అల్లుడు ఆదుకుంటాడా.? లేదా.?

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి టైమ్‌ అస్సలేమీ బాగా లేదు. ఏ సినిమా చేసినా సరే, బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడిపోతోంది. ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులు రజనీకాంత్‌ని ఇమేజ్‌ పరంగా నిండా…

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి టైమ్‌ అస్సలేమీ బాగా లేదు. ఏ సినిమా చేసినా సరే, బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడిపోతోంది. ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులు రజనీకాంత్‌ని ఇమేజ్‌ పరంగా నిండా ముంచేశాయనడం అతిశయోక్తి కాదేమో. స్టార్‌ డమ్‌ అంటే జయాజపయాలకు అతీతమే అయినా, డిస్ట్రిబ్యూటర్లు – ఎగ్జిబిటర్లు రోడ్డెక్కి ఆందోళనలు చేసేలా, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడేంతలా దారుణమైన పరాజయాల్ని చవిచూడాల్సి వస్తే ఎవరి స్టార్‌డమ్‌ అయినాసరే ప్రశ్నార్థకమే అవుతుంది. రజనీకాంత్‌ ప్రస్తుత పరిస్థితి అదే.

'లింగా', 'కొచాడియాన్‌', 'కబాలి' సినిమాలతో వరుసగా ఫ్లాపులు ఇచ్చిన రజనీకాంత్‌, తన తాజా చిత్రం 'కాలా' సినిమాతోనూ తేరుకోలేకపోయాడు. 'కబాలి'తో పోల్చితే కాస్త బెటర్‌.. అన్న టాక్‌ అయితే వచ్చిందిగానీ, వసూళ్ళు మాత్రం దారుణంగా వున్నాయి. దాంతో, డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు రజనీకాంత్‌ని కలిసి, తమ గోడు విన్పించేందుకు ప్రయత్నిస్తున్నారట. కానీ, వారి ప్రయత్నాలకు షరామామూలుగానే ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి విషయాల్లో రజనీకాంత్‌ అస్సలు 'సానుకూలంగా' స్పందించడన్న బలమైన వాదన ఎప్పటినుంచో వుంది.

ఓ వైపు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ని కలిసేందుకు ప్రయత్నిస్తున్న 'కాలా' బాధితులు, నిర్మాత ధనుష్‌తో మంతనాలు జరిపేందుకూ ప్రయత్నిస్తున్నారట. మావయ్య రజనీకాంత్‌ ఇమేజ్‌ని క్యాష్‌ చేసుకోవడానికి అత్యంత వ్యూహాత్మకంగా ధనుష్‌ రంగంలోకి దిగాడు. నిజానికి, '2.0' సినిమా విడుదలై, ఆ తర్వాత 'కాలా' వచ్చివుంటే, ధనుష్‌ ఇంకా బాగా క్యాష్‌ చేసుకునేవాడే. 'కాలా' సినిమాకి ఆశించిన స్థాయిలో బిజినెస్‌ జరగకపోయినా, పెట్టిన ఖర్చుకి పదింతల మేర ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది.

సినిమా రిలీజ్‌ అయ్యాక వచ్చిన టాక్‌ పుణ్యమా అని, డిస్ట్రిబ్యూటర్లు – ఎగ్జిబిటర్లు దారుణంగా నష్టపోయారంటూ ట్రేడ్‌ పండితులు లెక్కలు కడ్తున్నారు. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్‌ స్పందించకపోతే, ఖచ్చితంగా ధనుష్‌ వారి ఆవేదనను అర్థం చేసుకోవాల్సిందే. మరి, మావయ్యలాగానే అల్లుడు ధనుష్‌ కూడా తప్పించుకు తిరుగుతాడా.? ఆదుకుంటాడా.? వేచి చూడాల్సిందే.