రాను రాను టాలీవుడ్ లో సినిమా వ్యాపారం అన్నది ఓ జూదంలా తయారవుతోంది. కేవలం కాంబినేషన్లు, ట్రాక్ రికార్డులు చూసి సినిమాలు కొనడమే తప్ప, రష్ చూసి సినిమా కొనేరోజులు ఏనాడో పోయాయి. దీంతో అదృష్టం బాగుంటే సినిమా హిట్ అయితే నాలుగు డబ్బులు కళ్ల చూడడం, లేదూ అంటే కోట్లు పోగొట్టుకుని దిగాలు పడడం కామన్ అయిపోయింది. అయితే అలా అని కోట్లకు కోట్లు పోయినా, సర్లే, మరో దాంట్లో చూసుకోవచ్చు అనేంత బడాబాబులే వుండరు అందరూ.
చిన్న చిన్న ప్లేయర్లు కూడా వుండారు. అలాంటి స్మాల్ ప్లేయర్ ఒకరు ఆర్జీవీ ఆఫీసర్ బారినపడి తనకు ఆత్మహత్యే శరణ్యం అని ఘొల్లు మంటున్నారు. ఈ వ్యవహారం మొత్తం ఇలా వుంది. రాజమండ్రికి చెందిన సుబ్రహ్మణ్యం అనే స్మాల్ బయ్యర్ తెగించి ఆర్జీవీ-నాగ్ కాంబినేషన్ లోని ఆఫీసర్ సినిమాను కేవలం ఆంధ్ర ఏరియాకు మూడున్నర కోట్లకు కొన్నారట. అంటే జస్ట్ ఎనిమిది జిల్లాలకు. నిజానికి అన్నీ బాగుంటే నాగ్-వర్మ లాంటి కాంబినేషన్ కు ఇది మంచి రేటే.
బయ్యర్ కూడా ఏం ఆలోచించారు అంటే నాగ్ లేటెస్ట్ సినిమా రాజుగారి గది-2 ఆంధ్ర ఏరియాలో ఏడుకోట్ల వరకు చేసింది, ఇది అందులో సగం చేయదా? అని. అందుకే మూడున్నర కోట్లు పెట్టికొన్నారు. కానీ ఆర్జీవీ అనే డైరక్టర్ సినిమాలు కమర్షియల్ గా ఆడడం మానేసి ఏళ్లూ, పూళ్లూ అవుతోందని ఆయన మరిచారు. నాగ్ తో అయినా, చోటా హీరోలతో అయినా వర్మ సినిమాలు చుట్టేయడం తప్ప, మరేమీ వుండదని ఆయన అర్థం చేసుకోలేదు.
ఇప్పుడేమయింది. ఆంధ్ర అంతటికీ కలిపి తొలిరోజు గట్టిగా ముఫైలక్షలు రాలేదు. మూడున్నర కోట్లు ఎక్కడ.. ముఫై లక్షలు ఎక్కడ. పైగా థియేటర్ల ఖర్చులు, లోకల్ పబ్లిసిటీ ఇవ్వన్నీ వుండనే వున్నాయి. ఈ కలెక్షన్లు చూసి, జిల్లాల వారీ ఈ బయ్యర్ దగ్గర తీసుకున్న వారు తమకే డబ్బులు ఇవ్వాల్సి వుంటుందంటూ ఫోన్ లు మొదలెట్టారట. వర్మతో తనకు పరిచయమే లేదని, ఆయన సహనిర్మాత అయిన సుధీర్ చంద్ర తన ఫోన్ ఆన్సర్ చేయడం లేదని సుబ్రహ్మణం మొత్తుకుంటున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా సంపాదించినది అంతా ఈ సినిమా మీద పెట్టానని, ఇప్పుడు మొత్తం పోయిందని, తన పెళ్ళాం పిల్లలు కూడా తనను చూసే దిక్కు కనిపించడం లేదని, తనకు ఇక ఇవే ఆఖరి పలుకులు కావచ్చని సదరు సుబ్రహ్మణ్యం ఘొల్లుమన్నారు.
ఛాంబర్ వుంది, నిర్మాతల మండలి వుంది, నాగార్జున వున్నారు. వెళ్లి సంప్రదిస్తే బెటర్ కదా అని చెబితే, లోకల్ గా చిన్నగా సినిమాలు కొనడం తప్ప, ఆంధ్ర అంతటికి సినిమా కొనడం, ఇదే తొలిసారి అని , ఏం చేయాలో తోచడం లేదని, ఇండస్ట్రీ పెద్దలు ఆదుకోవాలని కోరుతున్నారు సుబ్రహ్మణ్యం.