ఉపయెన్నికల ఫలితాలు రాగానే తెలుగు మీడియా చాలా తీవ్రంగా రియాక్టవుతోంది. కమలం వికలమై పోయిందని, 2019లో బిజెపి మళ్లీ అధికారంలోకి రావడం ప్రశ్నార్థకమే అనీ.. యిలా చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. నిజంగా అంత ఉందా? లేకపోతే యిది ఉత్తుత్తి అడావుడా? ఫలితాలు కాస్త లోతుగా చూస్తే అర్థం కావచ్చు. ఈ మధ్యే అమిత్ షా అన్నాడు – ఉపయెన్నికలలో ఓటమి గురించే మాట్లాడుతున్నారు, అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు గురించి మాట్లాడడంలేదు అని. ఉపయెన్నికలు బిజెపికి కలిసి రావటంలేదు.
2014 నుంచి 27 లోకసభ ఉపయెన్నికలు జరిగితే బిజెపి గెలిచింది ఐదిటిలోనే. వాటిలో 13 సిట్టింగ్ సీట్లు. అంటే 8 పోగొట్టుకుంది అన్నమాట. కానీ రాష్ట్రాల ఎన్నికల వరకు వచ్చేసరికి ఒక రాష్ట్రం తర్వాత మరొకటి గెలుస్తూ వస్తోంది. మరి బిజెపికి ఆదరణ ఉన్నట్టా? పోయినట్టా? తగ్గినట్టా? పెరిగినట్టా? ఉపయెన్నికలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతాయి. వాటిని సాధారణ ఎన్నికలకు ప్రొజెక్టు చేసి చూడడం ఒక్కోప్పుడు పొరబాటవుతుంది. అలా అని ఉపయెన్నికలకు ఏ ప్రాధాన్యతా లేదా? అంటే ఉంటుంది. అవి ప్రజలకు యిచ్చే సంకేతాలు. అందువలన వాటిని విస్మరించడానికీ లేదు.
ఒక వరుసలో వెళితే వీటిని అర్థం చేసుకోవడం సులభం. ముందుగా ఉపయెన్నికలతో కంటె జరిగిన బెంగుళూరు రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం సాధారణ ఎన్నిక గురించి. గతంలో అది కాంగ్రెసుదే. ఈ సారీ కాంగ్రెస్సే 41 వేల మెజారిటీతో గెలిచింది. బిజెపి దాదాపు గెలుపు గడపదాకా వచ్చిందన్న విషయం ఓటర్లను ప్రభావితం చేయలేదు.
అసెంబ్లీ స్థానాల ఉపయెన్నికల గురించి మొదలుపెడదాం. వీటిలో పెద్దగా వివరణ అక్కర్లేనివి కొన్ని ఉన్నాయి.
1) మహారాష్ట్రలోని పలూస్-కోడేగావ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పోటీ లేకుండా తన స్థానాన్ని నిలుపుకుంది. 2) ఝార్ఖండ్‌లోని సిల్లి, గోమియా నియోజకవర్గాల్లో రెండు చోట్లా జెఎంఎం తన స్థానాలను 13 వేల మెజారిటీతో నిలుపుకుంది. బిజెపి మూడో స్థానానికి దిగజారింది. 3) మేఘాలయలోని అంపటి నియోజకవర్గంలో కాంగ్రెస్ 3 వేల మెజారిటీతో తన స్థానాన్ని నిలుపుకుంది. 4) బెంగాల్ మహేశ్‌తల నియోజకవర్గంలో తృణమూల్ 62 వేల మెజారిటీతో తన స్థానాన్ని నిలుపుకుంది. బిజెపి రెండో స్థానానికి ఎగబాకి, లెఫ్ట్ ఫ్రంట్‌ను మూడో స్థానానికి నెట్టేసింది. 5) కేరళ చెంగనూర్ నియోజకవర్గంలో సిపిఎం కాంగ్రెసును ఓడించి 21 వేల మెజారిటీతో తన స్థానాన్ని నిలుపుకుంది. మూడో స్థానంలో నిలిచిన బిజెపి 35 వేల ఓట్లు సంపాదించగలిగింది. 6) ఉత్తరాఖండ్ తరాలీ నియోజకవర్గంలో కాంగ్రెసుతో ముఖాముఖీ పోటీలో బిజెపి కేవలం 2 వేల మెజారిటీతో తన స్థానాన్ని నిలుపుకుంది. అది కూడా మరణించిన ఎమ్మెల్యే భార్యను నిలబెడితే! 7) ఇక విజేత మారిన పంజాబ్ షాకోట్ నియోజకవర్గం అకాలీదళ్‌కు 20 ఏళ్లుగా కంచుకోట. పైగా యీసారి ఆప్‌తో చేతులు కలిపింది. అయినా కాంగ్రెసు 39 వేల మెజారిటీతో గెలిచింది.
