పవన్.. అరె ఏమైందీ..?

పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, గతంలో ఓసారి డెక్కన్ క్రానికల్ మీద దండుగా వెడలిన పవన్ కళ్యాణ్ మాదిరిగా కనిపిస్తున్నాడు. ఇటీవల కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ చాలా…

పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, గతంలో ఓసారి డెక్కన్ క్రానికల్ మీద దండుగా వెడలిన పవన్ కళ్యాణ్ మాదిరిగా కనిపిస్తున్నాడు. ఇటీవల కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ చాలా డిగ్నిఫైడ్ గా, గుంభనంగా, పద్దతిగా కనిపించాడు. 2014ఎన్నికల టైమ్ లో పార్టీని ప్రకటించేటపుడు కూడా పవన్ చాలా హుందాగా కనిపించాడు. ప్రవర్తించాడు. ఆ తరువాత గడచిన మూడేళ్లలో కూడా బాగానే వున్నాడు.

కానీ ఇప్పుడు ఉన్నట్లుండి యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. వెనకటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాడు. దీనివెనుక వైనం ఏమయివుంటుంది? వయసు మీద పడ్డాక పద్దతిలో ఒద్దిక వస్తుంది. చిల్లరతనం, అల్లరి, ఆవేశం తగ్గుతాయి. కానీ పవన్ వ్యవహారం రివర్స్ గా వుంది. ఆయన ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, ఆయనకైనా తెలుసా? అన్నది అనుమానంగా వుంది. ఆ ట్వీట్ లు ఏమిటో? వాటి వెనుక వ్యూహం ఏమిటో? అస్సలు వ్యూహం వుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఒక రాజకీయ పార్టీ పెట్టి ముందుకు వెళ్లాలనుకునే వ్యక్తి, ఇన్ని మీడియా సంస్థలను, ఇంత నేరుగా, ఇంకా చెప్పాలంటే ఇంత చౌకబారుగా, (ఎందుకంటే పవన్ వాడుతున్న పదాలు అలా వున్నాయి) దాడి చేయడం అంటే ఏమనుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే, ట్విట్టర్ లో పవన్ చేస్తున్న ట్వీట్లకు, పవన్ ఫ్యాన్స్ వివిధ వెబ్ సైట్లలో లేదా ట్విట్టర్ లో చేసే కామెంట్ లకు పెద్దగా తేడాలేదు. పైగా పవన్ ఫ్యాన్స్ కూడా అలాగే వున్నారు. పవన్ ట్వీట్ చేస్తే, అందులో ఏముందో చూడడంలేదు. రీట్వీట్ లు, లైకులు కొట్టడం మినహా. ఓ ట్వీట్ లో అచ్చు తప్పు దొర్లింది అని, మరో ట్వీట్ జస్ట్ ‘టైపో’ అని చేస్తే, దానికీ లైకులు, షేర్ లు. అంటే ఎంత గుడ్డిగా ఫాలో అవుతున్నారో అర్థం అవుతుంది.

ఇలాంటి వాళ్లను పట్టుకుని, వీళ్ల మద్దతు చూసుకుని పవన్ ట్విట్టర్ లో పోరాటం చేయడం అన్నది ఒకె. కానీ పవన్ పోరు కేవలం ట్విట్టర్ వరకు కాదు కదా? ఎన్నికల రంగంలో కూడా పోరాడాల్సి వుంది కదా? అక్కడ ఈ ట్విట్టర్ బ్యాచ్ వల్ల ఒరిగేది వుండదు. మరి పవన్ తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? తన ట్విట్టర్ ఐడి ఎవరికన్నా ఇచ్చేసి, వాళ్లకు వదిలేసారా?

త్రివిక్రమ్ లేని లోటు?

పవన్ తో గడచిన నాలుగేళ్లుగా త్రివిక్రమ్ వున్నారు. ఇప్పుడు లేరనే చెప్పాలి. ఎందుకంటే అజ్ఞాతవాసి తరువాత పవన్ కు త్రివిక్రమ్ కు మధ్య ఎడం పెరిగింది. ప్రస్తుతం త్రివిక్రమ్ వేరే షూటింగ్ లో బిజీగా వుండడం వల్ల కావచ్చు, లేదా అజ్ఞాతవాసి ఫలితం వల్ల కావచ్చు. ఇక మరో సన్నిహితుడు శరత్ మరార్ కూడా దగ్గరలేరు. ఈ ఇద్దరే పవన్ కు దగ్గరగా వెళ్లడం మాత్రమే కాకుండా, ‘ఇలా కాదు అలా’ అని చెప్పగలరు. ఇప్పుడు మిగిలిన బ్యాచ్ ఎవరైనా, ఆయన చెబితే వినడం తప్ప, ఇలా కాదు అలా అని చెప్పేంత సీన్ అయితే లేదు. అందువల్ల పవన్ మళ్లీ తన పూర్వ వైఖరిలోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది.

