తిరుపతిలో తాతయ్యగుంట గంగ జాతర వైభవంగా జరుగుతోంది. ఈ గంగజాతరకు విశిష్టత ఉంది. సాధారణంగా ఎక్కడైనా జాతర్లు రెండుమూడు రోజులు జరుగుతుంటాయి. కానీ తిరుపతి గంగజాతర మాత్రం వారం రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏడాది మే మాసంలో నిర్వహించడం ఆనవాయితీ. కరోనా కారణంగా గత రెండేళ్లు గంగ జాతర నిర్వహించలేదు.
ఇప్పుడా భయం లేకపోవడంతో తిరుపతి గంగజాతర ఉత్సాహభరితంగా జరుపుకుంటున్నారు. రకరకాల వేషధారణలతో తిరుపతి సందడిగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ పొలిటికల్ సెలబ్రిటీ, వైసీపీ ప్రజాప్రతినిధి ఆదివారం కలియుగం దైవం శ్రీవేంకటేశ్వరుని వేషధారణలో తిరుపతి వాసులను ఆకర్షించారు. గంగమ్మ తల్లికి శ్రీవేంకటేశ్వరస్వామి స్వయాన అన్న అవుతారని పురాణాలు చెబుతున్నాయి.
గంగమ్మ తల్లి అన్న అవతారంలో ఐదడుగుల వైసీపీ ప్రజాప్రతినిధి సందడి చేశారు. సదరు వేషధారుని వెంట గన్‌మన్, ఇతర ప్రజాప్రతినిధులు ఉండడంతో… ఎవరబ్బా ఈ సెలబ్రిటీ అనే చర్చకు తెరలేచింది. అతనెవరో తెలుసుకునేందుకు జనం ఉత్సాహం ప్రదర్శించారు. అచ్చం శ్రీవేంకటేశ్వరుని రూపాన్ని తలపించేలా వున్న ప్రజాప్రతినిధిలో కొందరు కొండపై స్వామినే ఊహించు కున్నారు.
ఇంతకూ ఈ స్వామి ఎవరో తెలుసుకోవాలనే కుతూహలంతో దగ్గరికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. ఓహో…. మన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తా అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏడాది క్రితం జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.