వీటన్నిటిలోను బిజెపికి పెద్దగా సంకేతాలు లేవు. కానీ బిహార్, యుపి, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఫలితాలే కాస్త కలవరపెడతాయి. ఎందుకంటే 2014 పార్లమెంటు ఎన్నికలలో యుపిలో బిజెపి, మిత్రపక్షాలు 73, మహారాష్ట్రలో 41 (బిజెపికి 23, శివసేనకు 18), బిహార్‌లో 31 వచ్చాయి. అధికారంలోకి రావడానికి యీ రాష్ట్రాలు ప్రధానంగా దోహదం చేశాయి. ఇప్పుడు మారిన పరిస్థితులు ఆ అంకెలను మారుస్తాయా అని ఎదురు చూస్తున్నవారు ఈ ఉపయెన్నికల ఫలితాలపై దృష్టి సారించారు.
బిహార్‌లో 2014లో నీతీశ్, లాలూ, కాంగ్రెసు కలిసి వున్నా బిజెపి, లాలూ పశ్వాన్‌తో కలిసి ఘనవిజయం సాధించింది. తర్వాతి రోజుల్లో నీతీశ్ లాలూ కూటమితో తెగతెంపులు చేసుకుని బిజెపితో చేతులు కలిపాడు. ఆ తర్వాత వచ్చిన ఉపయెన్నికల ఫలితాలు నీతీశ్, బిజెపిలకు వ్యతిరేకంగా, లాలూకు అనుకూలంగా వచ్చాయి. ఇలాటి పరిస్థితుల్లో ఈశాన్య బిహార్‌లో సరిహద్దుల్లో ఉన్న జోకిహాట్ అనే ఒక అసెంబ్లీ స్థానానికి ఉపయెన్నిక వచ్చింది. రాష్ట్ర జనాభాలో 17% మంది ఉన్న ముస్లిములు ఆ నియోజకవర్గంలో అధికసంఖ్యలో ఉన్నారు.
మొహమ్మద్ తస్లీముద్దీన్ అనే లాలూ అనుయాయి ఆ ప్రాంతాల్లో పేరున్న నాయకుడు. అతని కొడుకు సర్ఫరాజ్ ఆలమ్ కూడా. ఇద్దరూ ఏ పార్టీ తరఫునుంచి పోటీ చేసినా 9 సార్లుగా నెగ్గుతూ వచ్చారు. తాజాగా తస్లీముద్దీన్ ఆరాడియా పార్లమెంటు నియోజకవర్గం నుంచి తండ్రి, జోకిహాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొడుకు జెడియు టిక్కెట్‌పై గెలిచారు. 2017 సెప్టెంబరులో తండ్రి చనిపోవడంతో, కొడుకు బిజెపితో చేతులు కలిపాడంటూ నీతీశ్ పార్టీ జెడియును విడిచి లాలూ పార్టీ ఆర్జేడీలో చేరి అక్కణ్నుంచి పోటీ చేశాడు, బిజెపి అభ్యర్థిని ఓడించి నెగ్గాడు.
