ఎప్పుడయినా ఒక చేతి మీద నడిచే వ్యవహారం ఒకలా వుంటుంది. అలా కాకుండా నలుగురు కలిస్తే మరోలా వుంటుంది. నా పేరు సూర్య వ్యవహారం ఇలాగే వుంది. ఈ సినిమాకు అసలు సిసలు నిర్మాత లగడపాటి శ్రీధర్. కొసరు నిర్మాత బన్నీ వాస్. కేవలం రాయల్టీ దారు నాగబాబు. హీరో బన్నీ తన కోసమో, తన అవసరాల కోసమో బన్నీ వాస్ పేరు జోడించారని వినికిడి. కానీ వ్యవహారం మొత్తం లగడపాటి శ్రీధర్ దే. ఇక్కడే వస్తోంది సమస్య.
గీతాఆర్ట్స్ సినిమాలకు సాధారణంగా పబ్లిసిటీ పీక్స్ తో వుంటుంది. కానీ లగడపాటి శ్రీధర్ పబ్లిసిటీ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా మరో పదిరోజుల్లో విడుదల వుందన్నా ఇంకా ఎక్కడా ప్రచారం స్టార్ట్ కాలేదు.
చూసి, చూసి నిన్నటికి నిన్న బన్నీ తండ్రి అల్లు అరవింద్ రంగప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఎక్కడుంది సమస్య అని ఆరా తీసినట్లు బోగట్టా. దాంతో అప్పటికప్పుడు ఓవర్ సీస్ లో ప్రచారం స్టార్ట్ చేసినట్లు బోగట్టా.
కేవలం నిర్మాతలే కాదు, అన్నిచొట్లా అదే వ్యవహారం. గీతా ఆర్ట్స్ పీఆర్వో లు వేరు. లగడపాటి రాజగోపాల్ పీఆర్వోలు వేరు. దీంతో గీతా పీఆర్వోలు ఏమీ చేయడానికి లేదు. పైగా ఓవర్ సీస్ లో సినిమాను అమ్మలేదు. పంపిణీకి ఇచ్చారు. అమ్మేసి వుంటే, కొనుక్కున్నవాళ్లు వాళ్ల బాధ వాళ్లు పడతారు. పంపిణీకి ఇవ్వడంతో, ఎంత ఖర్చు చేయాలో? ఎలా ఖర్చు చేయాలో అన్నది నిర్మాతే చూసుకుంటారు. దాంతో ఓవర్ సీస్ బయ్యర్ తనకెందుకని గమ్మున వున్నారు. పైగా ఆయన భరత్ అనే నేను సినిమా బయ్యర్. దాని వ్యవహారాలు వుండనే వుంటాయి.
ఇలా పలువురు నిర్మాతలు, పలువురు పీఆర్వోలు, అన్నీ కలిసి నా పేరు సూర్య ప్రచారాన్ని కాస్త అయోమయంలో పడేస్తున్నట్లు కనిపిస్తోంది.