పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డితో యూత్ హార్ట్ త్రోబ్ అనిపించుకున్న విజయ్ దేవరకొండ స్టార్ అనే ఇమేజ్ ఛట్రంలోకి వెళ్లిపోకుండా జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. పాత్ర నచ్చితే ఏదయినా చేసేయడం, హీరోగానే చేస్తానంటూ భీష్మించుకుని కూర్చోకపోవడం అతడిని మిగతా యువ హీరోల నుంచి సెపరేట్ చేస్తోంది. మహానటి చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో తమిళ, మలయాళ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడు.
అంతటితో ఆగకుండా తమిళంలో పూర్తి స్థాయిగా 'నోటా' అనే చిత్రం చేస్తున్నాడు. తెలుగులో తన హిట్ సినిమా మార్కెట్ ఇరవై, ఇరవై అయిదు కోట్ల వరకు వుంటుంది. ఇప్పటికిప్పుడు అది విస్తరించే అవకాశాలు తక్కువే. నెమ్మదిగా ఆ మార్కెట్ పెంచుకోవడంపై ఆధారపడకుండా ఇతర భాషల్లోకి తన మార్కెట్‌ని విస్తరించుకుంటున్నాడు. తద్వారా తన సినిమాలకి మరో పది, పదిహేను కోట్ల వరకు బిజినెస్ పెరుగుతుంది.
గతంలో పలువురు తెలుగు హీరోలు ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారే కానీ సక్సెస్ అవలేదు. నాని, శర్వానంద్, సందీప్ కిషన్ తదితరులు ప్యారలల్‌గా తమిళ మార్కెట్‌ని సొంతం చేసుకుందామని చూసినా తగిన ఫలితాలు రాలేదు. విజయ్ దేవరకొండ మాత్రం తన ప్రయత్నాలు సక్సెస్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నాడు. మహానటి, నోటా చిత్రాలతో విజయ్‌కి ఆశించిన ఫలితాలు వస్తే పాన్ సౌత్ ఇండియన్ యాక్టర్‌గా స్థిరపడేందుకు మరింత గట్టి ప్రయత్నాలు చేసుకోవచ్చు.