అతని రాజీనామా వలన ఖాళీ అయిన జోకిహాట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ అతని తమ్ముడు షానవాజ్ ఆలమ్‌ను నిలబెట్టింది. అతనిపై పోటీకి జెడియు విగ్రహాల చోరీ నుంచి గ్యాంగ్ రేప్ వరకు అనేక కేసులున్న ముర్షీద్ ఆలమ్ అనే మాజీ గ్రామాధికారిని నిలబెట్టింది. ఈ సీటు ఎలాగైనా గెలవాలని నీతీశ్ తను ప్రచారం చేయడమే కాక కాబినెట్‌లో సగర మంది మంత్రులను కూడా తిప్పాడు. 'నేను ముస్లింల కోసం ఎంతో చేశాను. మీ సంక్షేమం కోసం రూ.800 కోట్లు విడిగా పెట్టాను. మతకలహాలు జరగకుండా చూశాను' అని నీతీశ్ ఒక సభలో చెప్పుకుంటూ ఉంటే ఒక శ్రోత నిలబడి 'అలా అయితే యిటీవలి రామనవమి ఊరేగింపుల సందర్భంగా 10 జిల్లాల్లో మతపరంగా ఘర్షణ వాతావరణం ఎందుకు ఏర్పడింది?' అని అడిగాడు.
హిందూ ఓటర్లందరినీ ఐక్యం చేయడానికి బిజెపి యిటువంటి ఊరేగింపులు కత్తులు, కఠార్లతో నిర్వహిస్తూ ఉంటుంది. దానివలన ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. బెంగాల్‌లోనూ యిదే తంతు. నీతీశ్ వెళ్లిన మర్నాడు లాలూ కొడుకు తేజస్వి యాదవ్ వచ్చి మీటింగు పెడితే మూడు రెట్లు ఎక్కువమంది జనం వచ్చారు. తేజస్వి చురుకైన నాయకుడిగా ఎదుగుతున్నాడు. వాళ్ల నాన్న 'ఐటీ గీటీ జాన్తానై' అని తీసిపారేసినా, యితను మాత్రం ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాడు. తండ్రి జైల్లో ఉన్నా పార్టీని విజయపథంలో నడిపిస్తున్నాడు.
నీతీశ్, బిజెపిలను విడిచి వచ్చిన జితన్‌రాం మాంఝీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. అగ్రవర్ణస్తులు – ఎంబిసిలు ఒక పక్క, యాదవులు-ముస్లిములు మరో పక్క మోహరించారు. చివరకు లాలూ అభ్యర్థే 41 వేల మెజారిటీతో నెగ్గాడు. నిజానికి అది ముస్లిము డామినేటెడ్ నియోజకవర్గం. అందువలన బిజెపికి కానీ బిజెపితో అంటకాగుతున్న నీతీశ్‌కు కానీ విజయం సిద్ధిస్తుందనుకోవడం అత్యాశ. ఇదే పరిస్థితి రాజ్యమంతా ఉందనుకోవడం అపోహ. కానీ యీ పరాజయం జెడియును కృంగదీసింది.
బిజెపితో కలవడం వలననే ఓడిపోయాం అని జెడియు ప్రకటించింది. నిజానికి గాలికోడి లాటి నీతీశ్ యీ మధ్య బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నోట్ల రద్దు శభాష్ అని గతంలో మెచ్చుకున్నవాడే యిప్పుడు అది లోపభూయిష్టం అంటున్నాడు. ఓ పక్క ఆంధ్రకు ప్రత్యేక హోదా యిచ్చేందుకు సాంకేతికంగా కుదరదని కేంద్రం చెపుతున్నా 'మా బిహార్‌కు మాత్రం యివ్వండి' అంటూ బిజెపిని యిరుకున పెడుతున్నాడు. ఈ ఫలితం తర్వాత నీతీశ్ ఎత్తుగడలను జాగ్రత్తగా గమనించాలి.
ఇక మహారాష్ట్ర – ఇక్కడ పార్లమెంటు స్థానాలు రెండూ బిజెపివే. ఒకటి పోగొట్టుకుంది. మరొకటి 30 వేల మెజారిటీతో నిలబెట్టుకుంది. పాల్ఘర్‌లోని బిజెపి ఎంపీ చింతామణి వంగా చనిపోయాడు. అతని కొడుకు శ్రీనివాస్ వంగాను బిజెపి నిలబెడదామనుకుంటూండగానే శివసేన అతన్ని తన పార్టీలోకి లాగేసుకుంది. ఎందుకంటే ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకే ఒక్క శివసేన అభ్యర్థి ఉన్నాడు.
