వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రాజకీయ వ్యూహం ఏంటి? క్షేత్రస్థాయిలో షర్మిల పర్యటించడం లేదు. కేవలం సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో తన రాజకీయ ఎదుగుదల కేసీఆర్‌ను టార్గెట్ చేయడంపైనే ఆధారపడి వుంటుందని ఆమె విశ్వసిస్తున్నారు. అయితే రాజకీయంగా తెలంగాణలో ఆమె అనుకున్నంతగా ఎదగడం లేదు. ఆమె పార్టీకి ఆదరణ లభించడం లేదు.
రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ సొంత పార్టీని స్థాపించి హడావుడి చేశారు. పాదయాత్ర చేస్తుండగా, కేసీఆర్ సర్కార్ అడ్డు తగలడంతో మధ్యలోనే ఆగిపోయింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించి పాదయాత్ర చేసేందుకు సానుకూల తీర్పు పొందినా, ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో ఆమె అడుగులు ముందుకు పడలేదు.
ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అయితే కాంగ్రెస్‌లో షర్మిల చేరుతారనే ప్రచారం కొన్నాళ్ల పాటు విస్తృతంగా సాగింది. ఇప్పుడు అది కూడా లేదు. ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు షర్మిలకు ఇస్తారనే ప్రచారం జరిగింది. అన్నకు వ్యతిరేకంగా ఏపీలో రాజకీయాలు చేసే ప్రశ్నే లేదని, తెలంగాణలోనే తన రాజకీయ భవిష్యత్ ముడిపడి ఉందని కాంగ్రెస్ అధిష్టానానికి తేల్చి చెప్పినట్టు మరో ప్రచారం.
ఇదిలా వుండగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో షర్మిల రాజకీయ పంథా ఎలా వుంటుందో అనే చర్చ జరుగుతోంది. సొంతంగా రాజకీయ కార్యకలాపాలు చేసుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించదని షర్మిలకు అర్థమైంది. దీంతో మరోపార్టీ అవసరం ఆమెకు ఉంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌తో షర్మిల స్నేహసంబంధాలపై విస్తృత ప్రచారం జరుగుతోంది. కేవలం సోషల్ మీడియా వేదికగా పోస్టులతో రాజకీయం చేయలేమని ఆమెకు తెలుసు. అలాగని ఏ పార్టీతోనూ అవగాహన లేకుండా ముందుకెళ్లడం కుదరదని కూడా ఆమెకు తెలియంది కాదు. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం ఉత్తుత్తి ప్రచారమే అని ఆమె అనుచరులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం షర్మిల తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ నిర్ణయం ఏంటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. కాంగ్రెస్‌పై ఆమె సానుకూలంగా ఉన్నారనేది వాస్తవం. గత నెల 8న వైఎస్సార్ జయంతి నాడు ఆయనకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ నివాళులర్పిస్తూ ట్వీట్ చేయగా, అందుకు కృతజ్ఞతగా షర్మిల రీట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.
“డాక్టర్ వైఎస్సార్ తెలుగు ప్రజల సేవలో దివంగతుడైన నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నేత. మీ నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉందని వైఎస్సార్ నమ్మారు. డాక్టర్ వైఎస్సార్ మీ గుండెల్లో నిలిచి ఉన్నందుకు ధన్యవాదాలు” అంటూ షర్మిల రీట్వీట్ చేయడం తెలిసిందే. రాహుల్‌పై ప్రత్యేక అభిమానాన్ని చాటిన షర్మిల… త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారానికి బలం కలిగించారు. కానీ అలా జరగలేదు.
తాజాగా షర్మిల చేరికపై సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో భారీ చేరికలున్నాయని, షర్మిల అంశం తన దృష్టిలో లేదని చెప్పారు. షర్మిలతో తెలంగాణలో అవగాహనకు వస్తే, కేసీఆర్‌కు రాజకీయంగా ఆయుధం ఇచ్చినట్టే అని ఆ పార్టీ భయపడుతోంది. మరి షర్మిల అడుగులు ఎటు వైపు అన్నది కాలం తేల్చాల్సిందే.