షర్మిల డీల్ ఎన్నికల తర్వాతనేనా?

119 స్థానాల్లో పోటీచేసి తీరుతానని, తాను రెండు నియోజకవర్గాలనుంచి బరిలో ఉంటానని, తనతో పాటు తన తల్లి, తన భర్త కూడా ఎన్నికల్లో పోటీచేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చాలా గట్టిగా ప్రకటించిన షర్మిల…

119 స్థానాల్లో పోటీచేసి తీరుతానని, తాను రెండు నియోజకవర్గాలనుంచి బరిలో ఉంటానని, తనతో పాటు తన తల్లి, తన భర్త కూడా ఎన్నికల్లో పోటీచేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చాలా గట్టిగా ప్రకటించిన షర్మిల ‘మిడిల్ డ్రాప్’ అయ్యారు. తాను డ్రాప్ కావడాన్ని ఆమె చాలా ఘనంగా సమర్థించుకున్నారు. 

‘గెలుపు గొప్పదే గానీ.. అంతకంటె త్యాగం మరింత గొప్పదని’ ఆమె చెప్పుకున్నారు. మొత్తానికి ‘‘యుద్ధం గెలిసేటోడు వీరుడు శూరుడు.. యుద్ధం ఇడిసేటోడే దేవుడు’’ అనే సిరివెన్నెల సినిమా పాటలోని వాక్యాలను షర్మిల తనకు తాను అన్వయించుకుని ఈ పని చేస్తున్నారు. తనను క్షమించమని కూడా పార్టీ కార్యకర్తలను ఓమాట అడిగేశారు.

కాంగ్రెస్ పార్టీకి ఆమె చేస్తున్నది మహోపకారమే అని చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీ ఆమెకు చేస్తున్న ప్రత్యుపకారం ఏమిటి? షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని అన్నప్పుడు.. చేస్తే చేయవచ్చు గానీ.. ఆమె వెళ్లి ఏపీలో రాజకీయం చేసుకోవాలని, తెలంగాణకు మళ్లీ వలసనేతలు అక్కర్లేదని కాంగ్రెసులోనే కొందరు నాయకులు అభ్యంతరాలు చెప్పారు. మొత్తానికి విలీనం ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం అనేది కేవలం ఒక వ్యూహం అనే అభిప్రాయం ఇప్పుడు కలుగుతోంది.

షర్మిల పార్టీని విలీనం చేసుకుంటే.. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వైఎస్సార్ కూతురును విలీనం చేసుకున్న కాంగ్రెస్ ను విలన్ గా అభివర్ణిస్తూ కేసీఆర్ రెచ్చిపోయే అవకాశం ఉంది గనుక.. ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఈ వ్యూహానికి వెళ్లినట్టు కనిపిస్తోంది. ఆమె ఇప్పుడు పోటీనుంచి విరమించుకుని కాంగ్రెసుకు మద్దతు ప్రకటించారు. ఈ నెల రోజుల వ్యవధిలో ఏర్పడగల అవసరాల్ని బట్టి, ప్రజల స్పందనలో సంకేతాల్ని బట్టి.. షర్మిలను ప్రచారం కోసం కూడా కాంగ్రెస్ వాడుకునే అవకాశం ఉంది. కేసీఆర్ ను తిట్టడం ఒక్కటే ఎజెండాగా ఆమె ప్రచార సభల్లో రెచ్చిపోవచ్చు.

ఇంతా కలిపి ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ ఆమెకు చేయగల ప్రత్యుపకారం తెరమీదకు వస్తుంది. రాజ్యసభ సభ్యత్వమే ఇస్తారా? ఇంకేదైనా మేలు చేస్తారా? అనేది అప్పుడు తేలుతుంది. తన తల్లి, భర్త కూడా ఎన్నికల్లో పోటీచేయాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడం ద్వారా.. షర్మిల తాను కాంగ్రెసు నుంచి ఆశిస్తున్నది ఏమిటో స్పష్టంగానే సంకేతాలు ఇచ్చారు. 

పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే.. ఆమె ముగ్గురికీ పదవులు కావాలనే డిమాండ్ తో పట్టుపట్టవచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా సరే.. ఒక రాజ్యసభ పదవి మాత్రం ఆమెకోసం గ్యారంటీగా వేచి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.