జగన్ చుట్టూ ఆశావహులు

ముఖ్యమంత్రి జగన్ తమ ప్రాంతానికే వస్తున్నారు. ఆయన్ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఒక పని అయిపోతుందని ముందు చూపుతో చాలా మంది ఆశావహులు విశాఖ టూర్ లో సీఎం కంట్లో కనిపించే ప్రయత్నం చేశారు.…

ముఖ్యమంత్రి జగన్ తమ ప్రాంతానికే వస్తున్నారు. ఆయన్ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఒక పని అయిపోతుందని ముందు చూపుతో చాలా మంది ఆశావహులు విశాఖ టూర్ లో సీఎం కంట్లో కనిపించే ప్రయత్నం చేశారు. విశాఖ సౌత్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కే  టికెట్ ఖాయం అని ఆయన వర్గం అంటోంది.

దీని మీద గణేష్ కుమార్ కూడా తానే పోటీ చేయబోతున్నాను అని ఈ మధ్యనే మీడియాకు చెప్పారు. ఆ సీట్లో పోటీకి ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ సిద్ధపడుతున్నారు. సీఎం జగన్ విశాఖకు వస్తారనగా ఒక రోజు ముందే విశాఖ సౌత్ సీట్లో సీతం రాజుకే టికెట్ ఇవ్వాలని బ్రాహ్మణ సంఘం తీర్మానం చేసింది.

విశాఖ వచ్చిన సీఎం జగన్ని సీతం రాజు సుధాకర్ కలసి మాట్లాడారు. విశాఖలో పార్టీ అభివృద్ధికి కృషి చేయమని జగన్ ఆయనకు సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. విశాఖ సౌత్ నుంచి టికెట్ ని ఆశిస్తున్న సుధాకర్ సీఎం కనుసన్నలలో పడేందుకు చూస్తున్నారని అంటున్నారు.

విశాఖలో సీఎ కి రెడ్ కార్పెట్ పరచి వేలాదిగా జనంతో జేజేలు కొట్టించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి, విశాఖ డైరీ చైర్మన్ అయిన ఆడారి ఆనంద్ కుమార్ కి టికెట్ కన్ ఫర్మ్ అయినట్లేనా అన్నది కూడా పార్టీలో తర్జన భర్జన సాగుతోంది.

సీఎం జగన్ శంకుస్థాపన చేసిన రహేజా గ్రూప్ వారి ఇనార్బిట్ మాల్ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉంది. అక్కడ సీఎం స్వాగత సత్కారాలు అన్నీ దగ్గరుండి నార్త్ వైసీపీ ఇంచార్జి కేకే రాజు చూసుకున్నారు. దాంతో రాజుకే 2024లో వైసీపీ టికెట్ ఖాయమని అంటున్నారు. 

అయితే ఈ ముగ్గురే కాదు చాలా మంది కీలక నేతలు వచ్చే ఎన్నికల్లో టికెట్ ని ఆశిస్తున్న వారు అంతా జగన్ తో చేతులు కలిపి కరచాలనం చేసేందుకు ఉత్సాహపడ్డారు. సీఎం మాత్రం వారిని కుశల ప్రశ్నలు వేసి పార్టీకి పనిచేయమని మాత్రమే సూచించారని అంటున్నారు. సీఎం చుట్టూ ఆశవహులు పెద్ద ఎత్తున చేరినా ఆయన టికెట్ కేటాయింపులో మాత్రం తనదైన మార్క్ ని చూపిస్తారు అనే అంటున్నారు.