జగన్ ను చూడాలి

కొన్ని పత్రికలు జగన్ ను టార్గెట్ చేసినంతగా పవన్ ను చేయలేదనే చెప్పాలి. కానీ జగన్ ఏనాడూ ఈ విధంగా స్పందించింది తక్కువ. వాళ్లు వ్యతిరేకం అని చెప్పడమే కానీ, వ్యక్తిగత దూషణలకు దిగింది లేదు. ఇప్పుడు ఆ మీడియా సంస్థలకు జగన్ హుందాతనం, పవన్ వ్యవహారం క్లియర్ గా అర్థం అయివుంటుంది.

సరే ఆ సంగతి అలా వుంచితే, పవన్ చేస్తున్న ట్వీట్ ల నుంచి అచ్చుతప్పులు కనిపిస్తున్నాయి. అలాగే భాష కూడా దాని చిత్తానికి వుంటోంది. ట్వీట్ కు ట్వీట్ కు లింక్ లు వుండడం లేదు. కొత్తగా కేమేరా ఫోన్ కొన్నవాడు అదే పనిగా కనిపించిన ప్రతిదానికీ ఫోతోలు తీసినట్లు, పవన్ కొత్తగా స్మార్ట్ ఫోన్ కొని వుంటారు. ఏం తోచక, అలా ట్వీట్ లు చేసుకుంటూ పోతున్నారన్న వెటకారాలు వినిపిస్తున్నాయి. కాస్త తెలివైన ఫ్యాన్స్ కూడా పవన్ చేస్తున్న ఈ వ్యవహారాలను చూసి, తల పట్టుకుంటున్నారు.

ప్రజారాజ్యం మిన్న

వెనకటికి తల్లికాకే మంచిదని పిల్లకాకి నిరూపించినట్లు, చిరంజీవి బెటర్, ప్రజారాజ్యం బెటర్ అని పవన్ నిరూపించే పనిలో వున్నారని కామెంట్ లు వినిపిస్తున్నాయి. అప్పుడు కనీసం ఓ పద్దతి, వ్యవహారం అన్నా వున్నాయి. కానీ ఇప్పుడు అవేమీ కనిపించడంలేదు. చిత్రమేమిటంటే, తిట్టిన వాళ్లను, తిట్టి క్షమాపణ చెప్పినవాళ్లను పవన్ వదిలేసారు. అది ప్రసారం చేసిన వాళ్లను మాత్రం పట్టుకుని వేలాడుతున్నారు. పైగా తిట్టిన వాళ్ల వెనక ఎవరో వున్నారు. కుట్ర చేసారు అంటున్నారు తప్ప, ఇంతవరకు కాంక్రీట్ ఎవిడెన్స్ చూపించలేకపోయారు.

ఉచ్చులో పడ్డారా?

పవన్ కు ఆవేశం వస్తే పట్టలేం, ఆ ఆవేశంలో ఏం చేస్తారో ఆయనకే తెలియదు. ఈ సంగతి ఆయన తీరు గమనించే అందరికీ తెలుసు. అందువల్ల ఆయనను ఏదో విధంగా రెచ్చగొడితే, మిగిలినది ఆయనే చేసుకుంటాడు అని భావించి, ఇలా చేసారేమో? అన్నది ఓ అభిప్రాయంగా కనిపిస్తోంది. జస్ట్ శ్రీరెడ్డి చేత గిల్లించి వదిలేస్తే, ఇక పవన్ తన మానాన తాను ఏదో, ఏదేదో చేస్తున్నారు. అలా చేయడంలో ఆయన కాస్త విచక్షణ కోల్పోయినట్లే కనిపిస్తోంది.

త్రివిక్రమ్ నో, శరత్ మరార్ నో ఎవరో ఒకరు మళ్లీ పవన్ కు దగ్గర కావాలి. ఆయనను కంట్రోలు చేయాలి. లేదంటే ఇంతే.