పించ్ హిట్టర్ లా వచ్చి హిట్ కొట్టిన సినిమాలు, సందర్భాలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో బడా సినిమాలన్నీ ఫెయిలైతే, చిన్న సినిమాలే సక్సెస్ లు కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. రెండు పెద్ద సినిమాలు సూపర్ హిట్ టాక్ తో మార్కెట్లో నడుస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో 2చిన్న సినిమాలు వస్తున్నాయి. మరి వీటి పరిస్థితేంటి..? బాక్సాఫీస్ వద్ద మెరుస్తాయా.. లేక పెద్ద సినిమాల మధ్య నలిగిపోతాయా..?
రేపు ఆచారి అమెరికా యాత్ర, కణం సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలపై అంచనాలు అంతంతమాత్రమే. కామెడీ వర్కవుట్ అయితే ఆచారి క్లిక్ అవుతుందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. ఇక కణం సినిమా విషయానికొస్తే, ఏదో మేజిక్ జరిగితే తప్ప ఈ సినిమా హిట్ అవ్వడం కష్టమనే టాక్ నడుస్తోంది. ఈ సినిమా కథ అలాంటిది మరి.
కామెడీతో హిట్ కొట్టిన అనుభవం మంచు విష్ణుకు ఉంది. సో.. ఈసారి విష్ణు-బ్రహ్మానందం కాంబినేషన్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి. సినిమాకు మెయిన్ ఎలిమెంట్ కూడా ఇదే. అయితే ఈ పాయింట్ ను వదిలేసి సినిమాకు ప్రమోషన్ చేస్తుండడం విడ్డూరం.
ఇక కణం విషయానికొస్తే.. దీనిదో విచిత్ర పరిస్థితి. తెలుగులో హ్యాపెనింగ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న సాయిపల్లవి ఇందులో హీరోయిన్. ఛలోతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నాగశౌర్య హీరో. ఇలాంటి పెయిర్ ఉన్నప్పటికీ సినిమాపై బజ్ లేదు. కారణం ఈ సినిమా కథ భ్రూణహత్యలు, పిండం, ఆత్మ లాంటి అంశాల చుట్టూ తిరుగుతుంది.
ఓవైపు భరత్ అనే నేను, రంగస్థలం లాంటి సినిమాలు మార్కెట్లో నడుస్తుంటే ఈ టైపు సినిమాలు ఆడుతాయా అనేది అందర్లో అనుమానం. కానీ చెప్పలేం. ఏదైనా జరగొచ్చు. అన్నట్టు రేపు రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాలు శాటిలైట్ మాత్రం పూర్తిచేసుకున్నాయి. జీ తెలుగు ఛానెల్ ఈ రెండు సినిమాల్ని ఒకేసారి దక్కించుకుంది.