌వాదాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇందులో కొత్తేం లేదేమో! ‌

దమ్ముంటే గుడివాడలో నాపై పోటీచెయ్యి

లోకేష్ పార్టీని నడపగలుగుతారా?