శ్రీరెడ్డిపై మీడియా బ్యాన్?

బ్యాన్.. బ్యాన్.. బ్యాన్. ఆ మధ్య టాలీవుడ్ లో అంతా ఇదే రగడ. మీడియాను బ్యాన్ చేస్తారట. న్యూస్ చానెళ్లను బ్యాన్ చేస్తారట. ఇవే మాటలు. కానీ అదంతా టీ కప్పులో తుపాను మాదిరిగా…

బ్యాన్.. బ్యాన్.. బ్యాన్. ఆ మధ్య టాలీవుడ్ లో అంతా ఇదే రగడ. మీడియాను బ్యాన్ చేస్తారట. న్యూస్ చానెళ్లను బ్యాన్ చేస్తారట. ఇవే మాటలు. కానీ అదంతా టీ కప్పులో తుపాను మాదిరిగా తేలిపోయింది. ఇండస్ట్రీ జనాలు హమ్మయ్య అనుకున్నారు. మీడియా జనాలు హ్యాపీగా ఫీలయ్యారు. అసలు ఈ వివాదానికి విత్తనం పడిన వైనం వేరే వుంది.

అసలు ఆ విత్తనం పడ్డ వైనం దగ్గర నుంచే చక్రం తిప్పారని, అసలు విషయాన్ని బ్యాన్ బ్యాన్ అంటూ వేరే రూట్లోకి మళ్లించి, మళ్లీ వాళ్లే, సర్లే.. వద్దు అనిపించారని, తమ జనాలతో కమిటీ వేసుకున్నారని, ఆ విధంగా అసలు సంగతి మరుగున పడేలా చేసారని గుసగుసలు వుండనే వున్నాయి.

అదంతా వేరే సంగతి. ఇదిలావుంటే అసలు వివాదానికి కారణమైన శ్రీరెడ్డికి ఇప్పుడు కవరేజ్ లేకుండా పోయింది. నిన్నటికి నిన్న ఓ స్టూడియో దగ్గర హల్ చల్ చేద్దాం అనుకుంది. కుదరలేదు. ప్రెస్ క్లబ్ దగ్గరకు వెళ్లి కాస్త నాలుగు మాటల తూటాలు పేల్చుదాం అనుకుంది. కానీ మొత్తం మీడియాలో ఎక్కడా శ్రీరెడ్డి మాటలు కనిపించలేదు. వినిపించలేదు.

గతంలో శ్రీరెడ్డి ఏ సోషల్ మీడియాలో అయినా ఊ.. అంటే అంత.. ఆ అంటే అంతకు అంత హడావుడి చేసిన మీడియా ఇప్పుడు శ్రీరెడ్డి అంటే ఎవరో తెలియనట్లుగా వుండిపోయింది. రోజూ గంటలకు గంటలు డిస్కషన్ కు పోటీలుపడి కార్లు పంపిన చానెళ్లు ఇప్పుడు ఆ బాపతు జనాలు అంటే ఎవరో తెలియనట్లు వుండిపోయింది.

అంటే ఇప్పుడు అసలు సిసలు బ్యాన్ మీడియానే విధించింది అన్నమాట. సినిమా జనాలకు వ్యతిరేకమైన, సినిమా జనాల ఘనకార్యాలు చాటిచెప్పే డిస్కషన్లు, ముచ్చట్లను చానెళ్లు తాత్కాలికంగా బ్యాన్ చేసాయన్నమాట. ఇన్నాళ్లు బ్యాన్ బ్యాన్ అంటే అట్నుంచి అనుకున్నారంతా.. ఇట్నుంచి అన్నమాట.