గడచిన మూడు నాలుగు రోజులుగా టాలీవుడ్ మీడియా బ్యాన్ అనే హడావుడి కనిపిస్తోంది. చిత్రమేమిటంటే, టాలీవుడ్ నుంచి ఈ విషయమై ఏ మాట బయటకు రాలేదు, ఎవర్వూ మాట్లాడలేదు కానీ, బ్యాన్ చేస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయనే విధమైన ప్రకటనలు మీడియా వైపు నుంచి మాత్రం వినిపించడం ప్రారంభించేసాయి.
కొన్ని చానెళ్లు అయితే నిన్నటి దాకా హీరోలను పట్టుకుని వేలాడింది మరిచిపోయి, నిన్నటి దాకా ఆడియో ఫంక్షన్ల హక్కుల కోసం వెంపర్లాడింది మరిచిపోయి, ‘దరిద్రం వదిలిపోయింది. వీళ్లతో వచ్చేదేముంది? పోయేదేముంది?’ అనే టైపులో కార్యక్రమాలు, కామెంట్లు మొదలు పెట్టేసాయి. అసలు ఇండస్ట్రీ ఆలోచన ఏమిటి? బ్యాన్ అనేది ఎందుకు? ఎలా? అసలు బ్యాన్ అన్న పదం ఎందుకు వినిపిస్తోంది? ఇండస్ట్రీ చేస్తున్న ఆలోచన బ్యాన్ నా? కాస్ట్ కటింగ్ నా?
జూన్ 1 నుంచి?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చేసారు. అయితే అది అమలు మాత్రం మే 1నుంచి నా జూన్ 1నుంచి నా అన్నదే ఆగింది. నూటికి తొంభై శాతం జూన్ 1నుంచే వుండొచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే అప్పటికి దాదాపు పెద్ద సినిమాలు అన్నీ అయిపోతాయి. చిన్న, మీడియం సినిమాలు వుంటాయి.
పైగా పోస్ట్ సమ్మర్ పెద్ద ఇంపార్టెంట్ సీజన్ కాదు. ఆ తరువాత దసరా వరకు పెద్ద సీజన్ కాదు. పెద్ద హీరోల సినిమాలు కూడా లేవు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు సెట్ మీద వున్నాయి. వీటిల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలు దసరాకు, ఆ తరావతే. ప్రభాస్ సినిమా 2019లో. ఇంకెవరి సినిమాలు ఇప్పట్లో లేవు.
అందువల్ల జూన్ 1నుంచి టాలీవుడ్ నిర్ణయాలు అమలు చేసినా, వాటి రియాక్షన్, వాటితో వచ్చే సమస్యలు అన్నీ క్లియర్ గా అర్థం చేసుకుని, మార్పులు చేర్పులు చేసుకోవడానికి కాస్త టైమ్ వుంటుంది.
కాస్ట్ కటింగ్ నా? నిషేధమా?
ఇండస్ట్రీ నిర్ణయాలు తెలుస్తుంటే ఒక పక్క కాస్ట్ కటింగ్ లా అనిపిస్తోంది. మరో పక్క బ్యాన్ లా అనిపిస్తోంది. అసలు వినిపిస్తున్న నిర్ణయాలు ఏమిటంటే, న్యూస్ చానెళ్లకు సినిమా ప్రకటనలు వుండవు. ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లకే ఇస్తారు. న్యూస్ చానెళ్ల రేటు 700రేంజ్ లోనే వున్నా, ఎంటర్ టైన్ మెంట్ చానెళ్ల రేటు 2000రేంజ్ లో వున్నా, సినిమా ప్రకటనలు అక్కడ ఇవ్వడమే లాభదాయకం అన్న భావనకు సినిమా జనాలు వచ్చారు. అలాగే వెబ్ సైట్లకు లాండింగ్ పేజీలు ఇవ్వడంలో కూడా కంట్రోలు విధిస్తారు. కొన్ని సెలెక్టెడ్ సైట్లకే ఇస్తారు.
ప్రింట్ మీడియాకు ప్రాధాన్యత ఇస్తూ, అక్కడ కూడా ఫుల్ పేజీలను కంట్రోలు చేస్తారు. అలాగే ఇతరత్రా ప్రచారం ఖర్చులు కూడా పూర్తిగా తగ్గిస్తారు. సినిమా పబ్లిసిటీకి మీడియాకు ఎంత ఖర్చు చేస్తున్నా, సినిమా మంచి చెడ్డల దగ్గరకు వచ్చేసరికి ఏ ఒక్క మీడియా కూడా అస్సలు మొహమాటం చూపించడం లేదని, ఎవరి క్రెడిబులిటీ వాళ్లు చూసుకుంటున్నారని, ఒకటి రెండు సైట్లు మాత్రం కాస్త మొహమాట పడతున్నాయని, మిగిలిన చానెళ్లు, సైట్లు పూర్తిగా నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్నాయని, అందువల్ల లక్షలకు లక్షలు ఎందుకు ఖర్చుచేయడం అని నిర్మాతలు చాంబర్ లో వాదిస్తున్నారు.
