రంగస్థలం సినిమా సూపర్ హిట్ అయింది. ఇండస్ట్రీ మొత్తం మెచ్చుకుంది. హీరోలంతా ఈ సినిమాపై ట్వీట్స్ చేశారు. చరణ్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. చివరికి పవన్ కల్యాణ్ కూడా థియేటర్ కు వెళ్లి మరీ రంగస్థలం చూసి, మీడియా ఎదుట సినిమా గురించి మాట్లాడాడు. ఇంత జరుగుతున్నా, అదే మెగా కాంపౌండ్ కు చెందిన బన్నీ మాత్రం ఈ సినిమాపై రియాక్ట్ కాలేదు.
దీంతో అతడి వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు దీనిపై ఓ క్లారిటీ ఇచ్చాడు బన్నీ. నా పేరు సూర్య సినిమా పనుల్లో పడి, చెర్రీ సినిమాపై రియాక్ట్ అవ్వలేకపోయానని.. పైగా చెర్రీకి శుభాకాంక్షలు చెప్పడానికి సరైన వేదిక కూడా దొరకలేదని అంటున్నాడు బన్నీ. అయితే ఎట్టకేలకు చరణ్ కు కంగ్రాట్స్ చెప్పాడు.
“సభాముఖంగా నాకెప్పుడు అవకాశం రాలేదు కాబట్టి ఇప్పటివరకు చెప్పలేదు. నాకిష్టమైన నా తమ్ముడికి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గారికి గౌరవంగా, సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రామ్ చరణ్ తో పాటు రంగస్థలం యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు.” ఇలా రామ్ చరణ్ కు కంగ్రాట్స్ చెప్పాడు బన్నీ.
రంగస్థలం సినిమా చూడలేదు కాబట్టి బన్నీ రియాక్ట్ అవ్వలేదంటూ అతడి పీఆర్ మొన్నటివరకు వాదిస్తూ వచ్చింది. కానీ సినిమా చూడకపోయినా రియాక్ట్ అయిన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. అంతెందుకు, బన్నీ కూడా ఈ సినిమా ఇంకా చూడలేదు. కానీ కాస్త ఆలస్యంగా రెస్పాండ్ అయ్యాడు.