ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చాలా చిత్రమైన రీతిలో వ్యవహారాలకు సంబంధించి హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలకు వాగ్దానాలు చేస్తున్నారు. 2014లో ఇచ్చిన అనేకానేక హామీలకు సంబంధించి.. ప్రస్తుతం పాలన సాగిస్తున్న ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించే అనేకానేక విషయాలకు సంబంధించి.. ఆయన డెడ్ లైన్లు అన్నిటినీ.. వచ్చే ఏడాదికి పెడుతున్నారు. కనుక నన్ను గెలిపించకుంటే అది మీ ఖర్మ అన్నట్లుగా చంద్రబాబు తీరు సాగుతున్నదనే విమర్శలు వస్తున్నాయి.
కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తానన్న హామీ ఎప్పటిది? 2014లో మాట ఇచ్చిన చంద్రబాబు… ఇప్పటిదాకా నిలబెట్టుకోలేదు సరికదా.. కేంద్రం ఫైలు తిప్పిపంపిందనే నెపంతో ఆ ఊసెత్తడం మానేశారు. ప్రస్తుతం వేసిన పీఆర్సీ కమిటీ విషయంలోనే ఏడాది గడువులోగా నివేదిక ఇవ్వాలని చెప్పడంలో ఆయన ఆంతర్యం ఏమిటో అంతుబట్టడం లేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణ ఇచ్చిన మూడు నెలల గడువు కూడా ఆయనకు స్పందన కలిగించినట్లు లేదు.
పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు.. కేంద్రంతో సున్నం పెట్టుకున్నాక ఎంచక్కా.. నెపం వారిమీద నెట్టేయడానికి ఆయనకు చాన్సు చిక్కింది. అమరావతి రాజధాని విషయంలో పెద్ద డ్రామా నడుస్తోంది. కోర్ కేపిటల్ నిర్మాణానికి తప్ప తతిమ్మా రాజధానికి కేంద్రం పైసా ఇవ్వక్కర్లేదని అందరికీ తెలిసిన సంగతే. కోర్ కేపిటల్ విషయంలో వారిచ్చే నిధుల కోసం ఎదురుచూడడం సబబు.
మరి మిగిలిన నిర్మాణాలకు సంబంధించి కూడా ఇప్పుడు తాను అనుకుంటున్న ప్రజలనుంచి డబ్బు రుణాలుగా సమీకరించే ప్రయత్నం పాలనలో అయిదో ఏడాదిలో మొదలెట్టడం ఏంటో.. అర్థంకాని సంగతి. అంటే రాజధాని పనులు మొదలు కావాలన్నా వచ్చే ఏడాదే.
చిట్టచివరకు రాజధానిని విజయవాడకు మార్చిన కొత్తల్లో కృష్ణ పుష్కరాల సమయానికి పూర్తిచేసి భక్తులకు అందిస్తాం అని ప్రకటించిన దుర్గగుడి ఫ్లైఓవర్ ను కూడా వచ్చే ఏడాదికి వాయిదా వేసిన ఘనత ఆయనది.
ఇలా ఏ రకంగా చూసినా సరే.. వచ్చే ఏడాది నన్ను మళ్లీ గెలిపిస్తే తప్ప.. ఈ పనులేవీ పూర్తికావు.. ఇక మీ ఖర్మ అని ప్రజలను హెచ్చరిస్తున్నట్లుగా చంద్రబాబు వైఖరి ఉంటున్నదే తప్ప.. తన పాలనలో పనులు పూర్తిచేయాలనే కోరిక కనపించడంలేదు.