వర్మకు భారీగా మిగిలిందా?

ఆఫీసర్ సినిమా పరమ డిజాస్టర్. అందులో అణుమాత్రం సందేహంలేదు. అయితే ఇప్పటిదాకా జనం ఏమనుకున్నా, ఎలాంటి సినిమాలు తీసినా, ప్యాకేజీల కింద తీసినా, ఎడాపెడా తీసినా, ఎప్పటికప్పుడు ఆర్జీవీ బాగానే లాభాలు చేసుకుంటూ వస్తున్నారట.…

ఆఫీసర్ సినిమా పరమ డిజాస్టర్. అందులో అణుమాత్రం సందేహంలేదు. అయితే ఇప్పటిదాకా జనం ఏమనుకున్నా, ఎలాంటి సినిమాలు తీసినా, ప్యాకేజీల కింద తీసినా, ఎడాపెడా తీసినా, ఎప్పటికప్పుడు ఆర్జీవీ బాగానే లాభాలు చేసుకుంటూ వస్తున్నారట. జనం అంతా ఆర్జీవీ ఏదో అరకొర సినిమాలు తీస్తున్నారు అనుకుంటారు కానీ, తీసిన, చేసిన ప్రతి ప్రాజెక్టులో మంచి డబ్బులు కళ్ల చూసారు అన్నది ఇండస్ట్రీ మాట.

అయితే, ఈ సంగతి అలా వుంటే, ఆఫీసర్ సినిమాలో ఆర్జీవీ, ఆయన సహనిర్మాత కలిసి కనీసం పదికోట్ల లాభం కళ్ల చూసారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆఫీసర్ సినిమాను ఆంధ్ర, సీడెడ్, నైజాంలకు కలిపి సుమారు ఆరుకోట్ల మేరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇదికాక శాటిలైట్,. డిజిటల్, ఇతరత్రా ఆదాయల ద్వారా 12కోట్ల వరకు వచ్చిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మామూలుగా అయితే అయిదుకోట్ల వరకు నాగార్జునకు ఇవ్వాల్సి వుంటుంది పారితోషికంగా. కానీ ఈ సినిమాకు మూడుకోట్లే ఇచ్చి, 'సారీ బాస్' అని వర్మ మిగిలిన రెండుకోట్లకు చెల్లు రాసేసారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమా మేకింగ్ ను కూడా వీలయినంత తక్కువతో, అవుడ్ డోర్ లోకేషన్లలో, తనకు అలవాటైన డిజిటల్ కెమేరాలతో వీలయినంత తక్కువగా కానిచ్చేసారని వినికిడి.

ఎంత ఒకటికి రెండుసార్లు లెక్కపెట్టినా ఈ సినిమాకు ఏడెనిమిది కోట్లు మించి ఖర్చుకాదని, మొత్తంమీద నాగ్ ను వాడుకుని, వర్మ బాగానే మిగుల్చుకున్నారని టాక్ వినిపిస్తోంది.