పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా బాక్సాఫీసు వద్ద తేడా కొట్టింది. ‘‘అద్భుతం.. అద్భుతం..’’ అని వారు ఎంతగా టముకు వేసుకున్నప్పటికీ, పేలవంగా ఉన్న ఈ సినిమా ఓపెనింగ్ సీజన్ తరువాత చతికిల పడినట్లే లెక్క. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాని జాకీలు పెట్టి లేపడానికి పాపం పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు నానాపాట్లు పడుతూ ఉన్నారు.
ఈ చిత్రంలో మంత్రి అంబటి రాంబాబును వేషంలో పోలినట్లుగా ఉండే క్యారెక్టర్ను రూపుదిద్ది ఆ పాత్రకు శ్యాంబాబు అని పేరు పెట్టి స్పూఫ్ చేశారు చిత్ర రూపకర్తలు! అంబటి రాంబాబు దానిపై ఆగ్రహించి, పవన్ కళ్యాణ్ గురించి నానా మాటలు అంటున్నారు. పనిలో పనిగా పవన్ కు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్యాకేజీ మొత్తాన్ని నిర్మాత విశ్వప్రసాద్ ద్వారా ఎన్నారైల డబ్బును హవాలా మార్గంలో అందజేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇంతవరకు అందరికీ తెలిసిన సంగతే!
అయితే సినిమాలో తన పాత్రను పెట్టడం పట్ల అంబటి రాంబాబు ఈ రకంగా సీరియస్ గా స్పందించకుండా మరో రకంగా మాట్లాడి ఉంటే ఎలా ఉండేది అనే ఊహ ఒకటి కలుగుతోంది..!
పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా బాక్సాఫీసు వద్ద డమాల్ అంటూనే ఉన్నాయి. బ్రో చిత్రంలో ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా అల్లరి చిల్లరగా తిరిగే ఒక పాత్రను తయారుచేసి దానికి శ్యాంబాబు అని పేరు పెట్టి అంబటి రాంబాబు వేసుకున్న వస్త్రధారణనే వేసి అలాంటి స్టెప్పులు వేయించి వెటకారం చేశారు.
దీనినే అంబటి ప్రస్తావించి ‘‘వరుసగా తన చిత్రాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి గనుక, కనీసం నన్ను పోలిన పాత్రనైనా తన సినిమాలో పెట్టుకుని ఒక హిట్ సంపాదించవచ్చునని ఆశపడే ఖర్మ పవన్ కళ్యాణ్ కు పట్టిందని’’ హేళన చేసి ఉండవచ్చు.
‘‘తాను సామాన్య ప్రజలతో మమేకం కావడంలో భాగంగా మాత్రమే, వారికి తనకు మధ్య అంతరాలు ఉండవని అందరు సామాన్యులలో తాను ఒకడినని నిరూపించడానికి మాత్రమే, వారితో కలిసి డాన్స్ చేశానని.. దాన్ని వెటకారం చేయడం అనేది పేదల పట్ల, సామాన్యుల పట్ల పవన్ కళ్యాణ్ కు ఉండే చులకన భావానికి నిదర్శనమని’’ అంబటి రాంబాబు తన స్పూఫ్ ను తిప్పికొట్టి ఉండవచ్చు. ‘‘సామాన్యులతో కలిసి రాజకీయ నాయకులు డ్యాన్సులు చేయడం అనేది కొత్త కాదని, ప్రధాని నరేంద్రమోడీ కూడా అలా చేస్తుంటారని.. వాటిని కూడా హేళన చేసే దమ్ము పవన్ కు ఉందా’’ అని హెచ్చరించి ఉండవచ్చు.
అలాగే ‘‘సినిమాలో ఉండే శ్యాం బాబు పాత్రకు వేషం మాత్రమే తన దుస్తులు తొడిగారని, బుద్ధులు పవన్ కళ్యాణ్ వేనని ఆయన అని ఉండొచ్చు! ఒక్కొక్క పెళ్లి అయిన తర్వాత బాధ్యతలను వదిలించుకునే బుద్ధులు పవన్ వేనని’’ వెటకారం చేసి ఉండొచ్చు
అలాకాకుండా సినిమాలో పాత్రను చూసి ఉడికిపోవడం వలన ఆయన సాధించేది పెద్దగా ఉండకపోవచ్చు అని పలువురు అంటున్నారు. సినిమాకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే ఆరోపణల ద్వారా, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం ద్వారా కూడా పెద్ద ఫలితం ఉండకపోవచ్చునని పలువురు అనుకుంటున్నారు.