చంద్రబాబునాయుడు ప్రజలకు చాలా హామీలు ఇస్తుంటారు. ప్రధానంగా రాజధాని అమరావతి గురించి… ఆయన ఎన్నెన్నో చెబుతుంటారు. ఇదిగో ఇక్కడ ఒక నది.. ఇక్కడ ఒక పార్కు, ఇక్కడ ఒక అంతర్జాతీయ క్రీడల కాంప్లెక్సు, ఇక్కడ ఒక అంతర్జాతీ వినోద కేంద్రం.. ఇలా ఆయన ప్రతి చిన్న అంశాన్నీ… ప్రజలకు కాగితం మీద బొమ్మల్లో చూపించేస్తూ ఉంటారు. అమరావతి రాజధాని విషయంలో ప్రతి ఒక్కటీ కూడా అంతర్జాతీయ స్థాయిలోని విషయమే తప్ప.. ఏపీలోని సామాన్యులకు అందుబాటులో ఉండేదంటూ ఒక్కటి కూడా లేదన్న సంగతి ప్రతి ఒక్కరికీ అర్థమవుతూనే ఉంటుంది.
కేవలం కాగితాల మీద బొమ్మలు చూపించే దశను చంద్రబాబు దాటి వచ్చేశారు. ఇదిగిదిగో కోర్ కేపిటల్ లోని అసెంబ్లీ భవనం అంటూ ఆయన ఓ త్రీడీ మోడల్ ను ఆర్కిటెక్టులతోనే తయారు చేయించి.. దానిని తాను చాలా ఘనంగా ఆవిష్కరించి ప్రదర్శిస్తే.. ప్రజలంతా విస్తుపోయారు. ఈ ఇడ్లీ పాత్రల తరహా డిజైను చేయడానికా.. ఇప్పటికే కన్సల్టెన్సీల పేరిట కొన్ని కోట్ల రూపాయలను తగలేసి… విదేశీ సంస్థలకు నిధులు దోచిపెట్టి కాలహరణం చేసింది? అని ప్రజలు అనుకున్నారు.
అలాగే చంద్రబాబు హైకోర్టు ఆకృతిని కూడా త్రీడీ డిజైన్ చేయించి ఆవిష్కరించారు. బౌద్ధ స్తూపం స్ఫూర్తితో దానిని డిజైన్ చేసినట్లుగా బిల్డప్ ఇచ్చారు గానీ.. అది కాస్తా కొన్ని స్టార్ హోటళ్ల కారిడార్ల డిజైన్ లాగా ఉన్నదనే విమర్శలూ వచ్చాయి. బౌద్ధస్తూపం అనే రూపానికి భ్రష్టు పట్టించిన నమూనాలాగా ఇది తయారైందనే విమర్శలూ వచ్చాయి.
మొత్తం అమరావతి నగరాన్ని ఇదిగో అదిగో అంటూ చంద్రబాబు చెబుతుంటారు. తాజాగా.. ఆయన అమరావతిలో నిర్మించే అంబేద్కర్ స్మృతివనం లోని అంబేద్కర్ విగ్రహం బొమ్మను కూడా ఆవిష్కరించారు. దానిని 18నెలల్లో పూర్తి చేస్తారుట. అంటే 2019లో కూడా పరిపాలను ఆయన చేతిలో పెడితే పూర్తి చేస్తారన్నమాట. ఇప్పుడు ప్రతి విషయాన్నీ గుర్తు చేసుకుంటూ ఇప్పటిదాకా ఆయన హామీ ఇచ్చిన ప్రతి విషయానికీ… 2019 తర్వాత ఎన్నికయ్యే ప్రభుత్వం పదవీకాలంలో మాత్రమే ఆచరణ యోగ్యత దక్కేలాగా చంద్రబాబు చెప్పిన సంగతులు మనకు గుర్తుకొస్తుంది.
అమరావతి రాజధానిని పూర్తి చేయడం అనేది 30ఏళ్ల ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. అంటే.. అన్నేళ్లపాటూ ఆయనకు అధికారం ఇవ్వాలన్నమాట. ప్రతి విషయాన్నీ ఆయన బొమ్మల్లో చూపించి.. తర్వాత ఇస్తా అంటోంటే.. ప్రజలు కూడా.. 2019ఎన్నికల్లో విజయాన్ని… రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ఆయనకు బొమ్మల్లో చూపించి.. 2024లో మీ చేతికిస్తాం.. పండగ చేసుకోండి… అని చెబితే ఏం చేస్తారు? అని జనం చంద్రబాబు తీరు గురించి జోకులేసుకుంటున్నారు.