రాంగోపాల వర్మ యిటీవల తీస్తున్న సినిమాలలో స్క్రిప్టు, స్క్రీన్‌ప్లే ఏమీ బాగుండటం లేదనీ, సినిమాలు ఫ్లాపవుతున్నాయనీ అందరికీ తెలుసు. ఆయన లేటెస్టుగా దర్శకత్వం వహించిన ''భూమికా తల్పం'' (కాస్టింగ్ కౌచ్) సినిమాకు కూడా అదే గతి పట్టింది. దాని డైరక్షన్ ఆయన ఏ దశలో చేపట్టారో ప్రస్తుతానికి తెలియరాలేదు. పాత్రధారే సొంత కథతో, సొంత తెలివితేటలతో, సొంత డైరక్షన్లో రంగంలోకి దిగితే 'ఇలా కాదమ్మాయ్, నా డైరక్షన్లో అయితే మరీ రక్తి కడుతుంది' అని మధ్యలో చేపట్టారా? లేక పాత్రధారి కాల్షీట్లు రెడీగా ఉన్నాయని తెలియగానే కథ, కథనం, సంభాషణలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం తలపెట్టారా? దీనికి ఆయన దర్శకనిర్మాతా? లేక నిర్మాత వేరే ఉన్నారా? వేరే ఉన్నారని నిన్న అరవింద్, యివాళ పవన్ అంటున్నారు.
అరవింద్ గతాన్ని గుర్తు చేసి ప్రశ్నలతో ఆపేస్తే, పవన్ పేర్లే చెప్పేశారు. దానికి ఆధారాలేమైనా చూపుతారో లేక శేఖరరెడ్డి గురించిన ఆధారాలతో బాటే సరైన సమయంలో బయటపెడతానని అంటారో తెలియదు. కనీసం ఓ ఘట్టానికి దర్శకత్వం నాదే అని ముందుకు వచ్చి చెప్పుకున్న వర్మ నిర్మాత పేరు వెల్లడిస్తారో, లేదా తనే బినామీ నిర్మాతగా ఉంటారో తెలియదు. ఏది ఏమైనా ఒక వ్యాఖ్యతో తెలుగు ప్రజలందరూ ఉలిక్కిపడేలా చేసిన శ్రీరెడ్డి చేత ఆ మాట అనిపించింది తానే అని చెప్పుకుని వర్మ ఆ పాపాన్ని ఒప్పేసుకున్నారు. తెలుగు యిండస్ట్రీలో ఎదిగి, ఆ యిండస్ట్రీ పరువు తీయించి, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన పాపాలభైరవుడిగా పేరు మూటకట్టుకున్నారు.
నిజానికి వర్మకు పాపాలభైరవుడి యిమేజి యిప్పటిదాకా లేదు. అరవింద్ ఆయన్ని 'ఇంటెలిజెంట్ క్రూక్' అన్నారు కానీ వర్మ క్రూకెడ్నెస్ యిప్పటిదాకా వెలుగులోకి రాలేదు. ఆయన గురించి చెప్పాలంటే – ట్రెండ్ సెట్టర్, ఒకప్పుడు మంచి సినిమాలు తీశాడు, చాలాకాలంగా కంటెంటు కంటె మార్కెటింగ్‌పైనే దృష్టి పెట్టి అభిమానులను పోగొట్టుకుంటున్నాడు, వ్యవస్థను ధిక్కరించే ప్రవచనాలు వల్లిస్తూ యువతను ఆకట్టుకుంటాడు, ఏదో ఒక తిక్క పనో, వ్యాఖ్యో చేసి నిరంతరం వెలుగులో ఉండేట్లు చూసుకుంటాడు – అనే అంటారు. ఆర్టిస్టుకో, టెక్నీషియన్కో యిస్తానన్న డబ్బు ఎగ్గొట్టాడనో, ఎవరినైనా ప్రలోభపెట్టి వాడుకున్నాడనో ఆరోపణలు లేవు.