మరో నియోజకవర్గమైన భండారా-గోండియాలో 2014లో బిజెపి అభ్యర్థిగా లక్షన్నర మెజారిటీతో నెగ్గిన నానా పటోలే రైతు సమస్యల విషయంలో మోదీని ఘాటుగా విమర్శించి, పార్టీకి, తన స్థానానికి రిజైన్ చేసి కాంగ్రెసులో చేరాడు. దాంతో ఉపయెన్నిక అనివార్యమైంది. రెండు చోట్లా సంకట పరిస్థితే. పైగా ఒకప్పటి మిత్రపక్షం శివసేన యిప్పుడు శత్రుపక్షమైంది. అందువలన పాల్ఘర్‌లో కాంగ్రెసు నాయకుడైన రాజేంద్ర గవిట్‌ను బిజెపి తన పార్టీలోకి లాక్కుని తన అభ్యర్థిగా నిలబెట్టింది. (ఈనాటి బిజెపిలో ఆరెస్సెస్ సిద్ధాంతాలతో ముఖపరిచయం ఉన్నవారు బహుతక్కువమంది ఉన్నారంటే దానికి కారణం యిలాటి ఫిరాయింపులే).
రంగంలో కాంగ్రెసు, బహుజన వికాస్ అఘాడీ పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష ఓట్లు చీలిపోతాయని లెక్క వేసింది. నిజానికి అదే జరిగింది. బిజెపికి 2.72 లక్షల ఓట్లు (2014లో 5.33 వచ్చాయి) రెండో స్థానంలోని శివసేనకు 2.42 లక్షలు, బహుజన వికాస్ అఘాడీకి 2.22 లక్షల, కాంగ్రెసుకు 48 వేల ఓట్లు వచ్చాయి. మొత్తం మీద 30 వేల తేడాతో బిజెపి గట్టెక్కేసింది. ఇక రెండో స్థానమైన భండారా-గోండియా ముఖ్యమంత్రి సొంత ప్రాంతమైన విదర్భలో ఉంది. అక్కడ ఎన్సీపీ అభ్యర్థికి కాంగ్రెసు మద్దతు ఉంది. దాంతో అది 49 వేల మెజారిటీతో బిజెపి అభ్యర్థిని ఓడించింది.
ఇక యుపికి వస్తే – ఇక్కడ ప్రతిపక్షాలు ఏకం కావడంతో బిజెపి ఒక అసెంబ్లీ స్థానాన్ని, ఒక పార్లమెంటు స్థానాన్ని పోగొట్టుకుంది. యోగి ఆదిత్యనాథ్ కోస్తా కర్ణాటకలో ఓట్లు తెచ్చిపెట్టగలిగాడు కానీ సొంత రాష్ట్రంలో అతనికి పలుకుబడి లేదు. మైనారిటీలకు అతనిపై కోపం ఎలాగూ ఉంది. ఇటీవల దళితులు కూడా చేరారు. ఏప్రిల్ 1న లఖనవ్‌లో బిజెపి దళిత ఎంపీ సావిత్రీబాయి ఫూలే యోగి ప్రభుత్వాన్ని తిట్టిపోసింది. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేయడం ద్వారా దళిత రిజర్వేషన్లకు స్వస్తి పలుకుతున్నాడని ఆరోపించింది.
మరో ముగ్గురు బిజెపి దళిత ఎంపీలు కూడా వేర్వేరు కారణాలతో దళితులకు అన్యాయం చేస్తున్నాడంటూ యోగి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అతని సొంత పార్లమెంటు నియోజకవర్గం, అతని ఉపముఖ్యమంత్రి పార్లమెంటు నియోజకవర్గం రెండిటిలోనూ ఉపయెన్నికలలో ఓడిపోవడం అవమానం తెచ్చిపెట్టింది. ఇప్పుడు కొత్తగా యివి చేరాయి. బిజెపిని ఎదిరించాలంటే తమ విభేదాలను పక్కన పెట్టాలని నిశ్చయించుకున్న ప్రతిపక్షాలు తమ తడాఖాను చూపించాయి.
