తిరుమల గర్భగుడిలో నేలమాళిగలున్నాయా?

తిరుమల దేవాలయంలోని పోటులోని నేలమాగాళిలో గుప్తనిధులు దాగి ఉన్నాయని.. వాటి కోసం పాత జేఈఓల నేతృత్వంలో తవ్వకాలు జరిగాయనేది ఒకప్పటి ఆ ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన సంచలన ప్రకటనలో వాస్తవముందా? ప్రతి…

తిరుమల దేవాలయంలోని పోటులోని నేలమాగాళిలో గుప్తనిధులు దాగి ఉన్నాయని.. వాటి కోసం పాత జేఈఓల నేతృత్వంలో తవ్వకాలు జరిగాయనేది ఒకప్పటి ఆ ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన సంచలన ప్రకటనలో వాస్తవముందా? ప్రతి రోజు కొన్ని లక్షల మంది సందర్శించే ఆలయంలో అసలు గుప్తనిధులు ఉండే అవకాశముందా? లాంటి ప్రశ్నలు అనేక మందిలో తలెత్తుతున్నాయి.

పుట్టిన దగ్గర నుంచి ఆలయ ప్రాంతంలోనే సంచరించిన రమణదీక్షితులు ఏమాత్రం ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రకటనలు చేస్తారా? అనేది కూడా ఒక ప్రశ్నే. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ముందు అసలు తిరుమల ఆలయ చరిత్రలోకి కొద్దిగా తొంగి చూడాలి. దీనికి సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు, గ్రంథాలు, ఆలయ మ్యాప్‌లు మనకు అందుబాటులో ఉన్నాయి.

తిరుమల ఆలయం తొలినాళ్లలో కొండ మీద ఎవరూ ఉండేవారు కాదు. పూజారులు కూడా ప్రతి రోజు కింద నుంచి పైకి వెళ్లి వస్తూ ఉండేవారు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం.. అనేక మంది జమిందారులు తమ జెండాలను ఎగరవేశారు. ఉత్తర భారతంపై ముస్లింసేనలు దాడులు చేస్తున్న సమయమది. (ముస్లింసేనలు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే- ఆ సమయంలో భారత ఉపఖండంలో మతం ప్రాతిపదికన.. మత ధర్మాన్ని కాపాడాలనేది ఉద్దేశంతో సేనలు ఏర్పాటు ప్రారంభమయింది). ఎక్కడో ఢిల్లీపై దాడి జరిగిందంటే- ఇక్కడ జమిందారులు ఉలిక్కిపడేవారు.

కొన్నిసార్లు ముస్లింసేనలు దాడులు చేయబోతున్నాయనే వదంతులు వస్తే వారు భద్రమైన ప్రాంతాలకు సంపదనంతా తరలించుకొని వెళ్లేవారు. అలాంటి భద్రమైన ప్రాంతంగా తిరుమల ప్రసిద్ధికెక్కింది. దీనికి కారణం- దీని చుట్టూ ఉన్న కొండలు. చాలా మంది జమిందారులు వదంతులు వ్యాపించినప్పుడు అక్కడకు రావటం.. కొద్దికాలం తర్వాత తిరిగి వెళ్లటం సామాన్యమయింది.

శ్రీకృష్ణదేవరాయల సమయంలో తిరుమల దేవాలయం చాలా చిన్నగా ఉండేది. ప్రస్తుతం గర్భాలయం ఉన్న ప్రాంతం మాత్రమే దేవాలయంగా ఉండేది. దానిని ఆనుకొని పోటు, మండపాలు ఉండేవి. ఆ తర్వాత జమిందారులు పారిపోయి వచ్చినప్పుడు వారు ఉండటానికి అనువుగా కొన్ని కట్టడాలు నిర్మించారు. వెయ్యికాళ్లమండపం కూడా ఈ తరహా ఒక నిర్మాణమే. ఆ తర్వాత ఈ కొండ మీద ఉన్న దేవుడిని చూడటానికి ప్రజలు రావటం మొదలుపెట్టారు.

వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్వాహణ అంతా స్థానికంగా ఉన్న జమిందారు (పేరుకు రాజు) చూసేవారు. మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటిష్‌ వారి చేతుల్లోకి వచ్చిన తర్వాత- కొద్ది కాలం ఈ దేవాలయం బ్రిటిష్‌ కలెక్టర్‌ చేతిలోకి వచ్చింది. మనకు కచ్చితంగా దొరికే రికార్డులన్నీ ఈ సమయానివే. ఈ రికార్డులు ఎంత కచ్చితంగా ఉంటాయంటే- ప్రతి రోజు స్వామి వారికి ఏ ప్రసాదం ఎంత చేశారు? దానికి ఏఏ పదార్థాలు ఇచ్చారు? ఆ ప్రసాదంలో ఎంత భాగం అర్చకులు తీసుకున్నారు? మొదలైన వివరాలన్నీ కూడా రికార్డు చేసి పెట్టారు.

మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా అంత కచ్చితమైన రికార్డులు అందుబాటులో లేవు. రికార్డుల విషయాన్ని పక్కనబెడితే- అత్యంత పురాతనమైన ఆలయం కాబట్టి.. ఈ కట్టడానికి హాని కలిగించే ఎలాంటి నిర్మాణం చేసినా అది చట్టరీత్యా నేరం. అయితే కట్టడానికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముంటే- పురావస్తుశాఖ అనుమతి తీసుకొని మరమ్మత్తులు చేయవచ్చు.

ప్రస్తుతం మూలవిరాట్టు ఉన్న ప్రాంతం, దాని చుట్టూ ఉన్న గర్భగుడి ఒకప్పుడు ఒక జల పాయను ఆనుకొని ఉండేదని మనకు అత్యంత పురాతనమైన మ్యాపులు చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి జలపాయలు తాము ప్రవహించే దిశను మార్చుకోవటం కూడా సహజమే! కొన్నేళ్ల క్రితం మూలవిరాట్టు ఉన్న ప్రాంతంలో నీళ్లు రావటం మొదలుపెట్టాయని.. దానికి కారణం కనుగొనటానికి టీటీడీ ఇంజినీరింగ్‌ విభాగం ఆ ప్రాంతంలోను.. పోటు ప్రాంతంలోను తవ్వకాలు జరిపిందని వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత పోటులో కొన్ని దూలాలు విరిగిపడి కొంత భాగం దెబ్బతింది. ఆ సమయంలో కూడా ఇంజినీరింగ్‌ విభాగం విస్తృతమైన అధ్యయనాలు జరిపింది. ప్రస్తుతం ఉన్న భక్తుల ఒత్తిడే కొనసాగితే గర్భగుడి దెబ్బతినటం ఖాయమని నిపుణులు హెచ్చరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై టీటీడీ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దేవాలయాన్ని ఒక్క రోజు మూసివేసినా.. అది ప్రపంచంలోనే అతి వార్తగా మారుతుంది కాబట్టి.. టీటీడీ ఆ విషయంపై మాట్లాడకపోవచ్చు.

అయితే రమణ దీక్షితుల ఆరోపణల నేపథ్యంలో అసలు గర్భగుడి పరిస్థితి ఎలా ఉంది? నిజంగానే అది కూలే పరిస్థితిలో ఉందా? గర్భగుడి సమీపంలోను, పోటులోను ఏవైనా నేల మాళిగలు ఉన్నాయా? అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ప్రస్తుతం మనకు అత్యంత ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. భూగర్భంలో ఎలాంటి కట్టడాలు ఉన్నాయి? ఏవైనా లోహాలు ఉన్నాయా? లేవా? అసలు అక్కడ ఉన్న రాళ్ల పరిస్థితి ఏమిటనే విషయాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం మరో కోణాన్ని కూడా గమనించాలి.

సాధారణంగా ప్రతిపక్ష, విపక్ష పార్టీలు ఎప్పుడూ ఏకాభిప్రాయంతో ఉండవు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఏ అంశాన్నైనా విపక్షం వదిలిపెట్టదు. తిరుమల విషయంలో వైఎస్సార్పీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని పెద్దది చేయటానికి ఇష్టపడటం లేదు. ఇదే విధంగా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని.. తిరుమలలో అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే పరిపూర్ణానంద, స్వరూపానంద వంటి స్వామిలు కూడా మౌనంగా ఉంటున్నారు. 

వైఎస్‌ హాయంలో తిరుమలలో అనేక అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. రమణదీక్షితులు పేర్కొంటున్న మాజీ జేఈఓలు ఎక్కువ కాలం వైఎస్ హాయాంలో పనిచేసిన వారే. ఇక వెయ్యికాళ్ల మండపం కూల్చివేత సమయంలో రాష్ట్రంలోని స్వామిలంతా రెండు గ్రూపులుగా విడిపోయారు. కొందరు సమర్థిస్తే- కొందరు వ్యతిరేకించారు. తిరుమల ఆలయంలో తవ్వకాలు మొదలుపెడితే ఈ వ్యవహారాలన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో కాబోలు.. అందరూ ఆ వెంకటేశ్వస్వామిపైనే భారం వేసి ఊరుకున్నారు.

– భావన 
-([email protected])