అక్షరాలా ఇప్పుడు బన్నీ అయోమయంలో వున్నాడు. ఇది టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. నా పేరు సూర్య సినిమా క్యారెక్టర్ కు, నటనకు అప్లాజ్ వచ్చినా, సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫేర్ చేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక, చేష్టలుడిగి వుండిపోయాడట బన్నీ.
విక్రమ్ కే కుమార్ రెడీగా వున్నాడు. కానీ అతగాడి ట్రాక్ రికార్డు ఏమీ అంత అద్భుతం కాదు. అందువల్ల అతనితో చేయాలా? వద్దా? అన్నది మీమాంసగా వుందని తెలుస్తోంది. కొరటాల శివ కోసం రకరకాలుగా ప్రయత్నించినా, ఇంకా ఎస్ అనలేదు నో అనలేదు. దాంతో అక్కడా సమస్య. ఇంకెవరు వున్నారు? త్రివిక్రమ్ వచ్చి చేస్తారని నమ్మకం లేదు.
కొత్తవాళ్లకు అవకాశం ఇద్దాం అనుకుంటే వక్కంతం వంశీతో చేసిన ప్రయోగం తల బొప్పి కొట్టింది. ఓవర్ సీస్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయింది. దాంతో ఏం చేయాలో? ఎవరితో చేయాలో? అసలు చేయాలో? ఏం సబ్జెక్ట్ చేయాలో? అన్నది పాలు పోక, కొన్నాళ్లు రెస్ట్ అన్నది ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది.
సరైన కథ, సరైన డైరక్టర్ కాంబినేషన్ సెట్ అయ్యేదాకా, బన్నీ సినిమా వుండనే వుండదని టాక్ వినిపిస్తోంది. ఆ లెక్కన చాలా టఫ్ సిట్యువేషన్ లో బన్నీ ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, చరణ్, మహేష్, ప్రభాస్, నాని, ఇలా అందరికీ వరుసగా డైరక్టర్లు రెడీగా వున్నారు. కానీ బన్నీకి మాత్రం పరిస్థితి శూన్యంగా వుంది.
డైరక్టర్లను కథ విషయంలో నెలల తరబడి డిస్కషన్లు అంటూ కూర్చోబెట్టడం, బిజినెస్ విషయంలో కావచ్చు, ఇంకా చాలా వ్యవహారాల్లో కావచ్చు అస్సలు చేతులు కదలకుండా కట్టేయడం, తమ మాట తప్ప మరొకటి చెల్లకుండా చేయడం వంటి కారణాలతో పెద్ద డైరక్టర్లంతా గీతా క్యాంప్ కు దూరంగా వుంటున్నారనీ టాక్ వుంది.
భరత్ అనే నేను సినిమాకు కొరటాల అన్నీ తానై వ్యవహరించారు. బన్నీ క్యాంప్ లో అలా కుదరదు. హారిక హాసినిలో త్రివిక్రమ్ నే అంతా. ఇక్కడ నడవదు. అదే బన్నీకి శాపంగా మారుతోందేమో?