ఈ సర్దుబాట్లకు యువనాయకులు – ఎస్పీలో అఖిలేశ్ యాదవ్, ఆర్‌ఎల్‌డిలో అజిత్ సింగ్ కొడుకు జయంత్ చౌధురి చొరవ తీసుకున్నారు. వారికి మాయావతి మద్దతు పలికింది. కైరానా నియోజకవర్గం ఒకప్పుడు బిఎల్‌డికి కంచుకోట అయిన పశ్చిమ యుపిలో ఉంది. కానీ 2014లో బిజెపి తరఫున గుజ్జర్ కులస్తుడైన హుకుంసింగ్ 2 లక్షల పై చిలుకు మెజారిటీతో నెగ్గాడు. అతను చనిపోవడంతో యీసారి అతని కుమార్తెను అభ్యర్థిగా పెట్టారు. ఎస్పీ-బియస్పీ గతంలోనే చేతులు కలిపాయి.
ఈసారి ఆర్‌ఎల్‌డిని, కాంగ్రెసుని కూడా కలుపుకున్నాయి. అక్కడ జాట్లు, ముస్లిములు బహుళ సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభా 16 లక్షలైతే ముస్లింలు 5.50 లక్షలు, జాట్లు 1.50 లక్షలు. వారిద్దరి మధ్య 2013లో ముజఫర్‌నగర్‌లో కలహాలు జరగడంతో ఎడమొగం, పెడమొగంగా ఉన్నారు. అల్లర్లను సరిగ్గా కంట్రోలు చేయలేకపోయిందని యిద్దరూ ఎస్పీపై గుర్రుగా ఉన్నారు. అందువలన ప్రతిపక్షాలు ఒక ప్రణాళిక రచించాయి. అఖిలేశ్ బియస్పీ నుంచి తన పార్టీలోకి వచ్చిన తబస్సుమ్‌ను ఆర్‌ఎల్‌డిలో చేరి, దాని అభ్యర్థిగా పోటీ చేయమన్నాడు.
తను కానీ, తన పార్టీలో ముస్లిం నాయకుడు ఆజంఖాన్ కానీ ప్రచారానికి వెళ్లలేదు. తబస్సుమ్ జాట్లు ఉన్న ప్రాంతంలో ప్రచారం చేయలేదు. అజిత్ సింగ్, అతని కొడుకు ముస్లిం ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేయలేదు. అభ్యర్థి పేరు, ఫోటో లేకుండా కేవలం ఆర్‌ఎల్‌డి ఎన్నికల చిహ్నమైన బోరింగు పంపు గుర్తునే వాల్‌పోస్టర్లలో వాడారు. జాట్లకు, దళితులకు కూడా గొడవలుండడం చేత దళితులున్న ప్రాంతాల్లో బియస్పీ కార్యకర్తలు అభ్యర్థి పేరునే ఎక్కువ ప్రచారంలోకి తెచ్చారు. అక్కడ దళితులు 2.5 లక్షలు, గుజ్జర్లు 1.4 లక్షలు, అగ్రవర్ణాలు 3.5 లక్షలు, యితర ఒబిసిలు 1.6 లక్షలు ఉన్నారు.
యుపిలో ఎస్పీ, బియస్పీ ఓట్ల బ్యాంకులను చెదరగొట్టడానికి యోగి ప్రభుత్వం బిసి, ఎస్సీ కులాల్లో వర్గీకరణ తెచ్చి చీలుద్దామని పథకాలు రచిస్తోంది. ఇది జాట్లు, జాతవులకు ఆగ్రహం తెప్పించింది. మొత్తం మీద అందరూ కలిసి బిజెపి అభ్యర్థిని ఓడించారు. తబస్సుమ్‌కు 45 వేల మెజారిటీ వచ్చింది. దీనికి రైతుల ఆగ్రహం తోడయ్యింది. చెరుకు పండించే రైతులకు సర్కారు రూ.13,000 కోట్లు బకాయి పడింది. దానిమాట ఎత్తకుండా ఆలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో జిన్నా ఫోటో గురించే బిజెపి ఎక్కువ చర్చిస్తోంది.
