పవన్ మళ్లీ పాత గూటికి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ తెలుగుదేశం గూటికే వెళ్లబోతున్నారా? ఎన్నికల దగ్గర చేసి మళ్లీ పవన్ మనసు మార్చుకుని, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేలా పావులు కదులుతున్నాయా? కర్ణాటక ఎన్నికల ఫలితాలు భాజపాకు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ తెలుగుదేశం గూటికే వెళ్లబోతున్నారా? ఎన్నికల దగ్గర చేసి మళ్లీ పవన్ మనసు మార్చుకుని, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేలా పావులు కదులుతున్నాయా? కర్ణాటక ఎన్నికల ఫలితాలు భాజపాకు అనుకూలంగా వస్తే, ఈ విధమైన ప్రణాళిక బలంగా అమలు అవుతుందని, ఏదోవిధంగా పవన్  ను తెలుగుదేశం ను కలిపే బాధ్యతను కొంతమంది 'పెద్దలు' తీసుకోబోతున్నారని తెలుస్తోంది. 

తెలుగుదేశం పార్టీకి దగ్గరగా వుంటే ఎలా వుంటుందన్నది గత మూడేళ్లో, దూరంగా వుంటే ఎలా వుంటుందొ గత ముఫై రోజుల్లో పవన్ కళ్యాణ్ కు పరిచయం అయిపోయింది. మీడియా పరంగా, సోషల్ మీడియా పరంగా పవన్ ర్యాంక్ దారుణంగా కిందకు పడిపోయింది. అసలు పవన్ ఏంటో? అతగాడి ట్వీట్ లు ఏంటో? పార్టీ నిర్మాణం లేదు, పార్టీ ఆఫీస్ నుంచి కాలు బయట పెట్టడం లేదు. 175 చోట్ల పోటీ చేస్తామని అనడం ఏమిటో? అని పవన్ ను అభిమానించేవారు కూడా తల పట్టుకుంటున్నారు. అభిమానంతో ఏమీ అనలేక మౌనంగా వున్నారు.

మరోపక్క అన్నివిధాలా పవన్ తో తెలుగుదేశం అనుకూల మీడియా సైకలాజికల్ గేమ్ ఆడుతోంది. పవన్ పేరు పెద్దగా మీడియాలో వినిపించడం, కనిపించడం ఆగిపోయింది. పవన్ ను కానీ, అతని ట్వీట్ లను కానీ పట్టించుకునే వారే లేరు. పవన్ కూడా చేష్టలుడిగినట్లు వుండిపోయారు. నిజానికి జనాల్లోకి వెళ్లి, లైవ్ లో వుంటే అది వేరుగా వుంటుంది. కానీ పవన్ ఇంటి గడప దాటడంలేదు. 

నిన్న మొన్నటి వరకు పవన్ ఓ నిర్ణయాత్మక శక్తి అన్న రేంజ్ లో టాక్ వచ్చేలా చేసారు. ఇప్పుడు కనీసం ఓ ఎమ్మెల్యేనన్నా గెలిపించుకోగలడా అనేంత వీక్ పర్సనాలిటీగా మార్చే ప్రయత్నం చేసారు. దీనికి తోడు పవన్ వ్యవహారం కూడా అలాగే వుంది. సినిమాలో హీరోల పక్కన మరీ వాళ్లను డామినేట్ చేసేవాళ్లను పెట్టుకోరు. కానీ రాజకీయాల్లో అలా కాదు, సరైన సహాయకులు కావాలి. కానీ పవన్ అలా కాకుండా జీ..హుజూర్ అనే కునేవాళ్లను తప్ప, సరైన సలహాలు ఇచ్చేవారిని ఎంచుకుంటున్నట్లు కనిపించడం లేదు.

మొన్నటికి మొన్న పార్టీకి సలహాదారుగా తీసుకున్న దేవ్ ఉదంతం పవన్ ను దారుణంగా దెబ్బ తీసింది. ఈ విషయంలో మీడియా చాలా యాక్టివ్ గా వ్యవహరించింది. గతంలో పవన్ తెలుగుదేశం పార్టీకి కొన్ని సిఫార్సులు చేసినపుడు మీడియా వాటిని ఏ మాత్రం వెలికితీయకుండా దాచేసింది. కానీ ఇప్పుడు పవన్ ఏం చేసినా, భూతద్దం పెట్టి వెదుకుతున్నారు.

మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరూ  పవన్ ను చిన్న మాట కూడా అనకుండా కట్టడి చేసారు. తాము పవన్ కు ఎంత మర్యాద, గౌరవం ఇచ్చామో, తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేసింది. లోకేష్ సహా చాలా మంది పవన్ అంటే ఇప్పటికీ తమకు గౌరవం అని పదే చెబుతున్నారు.

ఇదంతా పవన్  మీద ప్రేమ కాదు, పవన తెచ్చే ఓట్ల మీద ప్రేమ అని తెలియంది కాదు. మోడీని దూరం చేసుకుని, పవన్ ను దూరం చేసుకుని, ఒంటరిగా బరిలోకి దిగితే, 2019 ఎన్నికల్లో కష్టం అవుతుందని చంద్రబాబుకు తెలియంది కాదు. అదే కనుక పవన్ పక్కన వుంటే ఆ చరిష్మా వల్ల వచ్చే ఓట్లు వస్తాయి. పవన్ కు గెలిచే సత్తా లేకపోవచ్చు కానీ, ఓడించే సత్తా, గెలిపించే శక్తి వున్నాయి. ఆ శక్తి తెలుగుదేశం పార్టీకి కావాలి. 

పవన్ ఎలాగూ మాట నిబద్దత వున్న వ్యక్తి కాదు. మాటను చులాగ్గా మార్చేయడం ఆయనకు అలవాటు. 'అప్పుడు పరిస్థితుల రీత్యా అలా అన్నాను, ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందుకే ఇలా మారాను' అని రెండు క్షణాల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించగలరు. అందుకే ఎన్నికలు దగ్గరకు వచ్చే వరకు పవన్ తో ఇలా సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడుతూ, అతన్ని పల్లెత్తు మాట అనకుండానే కార్నర్ చేస్తూ, తమ దారికి తెచ్చుకోవడానికి తెలుగుదేశం లాంగ్ టెర్మ్ ప్రణాళిక రచించి అమలు చేస్తోందని, దానికి పవన్ పడక తప్పదని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

మరోపక్క అన్న విధాలా పవన్ తో తెలుగుదేశం అనుకూల మీడియా సైకలాజికల్ గేమ్ ఆడుతోంది. తనకు గతంలోనే అంతా బాగుందని, ఇప్పుడు తనకు ఏమీ బాగాలేదని, పవన్ తనంతట తాను అనుకునేలా చేస్తోంది. పైగా పవన్ కు కాస్త బద్దకం ఎక్కువే అని అనిపిస్తూ వుంటుంది అతని యాక్టివిటీ చూస్తుంటే. అలాంటి వాళ్లకు ఏదో విధంగా లైమ్ లైట్ లో వుండాలని వుంటుంది కానీ, మరీ కష్టపడిపోవాలని కాదు. నిజానికి తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు చేసుకున్న తరువాత పవన్ కనుక జనాల్లోకి వెళ్లిపోయి వుంటే పరిస్థితి ఇలా వుండేదే కాదు. పవన్ కు ఓ లెవెల్ ఇమేజ్ వచ్చి వుండేది. 13 జిల్లాల్లో కొద్దిగానైనా తిరిగి వుంటే వేరుగా వుండేది. అలాంటి ఆలోచనే పవన్ కు వున్నట్లు కనిపించడం లేదు. 

ఇక పార్టీ నిర్మాణం అన్నది ఆది నుంచీ లేదు. ఇలాంటి వ్యక్తి ఎన్నికల టైమ్ లో మాత్రం ఏం చేస్తారు. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మంచి ఆపర్ వస్తే హ్యాపీ. అప్పుడు ఊ..అన్నా, ఆ..అన్నా ఫుల్ పబ్లిసిటీ ఫ్రీగా, కష్టపడకుండా వస్తుంది. ఇలాంటివి అన్నీ చవిచూపించి, పవన్ ను తమ వైపు మళ్లీ వచ్చేలా తెలగుదేశం పార్టీ కాస్త గట్టిగానే కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ యత్నాలకు పవన్ లొంగుతారో లేదో చూడాలి.