పాపం, జనసేన అధిపతి అడ్డంగా బుక్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ఏరి కోరి భారీగా జీతాలు ఇచ్చి మరీ తెచ్చుకున్న మీడియా జనాలు ఎవరో కానీ, ఆయనను పూర్తిగా తప్పుదారి పట్టించేసినట్లే వుంది.
ఓ టీవీ ఛానెల్ లో ప్రసారం అయిన వీడియో అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అక్కడితో ఆగలేదు. ఆ వీడియోను వాళ్లకు వీళ్లకు ట్యాగ్ చేయడం, పంపడం చేసారు. సదరు వీడియో మీద ఆ చానెల్ లోగో కూడా వుంది.
అయితే ఎక్కడ సమస్య వచ్చిందంటే, ఆ చానెల్ ఆ వీడియోను ప్రసారం చేసినపుడు, అందులో ఓ తిట్టు పదాన్ని మ్యూట్ చేసిందట. కానీ పవన్ షేర్ చేసిన వీడియోలో ఆ మ్యూట్ లేదు.
మరి ఏం జరిగినట్లు? ఇప్పుడు ఆ ఛానెల్ ఏమంటోంది? అంటే, యూట్యూబ్ లో శ్రీరెడ్డి ఘాటుగా పవన్ ను తిట్టిన వీడియోల్లోంచి ఆడియో ఫైల్ డౌన్ లోడ్ చేసి, దానిని ఈ చానెల్ వీడియోకి మార్పింగ్ చేసారని అంటోంది. అనడమే కాదు, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయించేసారు. ఈ మేరకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ల తరపున పోలీసులకు ఫిర్యాదు అందింది.
మరో పక్క ఆ ఛానెల్ కూడా పవన్ పై క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు రెడీ అవుతోంది. అసలు ఇప్పుడు ఫైట్ మొత్తం ఆ చానెల్ కు పవన్ కు మధ్య అన్నట్లు మారిపోయింది. ఆ చానెల్ కీలక బాధ్యుల వ్యక్తిగత ఫోటోలు పెట్టడం, వాటి గురించి రాయడం వంటి చర్యలకు పవన్ పాల్పడుతున్నారు.
మరి ఇదంతా పవన్ నే చేస్తున్నారో? పవన్ సలహాతో ఆయన టీమ్ చేస్తున్న అత్యుత్సాహమో? లేక అసలు ఆ టీమ్ ఇస్తున్నతప్పుడు సలహానో? మొత్తానికి పవన్ ఇరుక్కున్నట్లే కనిపిస్తోంది.