అదుగో కొరటాల.. ఇదిగో మీటింగ్

కొత్తగా మీసాలు వచ్చిన వాడి వ్యవహారంలా వున్నట్లు కనిపిస్తోంది డైరక్టర్ కొరటాల శివ సంగతి. భరత్ అనే నేను సినిమా హిట్ అయింది. అది వాస్తవం. అందులో సందేహం లేదు. కానీ ఇంకా ఇంకా…

కొత్తగా మీసాలు వచ్చిన వాడి వ్యవహారంలా వున్నట్లు కనిపిస్తోంది డైరక్టర్ కొరటాల శివ సంగతి. భరత్ అనే నేను సినిమా హిట్ అయింది. అది వాస్తవం. అందులో సందేహం లేదు. కానీ ఇంకా ఇంకా ఆడాలి అన్నది కోరిక. అదీ తప్పుకాదు. అందుకోసం ప్రమోషన్లు చేయడమూ తప్పుకాదు.

కానీ ఇప్పటికి సినిమా విడుదలకు ముందు నుంచి అలా మీడియాతో ముచ్చట్లు పెడుతూనే వున్నారు. ముందు ఒంటిరి ఇంటర్వూలు అన్నారు. తరువాత పేరంటాలు, బంతిభోజనాల టైపు మీట్ లు అన్నారు. ఆ వెంటనే సక్సెస్ మీట్ అన్నారు. అది కాదు, మళ్లీ అసలు సిసలు సక్సెస్ మీట్ అన్నారు. ఇప్పుడు ఇంకా చాలదు మళ్లీ మరోసారి వన్స్ మోర్ అనేసారు.

ఈ మధ్యలో విజయవాడ, తిరుపతిలో మాట్లాడారు. కేటీఆర్ తో కలిసి భేటీ వేసారు. చెప్పిందే చెబుతూ, అద్భుతమైన మెసేజ్ అంటూ టముకు వేస్తున్నారు. ప్రతి ఒక్కరికి భయం, బాధ్యత వుండాలని చెప్పడం, గ్రామ స్వరాజ్యం అన్నది ఇవన్నీ మంచి పాయింట్లే కాదని కాదు. కాని అదే పనిగా ఆయనే టముకు వేస్తే, అది కూడా హైదరాబాద్ లోనే, అదే మీడియా జనాలతో అయితే బోర్ కొట్టదా?

నిజానికి ప్రమోషన్ చేయాలని అనుకున్నపుడు విశాఖలో మీడియానో, రాజమండ్రి, అమరావతి ఇలా పలు చోట్ల అయితే కొత్తగా వింటారు. పాత సంగతులే అయినా బోర్ కొట్టవు. బహుశా కొరటాల మీట్ ఇక ఇదే ఆఖరు అనుకోవాలి. ఎందుకంటే రంగస్థలం తరువాత సుకుమార్ విదేశాలకు విశ్రాంతికి వెళ్లినట్లు కొరటాల కూడా వెళ్లబోతున్నారట.