మతపరంగా ఓట్లను సమీకరించడానికి యోగి ఆదిత్యనాథ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి, ముజఫర్ నగర్ అల్లర్ల గురించి పదేపదే ప్రస్తావించాడు. ఆ అల్లర్లలో జాట్లపై పెట్టిన కేసులు మాత్రం ఎత్తివేస్తానని హామీ యిచ్చాడు. రైతులు టీవీల్లో చెప్పారు – 'జిన్నా గోల మాకేల? గన్నా (చెరుకు) సంగతి తేల్చండి' అని. మతం ఎక్కువదూరం తీసుకెళ్లదని బిజెపి యిప్పటికైనా గుర్తించాలి. 2014లో ఓటింగు శాతం 74 కాగా, యీ సారి 54 మాత్రమే. అంటే బిజెపి ఓటర్లు ఉత్సాహంగా ముందుకు రాలేదని అర్థమవుతోంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గమైన నూర్పూర్‌కు వస్తే బియస్పీ సహాయంతో ఎస్పీ బిజెపి నుండి ఆ స్థానాన్ని లాక్కుంది. 44 వేల మెజారిటీ వచ్చింది.
చివరగా నాగాలాండ్‌లో ఎన్సీఎఫ్ స్థానాన్ని బిజెపి మిత్రపక్షమైన ఎన్డీపిపి 1.73 లక్షల మెజారిటీతో గెలిచింది. సిఎం సొంత స్థానమది. కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీనే అక్కడ గెలిపిస్తూ ఉంటారు. ఈ ఫలితాలను బట్టి చూస్తే ప్రతిపక్షాలు ఏకమైతే బిజెపికి ఓటమి తప్పదు అనేది తెలుస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన 20 ఏళ్ల వరకు కాంగ్రెసు కేంద్రంలోను, చాలామటుకు రాష్ట్రాలలోను అధికారంలో ఉండేది. దాన్ని ఓడించడానికి విడివిడిగా ప్రయత్నించి చివరకు నానాగోత్రాల ప్రతిపక్షాలు ఏకమై కొన్ని చోట్ల ఓడించాయి. అయితే మళ్లీ వాళ్లల్లో వాళ్లు కొట్టుకుని పడిపోయారన్నది వేరే విషయం. అలాటి ఐక్యత మళ్లీ యిప్పుడు, బిజెపికి వ్యతిరేకతంగా సాధించడం సాధ్యమా? అనేదే ప్రశ్న.
ఒకటి, రెండు నియోజకవర్గాల్లో పొత్తు అంటే ఫర్వాలేదు కానీ రాష్ట్రమంతా పొత్తులంటే ఎవరు ఎన్ని సీట్లు డిమాండు చేస్తారో తెలియదు. యుపి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు తన తాహతు కంటె ఎక్కువగా ఎస్పీ నుండి తీసుకుని తను దెబ్బ తిని, ఎస్పీని దెబ్బ తీసింది. ఇప్పుడు మాయావతి కూడా తగినన్ని సీట్లు యివ్వకపోతే ఊరుకోనంటోంది. ఎందుకంటే యిప్పటివరకు చరిత్ర ఏం చెపుతోందంటే మాయావతి చెపితే దళితులు యితర పార్టీలకు ఓట్లేస్తున్నారు కానీ ఎస్పీ, బిఎల్‌డి వంటి పార్టీలు తమ ఓట్లను బియస్పీ అభ్యర్థికి బదలాయించ లేకపోతున్నారు. నాయకులు చెప్పినా పార్టీ అభిమానులు దళితులకు ఓట్లు వేయడానికి యిచ్చగించటం లేదు. అందువలన తనే ఎక్కువ సీట్లు తీసుకుందామని మాయావతి ప్లాను.
