విశాఖలో ఏ పార్టీలో వున్నారో తెలియని లేదా తెలుగుదేశంలోనే వున్నారనుకునే నేత సబ్బం హరి. ఆయన వారానికి మూడు సార్లు ఓ ఛానెల్ లో మరో మూడు సార్లు మరో ఛానెల్ లో ప్రత్యక్షం అవుతుంటారు.
జగన్ పై విమర్శలు కావాల్సిన ఆ ఛానెళ్లకు ఆయనే ప్రధాన ముడిసరుకు. ఆ విధంగా నిన్నటికి నిన్న ఓ ఛానెల్ లోకి వచ్చి చాలా నీతులు వల్లించారు. ఆందోళన వ్యక్తం చేసారు. కానీ అవన్నీ వింటుంటే సబ్బం హరి గతం పూర్తిగా మరిచిపోయారేమో అనిపిస్తోంది.స్ధానికేతరులకు టికెట్ లు అంటూ సబ్బం హరి తెగ బాధపడిపోతున్నారు.
మరి స్థానికేతరుడు అయిన టి సుబ్బరామిరెడ్డికి ఎన్నికల ఏజెంట్ గా వుండి, ఆయన ఎంపీగా ఎన్నిక కావడానికి కృషి చేసింది సబ్బం హరి కదా? మరి సబ్బం హరి స్థానికుడా? ఇప్పటి వరకు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఎంత మంది స్థానికేతరులకు టికెట్ లు ఇచ్చాయో సబ్బం హరి చెప్పవచ్చు కదా? తెలుగుదేశంలో పార్టీ నాయకులు కూడా స్ధానికేతరులకే కదా?
కులాలు సంఘాలు అంటూ సబ్బం హరి ఎదేదో చెబుతున్నారు. కానీ అసలు దశాబ్దాల కిందటే వెలమ కులస్థుల ఐక్యత అభివృద్ది కోసం సబ్బం హరి పాదయాత్ర చేసిన సంగతి మరిచారా? విశాఖకు స్టీల్ ప్లాంట్ వచ్చినపుడే వివిధ జిల్లాల నుంచి జనాల వలసలు ప్రారంభమయ్యాయి.
పైగా తెలుగుదేశం పార్టీ ఓ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, నాయకులను, ప్రజా ప్రతినిధులను వారి నుంచే తయారు చేసింది. ఇప్పుడు జగన్ వచ్చాక ఇలాంటి కార్యక్రమం ఏదో జరిగిపోతున్నట్లు కొత్తగా చెబుతున్నారు.
వైకాపాకు ఓటేస్తే అరాచకం అన్యాయం అని ఓ పక్క అంటూనే వైకాపా ఓటు బ్యాంకు తగ్గిపోయిందని, జనసేన ఓటు బ్యాంకు పెరిగిందని సబ్బం హరి అనడం విశేషం. వైకాపా ఓటు బ్యాంకు తగ్గిపోతే ఆనందమేగా, ఇక ఇంకా గొంతు చించుకోవడం ఎందుకు? రౌడీయిజం అంటూ కూడా సబ్బం ఏదోదో అంటున్నారు. కానీ దాని గురించి విశాఖ ప్రజలకు బాగా తెలుసుగా..కొత్తగా చెప్పడం ఏమిటి?