ఇప్పటి వరకు ఆంధ్రలో పెద్ద సినిమా అయితే తెల్లవారుఝామును అయిదు గంటల నుంచి షోలు వేసుకునే కొత్త ఆచారం వుంది. అజ్ఞాతవాసి సమయంలో మిత్రుడు పవన్ కళ్యాణ్ కోసం ఈ అయాచిత వరాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చేసింది. ఆ తరువాత ఇదే వరం మరో ఒకటి రెండు పెద్ద సినిమాలకు కూడా వర్తింప చేసింది. రీసెంట్ గా భరత్ అనే నేనుకు, రంగస్థలం సినిమాలకు కూడా ఇచ్చారు.
సరే భరత్ అనే నేను సినిమాలో కథనాయకుడు మహేష్ బాబు 'దేశం' ఎంపీ గల్లా జయదేవ్ కు బావమరిది. అలాగే రంగస్థలం సినిమా నిర్మాతలు తెలుగుదేశంతో సన్నిహిత సంబంధాలు వున్నవారే. ఇప్పుడు సూర్య దగ్గరకు వచ్చేసరికే తకరారు వచ్చింది.
ఓ పక్క పవన్ కళ్యాణ్ కాస్తా తెలుగుదేశం పార్టీకి దూరం కావడం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, అలాగే మెగా క్యాంప్ మొత్తం మీడియాతో సున్నం పెట్టుకోవడం వంటి పరిణామాలు సంభంవించాయి. బహుశా మరి అందుకే కావచ్చు, అయిదు గంటల నుంచి షోలు అడుగుతూ 'నా పేరు సూర్య' పెట్టుకన్న దరఖాస్తు అలా పెట్టిన చోటే వుందని తెలుస్తోంది. పెట్టిన చోట నుంచి ఆ అప్లికేషన్ అంగుళం కూడా కదల్లేదని తెలుస్తోంది. అయితే ఇంకా మూడు రోజులు టైమ్ వుంది. ప్రభుత్వం తలుచుకుంటే ఒక రోజు ముందుగా అయినా అనుమతి ఇవ్వవచ్చు.
అన్ని సినిమాలకు ఇచ్చి ఈ సినిమాకు ఇవ్వకుండా ప్రభుత్వం కక్షసాధింపు అని అనుకునే ప్రమాదం వుంటుంది కనుక ఇస్తారనే అనుకోవాలి. లేదూ మరీ మొండితనంగా వెళ్లి ఝలక ఇస్తారో? చూడాలి.
ఇదిలావుంటే తెలంగాణ ప్రభుత్వం ఎవరైనా ఒకటే పాలసీ అమలు చేస్తోంది. రాత్రి వేళ, తెల్లవారు ఝామన ఆటలకు అనుమతి ఇవ్వడం లేదు. కేవలం ఉదయం 8గంటలకు అయితే ఓకె అంటోంది. అందువల్ల 4న 8గంటల ఆటల నుంచే హైదరాబాద్ లో సూర్య హల్ చల్ ప్రారంభమవుతుంది.