ఆనం వివేకానంద రెడ్డి అనగానే కళ్ల ముందు ఓ స్టయిలిష్ రాజకీయ వేత్త కనిపిస్తాడు. రాజకీయాల్లో వున్నా, సరదాలు, స్టయిల్, ఫన్ వదలని రాజకీయవేత్త ఆయన. సీరియస్ రాజకీయాల్లో కూడా నవ్వులు పూయిస్తూ మాట్లాడగలిగే చతురత వుండేది. 67 ఏళ్ల ఆనం వివేకా అంటే నెల్లూరు జనాలకు పార్టీలతో సంబంధం లేకుండా చాలా మందికి పరిచయం. నేరుగా పరిచయం లేకున్నా, వివేకాను తమ ఇంటి మనిషి అనుకునేంత బంధం వుండేది.
రాజకీయాలు, ఓట్లు, గెలుపు ఓటములకు ఇది అతీతం. ఆనం బాడీ లాంగ్వేజ్, సరదా మాటలు, ప్రవర్తన ఆయనను నెల్లూరు ప్రాంతీయులకు దగ్గర చేసింది. అలాంటి ఆనం వివేకా ఇటీవల ఆసుపత్రిలో వున్నపుడు తీసిన ఫోటోలు బయటకు వస్తే, అయ్యో.. అనుకోని వారు లేరు. ఎందుకంటే వివేకా అంటే వాళ్ల గుర్తులు వేరు. అలాంటి వివేకా ఇలా అయిపోయాడా? అని బాధపడని వారు లేరు.
67 ఏళ్లకే ఆనం మృత్యు బారినపడ్డారు. గత నాలుగేళ్లుగా ఆయన తీవ్ర వ్యాధితో బాధపడుతున్నారు. క్యాన్సర్ కారణంగా ఆనం వివేకా మృతి చెందినట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఆయన అనేక పదవులు నిర్వహించారు. ఎమ్మెల్యేగా మూడుసార్లు చేసారు. ఆనంకు ఇద్దరు కుమారులు. మాజీమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఆయనకు సోదరుడు.
అంతకు ముందు స్థానికంగా నెల్లూరులో అనేక పదవులు చేపట్టారు. చిన్న పెద్ద అనేక పదవులు ఒకేసారి నిర్వహించిన అనుభవం ఆయన స్వంతం.
ఆనం వివేకా మృతికి గ్రేట్ ఆంధ్ర సంతాపం ప్రకటిస్తోంది.