బ్యాన్ అన్న పదం ఎందుకు?
ఎలా చూసుకున్నా కాస్ట్ కటింగ్ అన్నది మంచిదే. అది నిర్మాతల ఇష్టం. అందులో వాదనలకు తావు లేదు. కానీ న్యూస్ చానెళ్లకు ఇవ్వం, ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లకే ఇస్తాం అని ముందుగా ప్రకటించడం ఎందుకు? అనవసరపు వివాదానికి దారి తీయడం తప్ప? అన్నది కొందరి పాయింట్. నిర్ణయంగా కాకుండా, నిర్మాతల ఇష్టంగా దాన్ని అమలు చేస్తే, ఎవ్వరూ క్వశ్చను చేయలేరు. ఎందుకంటే ఎవరి ప్రొడెక్ట్ కు ఎక్కడ ప్రకటనలు ఇవ్వాలో వాళ్ల ఇష్టం. దాన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఏమీ నిలదీయలేవు. అయితే ఇక్కడ ఇండస్ట్రీ తీసుకుంటున్న ఇంకో నిర్ణయం మాత్రం కాస్త వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది.
సినిమా కంటెంట్ ను, ప్రెస్ మీట్ లను, మెటీరియల్ ను, ఇంటర్వూలను కేవలం ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లు, ప్రింట్, వెబ్ మీడియాకు మాత్రమే ఇవ్వాలన్నది ఆ నిర్ణయం. న్యూస్ చానెళ్లకు కంటెంట్ ఇవ్వరు. ఇంటర్వూలు ఇవ్వరు. పైగా ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లతో అనుబంధం వున్న న్యూస్ చానెళ్లు లేదా, ఇతరత్రా సంపాదించి కానీ, న్యూస్ చానెళ్లు వాడితే, వాటిపై కంటెంట్ రైట్ పర్యంగా చర్యలు తీసుకుంటారు. తమ కంటెంట్ వాడకూడదని ఆదేశిస్తారు.
ఇక్కడే కాస్త వివాదం చెలరేగే అవకాశం కనిపిస్తోంది. న్యూస్ చానెళ్లను పిలవకపోతే తామూరామని మిగిలిన జర్నలిస్ట్ లను ఆందోళన దిశగా జర్నలిస్ట్ సంఘాలు నడిపించే అవకాశం వుంది. కానీ ఇప్పటికే ఇండస్ట్రీలో విడి విడి మీడియా మీట్ లు అన్నది అలవాటులో వుంది. ప్రింట్ మీడియాకు ఓ సారి, వెబ్ మీడియా, చానెళ్లకు మరోసారి, లేదా వాళ్లకు వీళ్లకు, వీళ్లకు వాళ్లకు ఇలా రకరకాలుగా మీట్ లు పెట్టడం మామూలే.
కానీ అధికారికంగా ఇవన్నీ ప్రకటిస్తేనే వస్తుంది సమస్య. మామూలుగా ప్రకటనలు ఇవ్వలేం మా సినిమాకు అని నిర్మాత ద్వారా చెప్పించేసినా, అలాగే న్యూస్ చానెళ్లు ఇంటర్వూ అడిగితే, ఇప్పుడు వీలు కాదు, తరువాత చూద్దాం అని చెప్పేసినా సమస్య కాదు. అలా కాకుండా ముందుగా విధి విధానాలు, నిర్ణయాలు ప్రకటిస్తే మాత్రం కాస్త ప్రతిఘటన తప్పకపోవచ్చు.
పూర్తిగానా? కొంత మీడియానా?
ఇక్కడ కూడా ఇంకా ఇండస్ట్రీలో పూర్తి ఏకాభిప్రాయం రాలేదు. మూడు నాలుగు న్యూస్ చానెళ్లను మాత్రం పక్కన పెడితే, మిగిలిన మీడియా నుంచి సపోర్ట్ వస్తుందని కొందరు నిర్మాతలు, సినిమా పెద్దలు సలహా ఇస్తున్నారు. అలావద్దు, టోటల్ గా న్యూస్ చానెళ్లను వదిలేద్దాం అని ఎక్కువ మంది పట్టుపడుతున్నారు. అయితే హీరోల వైపు నుంచి మాత్రం మధ్య మార్గంగా డీల్ చేయడం బెటర్ అన్న సజెషన్లు వచ్చాయి.
