కన్నడ దెబ్బ.. ‘కాలా’కు నష్టాలు పదుల కోట్లలో!

కావేరీ జల వివాదం కన్నడ, తమిళ సినిమా వాళ్ల మధ్యన కూడా కొనసాగుతూ ఉంది. దశాబ్దాలుగా ప్రతియేటా జరిగే ఈ పంచాయితీపై పరస్పర హెచ్చరికలు, విమర్శలు తప్పడం లేదు. కావేరీ జలవివాదం గురించి సినిమా…

కావేరీ జల వివాదం కన్నడ, తమిళ సినిమా వాళ్ల మధ్యన కూడా కొనసాగుతూ ఉంది. దశాబ్దాలుగా ప్రతియేటా జరిగే ఈ పంచాయితీపై పరస్పర హెచ్చరికలు, విమర్శలు తప్పడం లేదు. కావేరీ జలవివాదం గురించి సినిమా వాళ్లు జోక్యం చేసుకుని సాధించేది ఏమీలేదు. వీళ్లు ఉన్న వైషమ్యాలకు అదనంగా మరింత గొడవ రేపడమే కానీ.. వీళ్ల మేధస్సుతో ఆ సమస్యకు ఎలాంటి పరిష్కారాన్నీ చూపలేరు. అయితే వీళ్ల అతిమాత్రం కొనసాగుతూ ఉంటుంది.

నీళ్లు వదలాలి అంటుంది తమిళనాడు, ఉంటే వదలమా అంటుంది కర్ణాటక. తమిళనాడులో కావేరీ పరివాహక ప్రాంతం ఎండిపోతోంది అంటుంది తమిళనాడు.. ఈ ప్రాంతాన్ని చూసి అయినా నీళ్లు వదలాలి అని తమిళనాడు సినిమా వాళ్లు అంటారు. అబ్బే.. మీరే ఒకసారి కర్ణాటక రండి, కావేరీ పరివాహక ప్రాంతాన్ని చూడండి.. ఈ ప్రాంతాన్ని చూస్తే మీరు నీళ్లు కూడా అడగరు అని.. కన్నడవాళ్లు అంటారు.

ఇలాంటి మాటలతోనే కోర్టుల జోక్యంతో రచ్చ సాగుతోంది. ఇక తాజా వివాదం కావేరీ రివర్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయడం గురించి. ఈ బోర్డు ఏర్పాటు వల్ల ఒరిగేదేమీ ఉండకపోయినా.. రచ్చ అయితే సాగుతోంది. ఈ నేఫథ్యంలో రజనీకాంత్‌ కర్ణాటక సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో తప్పేంలేకపోయినా కన్నడీగులు మాత్రం రజనీపై ఫైర్‌ అవుతున్నారు. తమిళనాడులో పరిస్థితిని గమనించి.. నీళ్లు వదలాలి అని రజనీ అన్నాడు.

ఈ మాటలే తీవ్రం అయ్యాయి. రజనీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన తదుపరి సినిమా 'కాలా'ను కన్నడనాట ప్రదర్శించమని కేఎఫ్‌సీసీ ప్రకటించింది. ఇలాంటి హెచ్చరికలు ఏమీ కొత్తకాదు. ఇది తొలి సినిమా కూడా కాదు. ఇదివరకూ బాహుబలి-2 విషయంలో కూడా వివాదం రేగింది. అప్పట్లో సత్యరాజ్‌కు కన్నడీగులు ఈ హెచ్చరికలు చేశారు. సత్యరాజ్‌ ఏదో అన్నాడని.. ఆయన నటించిన బాహుబలి-2ని నిషేధం అని కన్నడీగులు హెచ్చరించారు. అయితే అప్పటికీ ఇప్పటికీ ఒక ప్రధానమైన తేడా ఉంది.

బాహుబలి-2కి వచ్చినవి ఉడత బెదిరింపులు. కన్నడ రక్షణవేదిక వారు ఆ హెచ్చరిక చేశారు. వారిది కేవలం ప్రచార ఆర్భాటం మాత్రమే. అయితే ఈసారి ఏకంగా కర్ణాటక ఫిల్మ్‌చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వారు ఈ హెచ్చరిక చేయడంతో వివాదం పెద్దది అవుతోంది. ఒకవైపు రాజకీయాల్లోకి వస్తానని అంటున్న రజనీకాంత్‌ను కన్నడీగుడు అని కొంతమంది తమిళులు ఎద్దేవా చేస్తున్నారు. అతడు తమిళుడు కాదని.. కన్నడ నేపథ్యం వాడని వారు అంటారు. అయితే కర్ణాటకలో ఇప్పుడు రజనీకాంత్‌ సినిమాకు ఈ హెచ్చరికలు వచ్చాయి.

నిజంగానే ఈ హెచ్చరికలు నిజం అయ్యి రజనీకాంత్‌ సినిమా కర్ణాటకలో విడుదల కాకపోతే ఈ సినిమాకు మాత్రం భారీ నష్టం తప్పదు. బెంగళూరులో పెద్దఎత్తున తమిళులు ఉంటారు. అలాగే తమిళ వెర్షన్‌ కాలాను బెంగళూరులో బోలెడంత మంది చూసే అవకాశం ఉంది. సాధారణంగా కర్ణాటకలో రజనీకాంత్‌ సినిమాలు భారీ వ్యాపారం చేస్తాయి. భారీ కలెక్షన్లు సాధిస్తూ ఉంటాయి. ఇదివరకూ 'కబాలి' సినిమా అయితే ఏకంగా 30కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది కర్ణాటక వ్యాప్తంగా.

కన్నడ స్టార్‌ హీరోల సినిమాలు రాబట్టే మొత్తంకన్నా ఈ మొత్తం చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు కర్ణాటకలో బ్యాన్‌ రజనీ సినిమాపై ముప్పైకోట్ల రూపాయల స్థాయి ప్రభావం అంటే.. ఇది మామూలు విషయం కాదు. అయితే రజనీకాంత్‌ మాత్రం కేఎఫ్‌సీసీపై మండిపడుతున్నాడు. సౌతిండియన్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో కేఎఫ్‌సీసీ కూడా భాగమని రజనీ అన్నాడు. తద్వారా అక్కడ నుంచి ఒత్తిడి తెస్తామన్నట్టుగా మాట్లాడాడు.