ఇటీవలి కాలంలో ఆయన్ను సినిమాలవర్మగా గుర్తించడం మానేసి వ్యాఖ్యానాలవర్మగానే గుర్తిస్తున్నారు. అవి ఒక్కోసారి వినోదం కలిగిస్తాయి, మరోసారి ఆగ్రహం కలిగిస్తాయి, చాలాసార్లు విసిగిస్తాయి. అంతకుమించి ఆయన అపకారం చేశాడని అనగా వినలేదు. కానీ తాజా ఉదంతంతో ఆయన ఒక డేంజరస్ స్కీమర్ అని రుజువైంది. తన సినిమాను మార్కెట్ చేసుకోవడానికి ఆయన రకరకాల స్కీములు వేసి, వివాదాలను రగిలించి, ఆసక్తి రగిలిస్తాడని ఎప్పుడో తెలుసు. అవన్నీ ఉదరపోషణార్థం కాబట్టి, పోనీలే అనుకుని ఊరుకుంటారు. కానీ యిదేమిటి? శ్రీరెడ్డి ప్రాణాలకే ముప్పు తెచ్చే స్కీము రచించడం, ఆమెను బలిపశువు చేయడం పాపం కాదా. మతకలహాలు రగిలించడానికి రాజకీయపార్టీలు ఆవుని చంపి గుడిలో పడేయడం, పందిని చంపి మసీదులో పడేయడం చేస్తూంటాయని అంటూంటారు. రాజకీయ నాయకులకు అది ఒప్పుతుందేమో కానీ, చిత్రపరిశ్రమలో పుట్టి పెరిగిన వ్యక్తి పరిశ్రమనే అతలాకుతలం చేయబూనడం ఘోరం కాదా!
వర్మ వాదిస్తున్నట్లు చిత్రపరిశ్రమ అంటే పవన్, అరవింద్ మాత్రమే కాదు, శ్రీరెడ్డి వంటి చిన్న ఆర్టిస్టులు కూడా! తన స్కీము కారణంగా ఆమె ఎంత నష్టపోతుందో అంచనా వేయలేకపోయాడా వర్మ? స్క్రీన్‌ప్లేలో ఒక డైలాగు ద్వారా కథలో ఎంత మలుపు వస్తుందో తెలియదా యీ సినీమానిసికి? అరవింద్ చెప్పినట్లు పవన్ అభిమానులు ఆవేశంలో ఏదైనా చేసి ఉంటే ఎంత అనర్థం జరిగేది? పవన్ ఎక్కడ మీటింగు పెట్టినా అతని అభిమానుల వీరావేశం చూస్తున్నాం. మనకు అతను ఎప్పుడేం చేస్తాడో తెలియని అయోమయ వ్యక్తిగా తోచవచ్చు, కానీ అతని అభిమానులకు అతను దేవుడు.
అతన్ని అంతలేసి మాటలన్న వ్యక్తిపై కోపోద్రేకంతో ఏదైనా చేస్తే…? పోనీ అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు (వారిని దర్శకుడు పంపిస్తాడా, నిర్మాత పంపిస్తాడా? అనేది వేరే ప్రశ్న) ఏమైనా చేస్తే..? దానివలన పవన్ యిమేజి తగ్గుతుందా, లేదా అన్న సంగతి అవతల. ముందు యీ అమ్మాయి దెబ్బ తినేది కదా. ప్రాణం తీయకపోవచ్చు, గాయపరచవచ్చు, అందవిహీనం చేయవచ్చు.. ఏదైనా జరగవచ్చు. దానికి కారణం ఆమె బయట పెట్టిన పేర్ల తాలూకు కుటుంబాలని పోలీసులు అనుమానించవచ్చు, కేసులు పెట్టవచ్చు. ఎంత రగడ! తను చేసే పనికి పర్యవసానం ఏ మేరకు వెళుతుందో ఊహించలేని అమాయకుడా వర్మ!?
