నాడు బ్రిటిష్ పాలనలో మగ్గిన దేశాలన్నింటి సమూహమే కామన్ వెల్త్. నాటి బానిసత్వానికి గుర్తు అనే నెగిటివ్ టచ్ ఉన్నా, కామన్ వెల్త్ గ్రూప్ అయితే సాగుతోంది. ఇక ప్రతి నాలుగేళ్లకూ ఒకసారి కామన్ వెల్త్ గేమ్స్ సాగుతున్నాయి. ఎనిమిదేళ్ల కిందట కామన్ వెల్త్ గేమ్స్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ అతిథ్యం పెద్ద స్కామ్‌కు కూడా దారి తీసింది. ఇప్పటికీ ఆ వ్యవహారం తేలలేదు.
ఆ తర్వాత రెండోసారి కామన్ వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి. ఈ సారి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చింది. గోల్డ్ కోస్ట్ నగరం వేదికగా నిర్వహించిన ఈ గేమ్స్ ముగింపు దశకు వచ్చాయి. ఆదివారంతో ముగుస్తున్నాయి. ఇప్పుడు పతకాల పట్టికను పరిశీలిస్తే.. భారత్ సగర్వమైన స్థాయిలోనే నిలుస్తోంది. పతకాలు సాధించిన జాబితాలో మూడో స్థానంలో నిలిచింది భారత్.
కామన్ వెల్త్ లో రమారమీ 70దేశాలున్నాయి. వాటి పోటీలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఆతిథ్య ఆస్ట్రేలియా నిలవగా, రెండో స్థానంలో ఇంగ్లండ్, మూడో స్థానంలో భారత్ నిలుస్తున్నాయి. ఇక కెనడా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి దేశాలు భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాల మధ్యన మూడో స్థానం అంటే బెటర్ ప్లేస్ మెంటే.
క్రితం సారి కామన్ వెల్త్ గేమ్స్ తో పోలిస్తే భారత్ మంచి ఫలితాలు సాధించింది. ఈ సారి ఏకంగా 26గోల్డ్ మెడల్స్ సాధించింది భారత్. నాలుగేళ్ల కిందట జరిగిన కామన్ వెల్త్ తో పోలిస్తే.. భారత్ ఏకం పది గోల్డ్ మెడల్స్ ను అదనంగా సాధించింది. అయితే మొత్తం పతకాల విషయంలో చూస్తే చిన్న బెటర్ మెంట్ మాత్రమే. గతసారి మొత్తం 64 పతకాలను సాధించింది భారత్. ఈ సారి 66. క్రితం సారి రజతాలు ఎక్కువ వచ్చాయి, ఈ సారి స్వర్ణాలతో భారత అథ్లెట్లు సత్తా చాటారు.
గత ఒలింపిక్స్ లో భారత్ తీవ్రమైన నిరాశకర ప్రదర్శన చేసింది. కామన్ వెల్త్ లో మాత్రం సత్తా చాటింది. అయితే కామన్ వెల్త్ లో పతకాలు ఒలింపిక్స్ అంత గొప్ప కాదు. కామన్ వెల్త్ లో అమెరికా, చైనాలు ఉండవు. మరి కొన్నిదేశాలు కూడా ఉండవు. దీంతో పోటీ తక్కువే. ఇలాంటి చోట రెచ్చిపోవడం ఒకే కానీ, ఒలింపిక్స్ లో ఈ మాత్రం పతకాలు సాధిస్తే.. అప్పుడు భారత్ గర్వించవచ్చు.