బెజవాడ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలు మద్దతు తెలిపినట్టేనని, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలో లేదో తేల్చుకోవాలంటూ రోడ్ షో లో ఉపదేశం ఇచ్చారు చంద్రబాబు.
పరోక్షంగా విజయవాడ మున్సిపల్ ఎన్నికలకు, అమరావతి రాజధాని అంశానికి లింకు పెట్టారు. గతంలో తాను రెఫరెండం రెఫరెండం అంటూ మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడు అన్యాపదేశంగా మున్సిపల్ ఎన్నికల విషయంలో అమరావతి అంశాన్ని తెరపైకి తెచ్చారు.
రాజధాని ప్రాంతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి చావుదెబ్బ తగిలినా ఇంకా బాబులో అమరావతి భ్రమలు తొలగిపోలేదనడానికి ఇదే నిదర్శనం. అయితే రాజధాని పేరుతో బెజవాడ వాసుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన బాబుకి మరోసారి గుణపాఠం తప్పదని అంటున్నారు వైసీపీ నేతలు. బెజవాడ రిఫరెండంతో బాబుకు బుద్ధొస్తుందని చెబుతున్నారు.
యెస్.. మేం రెడీ..
విజయవాడ రోడ్ షో లో చంద్రబాబు విసిరిన సవాల్ ని స్వీకరిస్తున్నామంటున్నారు స్థానిక వైసీపీ నేతలు. బెజవాడలో వచ్చే ఫలితాలతో మూడు రాజధానుల అంశంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తేలిపోతుందని, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రజలెప్పుడూ మద్దతు తెలుపుతారని అంటున్నారు.
విజయవాడలో టీడీపీ ఓడిపోతే.. చంద్రబాబు ఇక అమరావతి మాటెత్తకుండా ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. అమరావతిని రెఫరెండంగా తీసుకున్నా, తీసుకోకపోయినా గెలిచేది వైసీపీయేనని నమ్మకంగా చెబుతున్నారు. అమరావతి ప్రాంతంలోనే ప్రజలు టీడీపీని ఛీ కొట్టారని, విజయవాడలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందనేది వైసీపీ నమ్మకం.
విజయవాడ వాసుల మనోగతం ఏంటి..?
కొత్త రాష్ట్రం వస్తే విజయవాడ రాజధాని అవుతుందని గతంలో ఆశపడ్డారు స్థానికులు. అయితే చంద్రబాబు మాత్రం అప్పటికే అభివృద్ది చెందిన బెజవాడను కాదని, భూ దందాకు సిద్ధమయ్యారు. భూసేకరణ పేరిట తనకు, తన పార్టీ నేతలకు మేలు కలిగేలా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి బెజవాడ వాసులకి షాకిచ్చారు.
దూరంగా ఉన్న అమరావతిలో రాజధాని రావడం వల్ల విజయవాడ వాసులకు ప్రత్యేకంగా వచ్చిన లాభమేమీ లేదు. ఇక్కడి వారు కూడా అమరావతిలో కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాల్సిన పరిస్థితి. అంటే ఒకరకంగా అమరావతి రాజధానితో విజయవాడ వాసులు నష్టపోయారే కానీ లాభపడలేదు. అలాంటి వారిని మూడు రాజధానుల విషయంలో రెచ్చగొడితే ఫలితాలు ఎలా ఉంటాయి.
తమకు అన్యాయం చేసింది టీడీపీనా, వైసీపీనా అని ఆలోచించుకోలేరా? మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పలేరా..? బెజవాడ వాసుల మనోగతం అదేనంటున్నారు వైసీపీ నేతలు. అభివృద్ధి వికేంద్రీకరణకే మద్దతు తెలుపుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.