ఓ కమిటీ వేసి, మీడియా హెడ్స్ తో సమావేశమై, మీడియాలో వస్తున్న ఇలాంటి డిస్కషన్ల వల్ల ఇండస్ట్రీకి వస్తున్న ఇబ్బందుల గురించి చర్చిస్తే, వాళ్లు వింటారన్నది కొందరు హీరోల సూనచగా తెలుస్తోంది. ఇది కొంత వరకు వాస్తవం కూడా. ఎందుకంటే ఈ అలజడి మొదలైన తరువాత చానెళ్లు చాలా వరకు వెనక్కు తగ్గినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే రెండు మూడు చానెళ్లు మినహా మిగిలిన న్యూస్ చానెళ్లు అన్నీ ఆర్థికంగా కిందా మీదా అవుతున్నవే. ఏదో విధంగా బండి నెట్టుకు వస్తున్నవే. అందువల్ల అవి రాజీకీ రావడం అన్నది పెద్దగా కష్టం కాకపోవచ్చు.
లోపాయకారీ మార్గాలు
నిజానికి న్యూస్ చానెళ్లు ఇక రాజకీయంగా బిజీ అయిపోతాయి. ఎన్నికల సీజన్ వచ్చింది అంటే వాటికి దృష్టంతా అటే వుంటుంది. సినిమాలు పట్టమన్నా పట్టవు. ఇప్పటి నుంచి మరో ఏడాది రాజకీయాలే ఆలంబన న్యూస్ చానెళ్లకు. అలాగే రాజకీయ ప్రకటనల ఆదాయం కూడా వుంటుంది. అందువల్ల సినిమా వాళ్లు ఇప్పుడు బ్యాన్ అన్నంత మాత్రాన న్యూస్ చానెళ్లు దిగిరమ్మన్నారావు.
ఇంకో విషయం ఏమిటంటే, బ్యాన్ అన్నంత మాత్రాన నిర్మాతలు అందరూ ఓ మాట మీద వుంటారని లేదు. ఎల్ ఎల్ పి పెట్టినా, దిల్ రాజు లాంటి నిర్మాతే దాన్ని కాదని, ప్రింట్ మీడియాకు తనకు కావాల్సినట్లు ప్రకటనలు ఇచ్చారని విమర్శలు వున్నాయి. పైగా ఇండస్ట్రీలో క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కువ వుంటుంది. ఎక్కడో విశాఖ నుంచి ఎవరో? ఏదో న్యూస్ చానెళ్లలో తమ అభిమాన హీరో సినిమా విడుదల సందర్భంగా అభినందనలు అంటూ హొరెత్తించవచ్చు.
ఆ విధంగా ప్రకటనల ఆదాయం చానెల్ కు నిర్మాతలే లోపాయికారీగా అందించవచ్చు. ఆ విధంగా తమ సినిమా మీదకు రావద్దని లోపాయి కారీ ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడు ఎవరు ఆపగలరు? ఇలాంటి లోపాయకారీ మార్గాలు సవాలక్ష వున్నాయి. అందువల్ల బ్యాన్ చేసినా, కాస్ట్ కటింగ్ అయిపోతుంది అని అనుకోవడం కాస్త భ్రమే.
మెగాధిపత్యం కోసమా?
మరొపక్క ఈ హడావుడి అంతా మెగాధిపత్యం చూపించుకొవడం కోసమే అన్న లోపాయకారీ విమర్శలు వినిపిస్తున్నాయి. మెగా హీరోల జోలికి వస్తే, పర్యవసానం ఇలా వుంటుంది అని తెలియచెప్పడానికి ఇంత హడావుడి చేస్తున్నారని సణుగుళ్లు వినిపిస్తున్నాయి. అంటే నిషేధం లేకుండానే సణుగుళ్లు వుంటే, ఆ తరువాత ఎవరి సర్దుబాట్లు వారు చేసుకునే అవకాశం వుంది.
చర్చలే శరణ్యం
ఏమైనా చానెళ్ల అధిపతులు, సినిమా పెద్దలు కలిసి కూర్చుని, సమస్యలు అన్నీ చర్చించుకొవడం ఉత్తమం. ఎన్టీఆర్-ఎఎన్నార్ టైమ్ నుంచి టాలీవుడ్ లో కనిపించని కట్టుబాటు వుంటూ వస్తోంది తప్ప, ఏనాడూ నిషేధాలు అని పెద్దగా అన్న సంఘటనలు చాలా తక్కువ. కేవలం లోపాయకారీ ఆదేశాలతోనే నిషేధాలు అమలు చేసుకున్న దాఖలాలు అనేకం. వాళ్లు చేయలేక కాదు, నిషేధాలు అన్నవి ఎన్నాళ్లో నడవవు. సాధ్యం కాదు అని తెలుసు కనుక.
ఈనాడు లాంటి పెద్ద మీడియా కృష్ణ, దాసరి లాంటి వాళ్లతో చాలా కాలం విబేధించి, తరువాత మళ్లీ వాళ్లనే హగ్ చేసుకున్న దాఖలాలు వున్నాయి. అందువల్ల ఇటునుంచి అయినా, అటు నుంచి అయినా చర్చలే బెటర్. నిషేధం కాదు. ఇదంతా కొంతకాలం తమషాగా మిగిలిపోతుంది తప్ప వేరు కాదు.
-ఆర్వీ