గరుడవేగతో హీరోగా మరో సక్సెస్ అందుకున్న రాజశేఖర్ ఎట్టకేలకు విలన్ గా మారబోతున్నాడు. క్యారెక్టర్ బాగుంటే విలన్ వేషాలు కూడా వేస్తానని గతంలో ప్రకటించిన రాజశేఖర్.. చెప్పినట్టుగానే ప్రతినాయకుడి పాత్రలోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు. చాన్నాళ్ల తర్వాత రాజశేఖర్ కు హిట్ ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్, ఈసారి అతడ్ని విలన్ గా చూపించబోతున్నాడు.
అవును.. తనకు హిట్ ఇచ్చిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోనే విలన్ గా మారేందుకు రెడీ అవుతున్నాడట రాజశేఖర్. ఈ మేరకు రాజశేఖర్ ను ప్రవీణ్ సత్తార్ ఒప్పించినట్టు తెలుస్తోంది. త్వరలోనే రామ్ హీరోగా ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడు ప్రవీణ్ సత్తారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై రీసెంట్ గా ఈ సినిమా లాంఛ్ అయింది కూడా. ఇందులోనే విలన్ గా నటించేందుకు రాజశేఖర్ ఒప్పుకున్నాడట.
నిజానికి రాజశేఖర్ ను విలన్ గా మార్చే ప్రయత్నాలు గతంలో చాలానే జరిగాయి. మెగా కాంపౌండ్ కూడా ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ కథ, క్యారెక్టర్ నచ్చక అలాంటి చాలా ఆఫర్లను తిప్పికొట్టాడు రాజశేఖర్. తాజాగా బాలయ్య సినిమాలో కూడా రాజశేఖర్ ను విలన్ గా తీసుకునేందుకు ప్రయత్నించినట్టు వార్తలొచ్చాయి. ఎట్టకేలకు రామ్ సినిమాతో ప్రతినాయకుడిగా మారడానికి రాజశేఖర్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.