దాడి జరగలేదు కానీ వర్మ ఒప్పుకోలును పవన్ రాజకీయంగా వాడుకుంటున్నాడు. తనపై జరిగిన దాడికి వెనక్కాల బాబు, లోకేశ్, అతని స్నేహితుడు రాజేశ్ ఉన్నారని, శ్రీరెడ్డి ద్వారా తన తల్లికి జరిగిన అవమానంలో టీవీ9 రవిప్రకాశ్, శ్రీని రాజు, వర్మ టిడిపికి సహకరించారని తీవ్రమైన ఆరోపణలు చేసి, టిడిపిని దోషిగా నిలబెడుతూ ఫిలిం ఛాంబర్లో దీక్ష చేపట్టాడు. అది కూడా సరిగ్గా చంద్రబాబు హోదా దీక్ష చేపట్టిన రోజున, ఆయన పుట్టిన రోజున, టిడిపి పార్టీ రాష్ట్రమంతా హోరెత్తిస్తున్న వేళ చేశాడు. ఒక్కరోజు దీక్షతో త్యాగమూర్తి, పోరాటమూర్తి, ఆంధ్ర ఆత్మాభిమానమూర్తి గట్రాగట్రా యిమేజులు తెచ్చేసుకుందామని బాబు ఖర్చుకి వెనకాడకుండా ప్రయత్నాలు చేసిన రోజునే ఆయన్ను కుటిలనాయకుడిగా చిత్రీకరిస్తూ యిది జరగడం నిజంగా షాక్.
నిన్న అరవింద్ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి పిఆర్పీ రోజులు గుర్తు చేశారు. అప్పుడూ టిడిపియే దోషిగా నిలబడింది. చిరంజీవి పార్టీ పెట్టినపుడు మొదట్లో టిడిపి సంతోషించింది. ఇప్పటిదాకా రెడ్లు, కాపులు కలిసి కాంగ్రెసు పక్క ఉన్నారని, కమ్మలు, బిసిలు తమ పక్క ఉన్నారని చిరంజీవి రాకతో కాపులు విడిపోయి కాంగ్రెసు దెబ్బ తింటుందని ఆశించారు. కానీ చిరంజీవి తన సొంత యిమేజితో కాంగ్రెసు ఓట్లకు, టిడిపి ఓట్లకు కూడా గండి కొడతాడని తేలేసరికి (అంతిమంగా అదే జరిగింది) ఇక అతన్ని తగ్గించడానికి మీడియా సహకారంతో సకలయత్నాలు చేశారు. అతనిపై కాపు యిమేజి బలంగా కొట్టారు. పిఆర్పీలో కోవర్టులను పెట్టారు. చిరంజీవి అనుభవరాహిత్యం, తెలివితక్కువ పనులు తోడై పీఆర్పీ అనుకున్నంతగా సాధించలేక పోయింది.
ఆ రోజు పీఆర్పీకి వెన్నుపోటు పొడిచిన పరకాల ప్రభాకర్ యీనాడు సీనియర్ వెన్నుపోటుదారుడికి వెన్నుదన్నుగా ఉన్నారు. అలాటి ప్రమాదాలే యిప్పుడూ ఉంటాయని పవన్‌ను హెచ్చరించానని అరవింద్ అంటున్నారు. వర్మకు రూ.5 కోట్లు ఎక్కణ్నుంచి వచ్చాయని అరవింద్ అడిగారు. 5 కోట్లు తన దగ్గర ఉన్నాయని అనలేదని, సురేశ్‌ను అడిగి యిస్తానన్నానని వర్మ సమాధానం చెప్పారు. అయిదేమిటి, యిది పది కోట్ల కుట్ర అంటున్నాడు పవన్. వర్మ మధ్యవర్తిత్వం కూడా వింతగానే ఉంది. ఇరుపార్టీలతో ఓ మాట మాట్లాడి ఎవరైనా ప్రతిపాదన చేస్తారు. ఈ 5 కోట్ల అంకె ఏ లెక్కన లెక్క వేశారో ఆయన! సొంత కుటుంబం బాగోగుల గురించే వర్రీ అవనని చెప్పుకునే వర్మ సురేశ్ కుటుంబం గురించి వ్యథపడి తనంతట తానే యినీషియేటివ్ తీసుకున్నారనడం.. అబ్బే, పాత్రకు అతకలేదు. మరి యీ ప్రయత్నం ఎందుకు చేసినట్లు? ఆర్థిక ప్రయోజనం ఏమైనా ఉందా? తెలియనిదే ఏమీ అనలేం. చెప్పగానే నమ్మేట్లు మాత్రం లేదని అని ఊరుకోవాలి.
