నా పేరు: వి. కె. శశికళ
దరఖాస్తు చేయు ఉద్యోగం: ఒకప్పుడు ముఖ్యమంత్రిని మించిన పోస్టు వుండేది. అదే ‘నెచ్చెలి’ పోస్టు. ముఖ్యమంత్రిగా వున్న జయలలితకు ‘నెచ్చెలి’ గా వుండటం అతి పెద్ద ెదా. ఆమె వెళ్ళిపోయాక ముఖ్యమంత్రి గా ఏదో సామాన్య జీవితం జీవిద్దామనుకున్నాను. కానీ, కుదరలేదు.
వయసు: అంగీకరిస్తే కదా! జైలులో వుండగానే అంగీకరించ లేదు. నా ‘స్వేఛ్చ’ను నేను కాపాడుకుంటున్నాను.
ముద్దు పేర్లు: ‘నిశి’ కళ (అవును నిజమే. రాత్రిళ్లు ప్రకాశిస్తాను. తమిళనాడులో ఇప్పుడే పగలే వుంది. రాత్రి( డిఎంకె) అధికారంలో లేదు. కాబట్టి నేను కనిపించను. అందుకే రాజకీయాలకు దూరంగా వుంటున్నట్టు ప్రకటించాను.
విద్యార్హతలు: ‘నెచ్చెలి’ కావటానికి కూడా విద్యార్హతలు వుంటాయా? ఏం? వీడియోగ్రఫీ తెలిస్తే చాలదా? ‘పురచ్చితలై’కు నన్ను దగ్గరకు చేసింది ఆ విద్యకాదా?
విలాసం: ముగిసింది. రాజకీయ నేతలకు జైళ్ళకు మించిన విలాసవంతమైన బసలు వుంటాయా?
గుర్తింపు చిహ్నాలు: ఒకటి: ‘అమ్మ’ ప్రేమకు పాత్రురాలినయ్యాను. ‘అమ్మ’ కట్టే చీరలే నేను కట్టాను. ఆమ్మ వున్న పోయెస్ గార్డెన్ లోనే నేనూ వున్నాను. ‘అమ్మ’ పెట్టిన పార్టీనే పట్టాను.
రెండు: ‘అమ్మ’ ద్వేషానికి పాత్రురాలినయ్యాను. ‘అమ్మ’ చేతనే ఛీ కొట్టించాను. అమ్మ చేతనే పొయెస్ గార్డెన్ నుంచి బహిష్కరించపడ్డాను.
సిధ్ధాంతం: అమ్మ సమాధి మీద ప్రమాణం చేశాను మళ్ళీ వస్తాను, మొదలు పెడతాను అని. అన్నట్టుగానే వచ్చాను. మొదలు కూడా పెట్టాను. తిరుగుబాటు కాదు, లొంగు బాటు.
వృత్తి: కొందరు చిరతలు పడితే కానీ ప్రదర్శించ లేని విద్యను, నేను చిరతలు లేకుండా మోతెక్కించగలను. పురుషులు మాత్రమే రాణించే ఈ విద్యలో, అత్యంత అరుదుగా స్త్రీలు వస్తుంటారు. అయినా ఏం లాభం? ఎవరు గుర్తించారు గనకా…!!
హాబీలు: 1. కాసుల పేర్లు ధరించటం
2. ‘కేసుల’ పేర్లు భరించటం.
అనుభవం: సాష్టాంగపడ్డ ప్రతివాడూ పన్నీర్ సెల్వం కాలేడు. అదొక ‘యోగ’ విద్య. కుర్చీ ఎక్కినంత సులువు కాదు, కాళ్ళు పట్టటం. ప్రాణం వున్న మనిషి శవంలా బిర్రబిగిసి పోవాలి. ఈ విద్యతోనే సెల్వం, ‘పెద్దమ్మ’ కటాక్షాన్నీ. ‘చిన్నమ్మ’నయిన, నా కటాక్షాన్నీ పొందలేడు.
మిత్రులు: మనతో వున్న వారు, మన వల్ల పదవి పొందిన వారూ నిజమైన వారా, కాదా తెలుసుకోవటానికి ఒక్కటే పరీక్ష. ఒక్క సారి ఊచల వెనక్కి వెళ్ళి నిలబడాలి. నేను అలాగే చేశాను. ‘పళని’ స్వాములు కాస్తా, ‘పడని’ స్వాములయ్యారు.
శత్రువులు: వాళ్ళే నిఖార్సయిన వాళ్ళు. అన్ని వేళలా ఒకేలా వుంటారు.
మిత్రశత్రువులు: ‘జైలు నుంచి రాగానే రాజకీయ సన్యాసం’ తీసుకోవటం మంచిదన ప్రభోదించనవారు.
జీవిత ధ్యేయం: ఏదో ఒక రోజు నేనూ ‘పెద్దమ్మ’నయి, నాలాంటి మరొక ‘నెచ్చెలి’ని చేరదీయాలని.
సతీష్ చందర్