ఆన్ లైన్ గేమింగ్ అప్లికేషన్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దాదాపు ఏడెనిమిదేళ్ల నుంచి వీటి పరిధి బాగా పెరుగుతూ వచ్చింది. క్రికెట్ బెట్టింగ్ జనాలను ముందుగా ఇవి ఆకర్షించాయి. మరోవైపు అంతకు ముందు నుంచినే రమ్మీ గేమింగ్ అప్లికేషన్లు రాజ్యమేలుతూ వచ్చాయి. ఆ పై రకరకాల విధాలుగా డబ్బులు పెట్టి ఆడే పద్ధతిని ఈ అప్లికేషన్లు జనాలకు అలవాటు చేశాయి. లూడో మీద డబ్బులు పెట్టండి.. కోట్లు గెలవండి అంటూ ఈ అప్లికేషన్లు జనాలకు కిక్ ఎక్కించే యాడ్స్ ఇస్తూనే ఉన్నాయి.
ఇటీవలే వీటికి శరాఘాతంలాంటి నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సెల్ తీసుకుంది. ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ లో జరిగే మారకాలపై 28 శాతం ట్యాక్స్ ను విధించే నిర్ణయాన్ని తీసుకుంది కేంద్రం. అక్టోబర్ ఒకటి నుంచి ఈ పన్ను అమల్లోకి రానుంది. అయితే ఈ విషయంలో అప్లికేషన్లు గగ్గోలు పెడుతున్నాయి.
ఏకంగా 28 శాతం ట్యాక్స్ అంటే.. అది అప్రజాస్వామ్యిక, వివక్ష అంటూ అవి వాపోతున్నాయి. అయితే జూదంపై ఆ మాత్రం పన్ను కాబట్టి పెద్దగా మాట్లాడే వారు లేరు. అలాగే క్యాసినోలు, క్లబ్ లకు కూడా ఈ పన్ను పడనుంది. అయితే ఆన్ లైన్ అప్లికేషన్ల తరఫున ఎవరూ మాట్లాడటం లేందు కానీ,, క్యాసినోలు, క్లబ్ ల విషయంలో రాష్ట్రాలు స్పందిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ స్పందిస్తూ 28 శాతం పన్ను విధానాన్ని భవిష్యత్తులో సమీక్షిస్తామని ప్రకటించారు. ముందుగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తే, ఈ విధానంపై ఆ తర్వాత ఆరు నెలలకు సమీక్ష నిర్వహిస్తారట. అప్పుడు కొనసాగించడం గురించి నిర్ణయం తీసుకుంటారట. అయితే ఆదాయం వచ్చేట్టు అయితే కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తర్వాత పన్నును తగ్గించకపోవచ్చు. అయితే ఆన్ లైన్ గేమింగ్ అప్లికేషన్ల వ్యాపారానికి మాత్రం ఇది దెబ్బ కావొచ్చు.
క్రికెటర్లు, సినిమా వాళ్లను అంబాసిడర్లుగా చేసుకుని.. బోలెడు అప్లికేషన్లు ప్రమోట్ అవుతున్నాయి. కేంద్రం నిర్ణయంతో వాటిపై ప్రభావం ఉండనుంది. ప్రతి బెట్ పై 28 శాతం పన్ను కాదంటూ జీఎస్టీ కౌన్సెల్ అంటోంది. అప్లికేషన్ లో యూజర్ ఖాతాలో జమ చేసే డబ్బు మొత్తం మీద 28 శాతం పన్ను అదనం అని ఇంకా బెట్టింగ్ రాయుళ్లకు పూర్తిగా బోధపడని రీతిలో జీఎస్టీ కౌన్సెల్ నుంచి వార్తలు వస్తున్నాయి.