సురేశ్ కుటుంబం యిమేజి గురించి అంత వర్రీ అయి, మా కుటుంబం గురించి వర్రీ కాలేదేం అని అరవింద్ అడిగిన ప్రశ్నకు వర్మ దగ్గర సమాధానం లేదు. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేసిందని వర్మ కితాబు యిచ్చాడు. ఆమెను ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చాడు. ఆమె ఉద్యమానికి మద్దతు యిద్దామనుకుంటే బొంబాయి రప్పించి, తనకున్న పరిచయాలతో అక్కడ కూడా ఓ అర్ధనగ్న ప్రదర్శన ఏర్పాటు చేయించి, యితర గ్రహాల్లో కూడా ఖ్యాతి వచ్చేట్లు చేయాల్సింది. బాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్ బాధితులుంటారు కాబట్టి వాళ్లను కూడా పోగేసి యిక్కడా ''మీ టూ…'' పోరాటం చేయడానికి అండదండలు అందించాల్సింది. శ్రీ రెడ్డి గురించి అక్కర ఉంటే చేయాల్సిన పని అది. దానికి బదులుగా ఆమె చేత టాక్టికల్ మిస్టేక్ చేయించి, ప్రమాదంలోకి నెట్టి, బలిపశువుని చేశాడు. ఆమె బూచిని చూపించి బేరాలాడబోయాడు.
శ్రీరెడ్డి చేత అనిపించిన మాట పవన్ తల్లిని ఉద్దేశించి అన్నది కాదని, అది మగవాళ్లను ఉద్దేశించి తిట్టే తిట్టని వర్మ వివరణ యిచ్చారు. తల్లికీ, పెళ్లానికీ తేడా తెలియదుట్రా అని తిడితే ఆ వ్యక్తికి నీచమైన కాముకదృష్టి ఉందని మాత్రమే అర్థం వస్తుంది. తల్లితో శయనించాడని అంటే మాత్రం తల్లిని కూడా దోషిగా నిలబెట్టినట్లవుతుంది. ఆపాటి తేడా తెలియదా వర్మకి? అర్జునరెడ్డి సినిమాలో అన్నారు కాబట్టి దానికి కావ్యగౌరవం రాదు. మగవాళ్లు మాత్రమే అనవచ్చా, ఆడవాళ్లు అనకూడదా? అనే సన్నాసి లాజిక్ ఒకటి. శ్రీరెడ్డికి యింత ఫోకస్ రావడానికి కారణం – ఆమె స్త్రీ కావడమే. ఆమె లేవనెత్తిన సమస్యలు స్త్రీలకు సంబంధించినవి కావడమే. వాటిని ప్రస్తావించినపుడు ఆమె వాడిన భాష వలన ఆమె ఉద్యమలక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉందని అనేకసార్లు తోచింది.
మహిళా ఉద్యమకారిణులు మగవాళ్లని, సమాజాన్ని దారుణంగా విమర్శిస్తారు. కానీ యిలాటి బూతులు వాడరు. చెప్పదలచినది సభ్యమైన భాషలో చెప్తే ఆమెకు సానుభూతిపరులు పెరిగేవారు కదా అనుకుంటూండగా, యిప్పుడు పవన్‌మీద అనమని వర్మ రెచ్చగొట్టడమేమిటి? ఆ తిట్టుకు వేలు చూపిన అభినయం జోడించిందామె. అర్జునరెడ్డి మీద సొడ్డేసినట్లనుకున్నారా? అది సూత్రధారి సూచనా? పాత్రధారి పైత్యమా? వర్మకు వినయం ఉందని ఎవరూ ఆరోపించరు. కానీ యీమె విషయంలో మాత్రం తన పేరు చెప్పుకోకుండా ఘనతంతా ఆమెకే కట్టబెట్టాడు పాపం. అయితే తన యాక్షన్‌కు వచ్చిన రియాక్షన్‌ను తట్టుకోలేక పోయింది. వర్మ చెప్పడం బట్టే తాను చేశానని మహిళా సంఘం సంధ్యకు చెప్పుకుంది.