ఇక కాంగ్రెసు ముఖ్యమైన ఫ్యాక్టర్. అది కూడా ఒక ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. కానీ ఇంకా జాతీయ పార్టీయే అనుకుంటోంది. కాంగ్రెసు వేదికపైకి అందరూ వస్తే తను ప్రధాని కావడం సాధ్యమే అన్నాడు రాహుల్. కాంగ్రెసు వేదికపైకి అందరూ ఎందుకు రావాలి? కూటమిలో ఒకరిగా కాంగ్రెసు ఉండలేదా? మోదీకి ప్రత్యర్థిగా రాహుల్‌ను ముందుకు పెట్టుకుని వెళితే ప్రతిపక్ష కూటమికి ఎవరైనా ఓట్లేస్తారా? తాజా సర్వే ప్రకారం ప్రజాకర్షణ శక్తి విషయంలో 2017 మేలో మోదీ 44%, రాహుల్ 16% ఉంటే 2018 మేలో మోదీ 37%, రాహుల్ 24% ఉంది. అంటే యిద్దరి మధ్య 13% తేడా ఉంది.
రాహుల్ అది ఎప్పటికి పూడ్చేను? అహంభావంతో భాగస్వాములను చిన్నచూపు చూడడం చేతనే కాంగ్రెసు యీ స్థితికి చేరింది. ఇప్పుడు కూడా కర్ణాటకలో ఉమ్మడి ప్రభుత్వం బేరసారాలు పూర్తి కాలేదు చూడండి. ఇలాటి పరిస్థితుల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కరితో సర్దుబాట్లు చేసుకుంటూ రావడం కాంగ్రెసు తరమా? ప్రాంతీయ పార్టీల్లో కూడా ఒక్కోరిది ఒక్కో ఎజెండా. అందరూ కలిసి ఉమ్మడి ప్రణాళిక రచించుకోగలరా? దేశమంతా తెలిసిన మొహం వారిలో ఉందా? మోదీలో లోపాలున్నాయని ఒప్పుకుంటూనే అతనికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి అతనికే ఓటేస్తున్నామని నిట్టూర్చేవారెందరో ఉన్నారు.
ఇదే బిజెపికి ఎడ్వాంటేజిగా మారింది. ఉపయెన్నికల మాట ఎలా ఉన్నా 2019లో మోదీ హవాతో గెలిచేస్తామని బిజెపి నాయకులు చెప్పుకుంటున్నారు. 2014కి, 2019కి చాలా తేడా ఉంది. 2014 ఎన్నికలకు ముందుగానే కాంగ్రెసు ఓటమిని ఒప్పుకుని మెకానికల్‌గా ముందుకు వెళ్లింది అన్నారు సల్మాన్. అది నిజమే, బిజెపి చేస్తున్న ఆరోపణలకు ఎలా బదులు చెప్పాలో తెలియలేదు వాళ్లకి. పైగా మోడర్న్ టెక్నాలజీని మోదీ అద్భుతంగా వాడుకున్నారు. మోదీ వచ్చి అద్భుతాలు చేస్తాడని అప్పట్లో అనేకమంది తటస్థులు కూడా నమ్మి ఓటేశారు.
మోదీ పెర్‌ఫామెన్స్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకోలేదన్న విషయంలో ఏకాభిప్రాయమే. అందువలన మోదీ హవా 2014 స్థాయిలో గట్టిగా వీచదనేది నిశ్చయం. ఇక 2014 ఎన్నికలకై ప్రచారం చేయడానికి మోదీ అప్పుడు వినియోగించినంత సమయం యిప్పుడు వినియోగించలేరు. అప్పుడు గుజరాత్ పాలన వేరేవారికి అప్పగించి తిరిగాడు. ఇప్పుడు ప్రధానిగా ఉండగా అంత కుదురుతుందా? మోదీ వస్తే తప్ప ఓటింగు సరళి బిజెపికి అనుకూలంగా మారని పరిస్థితి వచ్చి పడింది. ఇతర బిజెపి నాయకులు మోదీ భుజాలదాకా కూడా ఎదగటం లేదు, రేదర్ ఎదగనీయటం లేదు.
అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలుస్తూ ఉన్నమాట వాస్తవం. దానికై యితర ప్రాంతాల నుంచి లక్షలాది వాలంటీర్లను తెచ్చి పనిచేయిస్తున్నారు. అమిత్ షా పూర్తి ఏకాగ్రతతో నెలల తరబడి పనిచేస్తున్నారు. దేశమంతా ఒకేసారి పార్లమెంటు ఎన్నికలు జరిగినపుడు అంతమంది వాలంటీర్లు ఎక్కణ్నుంచి వస్తారు? సమయం ఎంత కేటాయిస్తారు? ఈ సమస్య బిజెపి వారికీ తెలుసు. అందుకని నెగ్గడానికి అన్ని రకాల మార్గాలూ ప్రయోగిస్తున్నారు.
ఎన్నికలంటే ఈసి (ఎలక్షన్ కమిషనర్)కు కాదు పని, ఈడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్)కే ఎక్కువ పని అని సోషల్ మీడియాలో జోక్! ప్రతిపక్ష పార్టీల వారిపై ఈడి, సిబిఐ, ఐటీ వినియోగించడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు. క్యాంపు రాజకీయాలు నిర్వహించి, కర్ణాటకలో బిజెపికి అధికారం దక్కకుండా చేసిన డికె శివకుమార ఆప్తుల యిళ్లపై తాజాగా ఐటీ దాడులు జరిగాయి. బెదిరించి, ఊరించి యితర పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటూ పోవడం కూడా ప్రమాదకరమని బిజెపి ఎప్పటికి గుర్తిస్తుందో!
అయితే ఏది ఏమైనా 2019లోపున ప్రతిపక్షం కోలుకుని మోదీని ఓడించగలదని అనుకోవడం సరి కాదు. మే 2018లో జరిపిన లోకనీతి-ఏబిజి-సిఎస్‌డిఎస్ సర్వే ప్రకారం ఎన్డీయేకు 274 (37% ఓట్లు), అంటే దక్షిణాదిన మొత్తం 132 సీట్లలో 18-22, ఉత్తరాదిన మొత్తం 151 సీట్లలో 90 వస్తాయి. యుపిఏకు 164 (31%), అంటే దక్షిణాదిన మొత్తం 132 సీట్లలో 67-75, ఉత్తరాదిన మొత్తం 151 సీట్లలో 25 వస్తాయి. ఇతరులకు 105 (32%), దక్షిణాదిన మొత్తం 132 సీట్లలో 38-44, ఉత్తరాదిన మొత్తం 151 సీట్లలో 36 వస్తాయి. 2017 మేకు 2018 మేకు మధ్య సమాజంలోని భిన్నవర్గాల మధ్య వచ్చిన మార్పుని కూడా సర్వే చెప్పింది.
ఎన్‌డిఏకు మద్దతు ఉన్నత తరగతిలో 2017 మేలో 50% ఉంటే 2018 మేకి అది 48% అయింది. అలాగే.. మధ్యతరగతి 46%-39%, దిగువ మధ్యతరగతి 46%-36%, పేదలు 37%-34%, వ్యాపారులు 50%-40%, రైతులు 49%-37%. యుపిఏ మద్దతు ఉన్నత తరగతి 24%- 28%, మధ్యతరగతి 29%-34%, దిగువ మధ్యతరగతి 24%-31%, పేదలు 30%-30%, వ్యాపారులు 25%-32%, రైతులు 27%-31% అయింది. ఇక ఇతరుల విషయంలో మార్పు ఉన్నత తరగతి 26%- 24%, మధ్యతరగతి 25%-27%, దిగువ మధ్యతరగతి 30%-33%, పేదలు 33%-36%, వ్యాపారులు 25%-28%, రైతులు 24%-32% అయింది. యుపిఏకు అనేక వర్గాల్లో మద్దతు పెరుగుతోంది కానీ ఎలా చూసినా ఎన్‌డిఏ కంటె అన్ని వర్గాల్లో వెనకబడే ఉంది.
ఈ ఉపయెన్నికల ఫలితాలు బిజెపి పట్ల ప్రజాగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. దాన్ని 2019 పాటికి ఎన్‌క్యాష్ చేసుకునే తెలివితేటలు ప్రతిపక్షాలకు లేకపోవచ్చు. కానీ లోపాలను సరిదిద్దుకునే అవకాశం బిజెపికి ఉంది. చూదాం, ఏం చేస్తారో!
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2018)
[email protected]