ఈ నెల 11 న మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. మిడ్ రేంజ్ సినిమాల్లో పెద్ద సినిమాలు ఇవి. ఇలా విడుదలవడం పెద్ద విషయం కాదు. కానీ ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలకు చాలా ప్రత్యేకత వుంది. ఒకటి గాలిసంపత్..రెండు జాతి రత్నాలు.
ఈ రెండు సినిమాలకు ఇద్దరు డైరక్టర్లు నేతృత్వం వహించడం, నిర్మాణంలో పాలు పంచుకోవడం అన్నది కీలకం. మహేష్ ను డైరక్ట్ చేసి, అనేక హిట్ లు తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ఓ సినిమాకు అన్నీ తానై వ్యవహారించారు. మహానటి సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకుని, బాహుబలి ప్రభాస్ తో సినిమా చేయబోతున్న నాగ్ అశ్విన్ మరో సినిమాకు అన్నీ తానై వ్యవహారించారు.
రెండు సినిమాలు కూడా చాలా జాగ్రత్తగా ఏడెనిమిది కోట్ల లోపు బడ్జెట్ తో తయారయ్యాయి. అందువల్ల లాభ నష్టాల సమస్య లేదు. నాన్ థియేటర్ హక్కులు, థియేటర్ హక్కుల రూపంలో ఇప్పటికే లాభాలు చేసుకున్నాయి. అది సమస్యే కాదు.
కానీ ఇప్పుడు టార్గెట్ అంతా విజయం సాధించడం పైనే. ఇద్దరు టాలెంటెడ్ డైరక్టర్లు నమ్మి చేసిన రెండు సబ్జెక్ట్ లు. ఇది వారి వారి ప్రతిష్టకు సంబంధించిన అంశం. అనిల్ రావిపూడి తన ఫన్ టచ్ కు ఎమోషన్ టచ్ ఇచ్చి తీసిన సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ దే కీలకపాత్ర.
ఆల్ ఇండియా రేడియో రిపోర్టర్ గా వుంటూ, అనుకోకుండా మాట కొల్పోయి, నోటి వెంట మాటకు బదులు గాలి మాత్రమే వస్తూ గాలి సంపత్ అనిపించుకుంటాడు. తొలిసగం మొత్తం ఫన్ నిండిన సినిమా సెకండాఫ్ లో ఎమోషన్ టర్న్ తీసుకుంటుంది. అనిల్ రావిపూడి ఈ ఎమోషన్ ను ఎక్కువగా నమ్మి, తొలిసారి ఈ విధమైన సినిమా తీయడం ఆయనకు సవాలు.
ఎవడో సుబ్రహ్మణ్యం లో ఫిలాసఫీని, మహానటిలో ఓ నటి జీవితంలో ఎమోషన్ ను పట్టుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ తొలిసారి అవుట్ అండ్ అవుట్ ఫన్ జోనర్ లో సినిమాను అందిస్తున్నారు. అంతే కాదు, ఆయన కూడా తొలిసారి నిర్మాతగా మారారు. ఇది ఆయన నమ్మిన కథకు సవాలు. ఇలాంటి రెండు సినిమాలు ఒకే రోజు పోటీ పడుతున్నాయి..ఢీ కొంటున్నాయి.
పెద్ద సినిమా ఢీ..ఢీ
ఏడెనిమిది కోట్లతో తీసిన రెండు సినిమాలతో దాదాపు పాతిక కోట్లకు ఫైగా బడ్జెట్ తో తీసిన మరో సినిమా పోటీ పడుతోంది. శర్వానంద్ నటించిన శ్రీకారం అది. దీనికీ ఫ్రత్యేకత వుంది. మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమా మాత్రమే కాదు ఇది.
వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో ఆ ఆలోచన తో చేసిన సినిమా. ఈ సినిమాలో శర్వానంద్ వ్యవసాయం చేపట్టిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపిస్తాడు. ఇది శర్వాకు కూడా సవాలే. ఎందుకంటే విజయం మాత్రమే కాదు, పెద్ద హీరోలు ఇస్తేనే మెసేజ్ లు తీసుకుంటారు జనం అనే అభిప్రాయం వున్న నేపథ్యంలో అలాంటి సినిమా చేయడానికి ధైర్యం చేయడం.
ఈ మూడు సినిమాల ఫలితాలు మరో మూడు రోజుల్లో తేలిపోతాయి.