ఆమెకు జియస్టీ సినిమా విషయంలో వర్మతో లడాయి ఉంది. అందుకే టీవీ ఛానెల్లో ఆ విషయం చెప్పేసింది. ఇక శ్రీరెడ్డి కూడా బయట పెట్టింది. ఇక లాభం లేదనుకుని వర్మే తెరలు చింపుకుని బయటకు వచ్చి నిలబడ్డాడు. పాత్రధారి ఎదురు తిరిగితే సూత్రధారికి దిక్కు లేదని తెలిసివచ్చి ఉంటుంది. ఇది తను ఎదురు చూసిన మలుపైతే ఖచ్చితంగా కాదు. ఇలా చెప్పేయడం వలన తను పునీతుడనై పోయానని వర్మ అనుకోవచ్చేమో కానీ, సగటు సినిమా ప్రేక్షకుడి దృష్టిలో వర్మ పట్ల వెగటు పుట్టింది. తన పాటికి తను సినిమాలేవో తీసుకోక, ఎందుకీ గేమ్స్ అనుకుంటున్నాడు. శ్రీరెడ్డి వ్యక్తిగతంగా ఎటువంటిది, పదేళ్లగా ఎటువంటి పొరపాట్లు చేసింది అనేది అప్రస్తుతం.
ఆమె లేవనెత్తిన దుమారం వలన సినిమా జనాలు యికపైనైనా జాగ్రత్తగా ఉంటారు. బుద్ధులు మారిపోతాయని కాదు, ధారాళంగా కమిట్మెంట్లు అడగడానికి సంకోచించే స్థితి వచ్చింది. అవతలివాళ్లు రికార్డు చేసి యాగీ చేస్తారేమోనని భయపడతారు. పిచ్చి మెసేజిలు, ఫోటోలు పెట్టడానికి జంకుతారు. శ్రీరెడ్డి కారణంగా 'మా' తెలివితక్కువతనమూ బయటపడింది. కమిటీలు వేసి, తగు జాగ్రత్తలు తీసుకుని మర్యాదస్తులు సినీరంగంలోకి రావడానికి వెనుకాడకుండా చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.
ఇలాటి పరిస్థితిలో వర్మ దుష్టపుటాలోచన కారణంగా పరిస్థితి మొత్తం మారిపోయింది. శ్రీరెడ్డి గళం విప్పడానికి వెనుక ఎవరో బలమైన వ్యక్తులున్నారని తెలుస్తూనే ఉంది. సినీరంగంలో కొందరిపై అక్కసు ఉన్నవాళ్లయి ఉంటారని అనుకుంటూ వచ్చారు. కానీ దీని వెనుక ఒక పన్నాగం ఉందని తెలిసి తెలుగుజాతి నివ్వెరపోయింది. ఇప్పుడు పవన్ ఆరోపిస్తున్నట్లు రాజకీయ పార్టీ కూడా ఉందని రుజువైతే అసహ్యం పెరుగుతుంది. అభాగ్యస్త్రీ శరీరాన్ని అడ్డుపెట్టుకుని, మరొక భద్రమహిళ వ్యక్తిత్వానికి మసిపూసి రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారంటే అంతకంటె హేయమైన పని మరొకటి ఉండదు. ఈ కథకు వర్మ నిర్మాత అవునో కాదో తెలియదు కానీ దర్శకుడు.. కనీసం కీలకఘట్టాల్లో దర్శకుడు ఆయనే. కానీ క్లయిమాక్స్ ఆయన అనుకున్నట్లు తేలలేదు. అది ఆయన మరో మేధోవైఫల్యం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2018)
[email protected]