‘మా’ కొమ్ములు వంచిన శ్రీరెడ్డి

సినిమా రంగం అంటే తమ స్వంత జాగీరు అన్నట్లుగా, శ్రీరెడ్డితో ఎవరూ నటించినా వారిని వెలేస్తామంటూ ఫత్వా జారీ చేసిన టాలీవుడ్ నటీనటుల సంఘం ‘మా’ ఇప్పుడు తలవంచింది. దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు…

సినిమా రంగం అంటే తమ స్వంత జాగీరు అన్నట్లుగా, శ్రీరెడ్డితో ఎవరూ నటించినా వారిని వెలేస్తామంటూ ఫత్వా జారీ చేసిన టాలీవుడ్ నటీనటుల సంఘం ‘మా’ ఇప్పుడు తలవంచింది. దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ తో తన సాన్నిహిత్య సంబంధానికి చెందిన ఫోటోలు బయటకు వదలడంతో సమస్య తీవ్రంగా మారింది. దాంతో ఈ విషయం ఇంత సీరియస్ గా మారడానికి కారణం 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా తీసుకున్న ‘వెలి’ నిర్ణయమే కారణమని విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ఓ వ్యక్తిని నటించకుండా వెలి వేసే అధికారం 'మా'కు ఎక్కడ వుందని అందరూ నిలదీసారు.

ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ’రామ్మా.. శ్రీరెడ్డి.. నువ్వు 'మా'లో ఒకదానివి. మేమంతా నీతో వుండి నీకు అవకాశాలు వచ్చేలా చూస్తాం. తేజగారు ఇవ్వాళ ఫోన్ చేసి చెప్పారు రెండు సినిమాలు ఇస్తున్నా అని. ఇకపై ఈ చానెళ్లు వదిలేసి, నటన మీద దృష్టి పెట్టు. మా తొమ్మిది వందల మంది సభ్యులు నీతో నటించడినికి సిద్ధంగా వున్నాం..’ అన్నారు.

రెండు రోజుల్లో ఎంత మార్పు? పెద్ద తలకాయల బూతు పురాణాలు బయటకు వస్తుండే సరికి, కాళ్లు చల్లబడి, కాళ్ల బేరానికి వచ్చినట్లు క్లియర్ గా కనిపించడం లేదూ? శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన చేయడానికి ముందే దర్శకుడు తేజ రంగ ప్రవేశం చేసి రెండు సినిమా చాన్స్ లు, మా సభ్యత్వ మొత్తం లక్ష రూపాయిలు ఇవ్వడానికి శ్రీరెడ్డితో బేరాలు సాగించారు. ఆ విషయం శ్రీరెడ్డే ఛానెళ్ల ముందు చెప్పింది. తనకు బిస్కట్ లు వేస్తున్నారని వెల్లడించింది. రెండు మూడు సిటింగ్ లు కూడా జరిగాయని చెప్పింది. కానీ అవన్నీ విఫలం అయ్యాయి. ఆ సిటింగ్ ల్లో ఏ ఆఫర్లు వచ్చాయో అన్నది మాత్రం బయటకు చెప్పలేదు.

తీరా ఇప్పుడు సురేష్ బాబు కొడుకు అభిరామ్ ఫొటోలు బయటకు వచ్చి, కోన వెంకట్, కొరటాల శివ చాటింగ్ లు బయటకు వచ్చేసరికి, సినిమా జనాల గుండెలు గుభేల్ మన్నాయి. ఇంకా ఇద్దరు పెద్దవాళ్ల బాగోతాలు తన దగ్గర వున్నాయని శ్రీరెడ్డి చెప్పకనే చెప్పింది. దీంతో ఇక అవన్నీ బయటకు వస్తే, ఇండస్ట్రీ పరువు గంగపాలే అని అర్థం అయిపోయింది. దీంతో సమస్యకు కేంద్రం అయిన 'మా' నే మళ్లీ ప్రెస్ ముందుకు తెచ్చి, శ్రీరెడ్డి విషయంలో లెంపలు వేసుకునేలా చేసారు. దాంతో మొత్తానికి మా పరువు పూర్తిగా దిగజారిపోయినట్లయింది.

ఇంతకీ ఆ సంగతేమిటి?

అసలు విషయం అలాగే వుంది. శ్రీరెడ్డి ఆరొపించిన అభిరామ్ మాట మాత్రం స్పందించ లేదు. ఆయన తండ్రి సురేష్ బాబు పెదవి కదపలేదు. ఇస్యూ మాత్రం సమసిపోయింది. తాను చానెళ్లకు వస్తుంటే పోరాటం కుదరడం లేదని, ఇక చానెళ్లకు రానని శ్రీరెడ్డి ప్రకటించింది. అంటే అర్థం అయిపోతోంది. శ్రీరెడ్డి ఇక చానెళ్లలో ఇప్పట్లో గడబిడ చేయదని.

కేవలం మా సభ్యత్వంతో శ్రీరెడ్డి రాజీ పడిపోయినట్లేనా? అభిరామ్ విషయం వదిలేసినట్లేనా? లీగల్ గా ఎలా ప్రొసీడ్ కావాలో చూస్తానని, కోన వెంకట్ విషయం ప్రస్తావిస్తూ చెప్పారు శ్రీరెడ్డి. కానీ నిజానికి కోన వెంకట్ వ్యవహారంలో కన్నా, అభిరామ్ విషయంలోనే ఆమెకు లీగల్ ఫైట్ కు ఎక్కువ స్కోప్ వుంది. ఓ అమ్మాయిని ప్రేమించానని చెప్పి, సాన్నిహిత్యంగా మసులుకుని, తప్పించుకుంటే అది కచ్చితంగా కేసు అవుతుంది. అయితే శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితేనే అది సాధ్యం. కానీ ఆమె వైఖరి చూస్తుంటే వ్యవహారం ముగిసిపోయినట్లే వుంది.

పెదవి విప్పకుండా, బయటకు కనిపించకుండా సురేష్ బాబు ఈ వ్యవహారానికి ఎలా పుల్ స్టాప్ పెట్టించగలిగారు అన్నది ఆయన విజయ రహస్యం.

మొత్తం వ్యవహారంలో ‘మా’ పరువుపోయింది. శ్రీరెడ్డి గెలిచారు. అభిరామ్ తప్పించుకున్నారు అన్న కామెంట్ లు వినిపిస్తున్నాయి.