మూడు బ్లాక్ బస్టర్ లు అందించిన మైత్రీ మూవీస్ తాజా చిత్రం సవ్యసాచి. ఇప్పుడు ఈ సినిమా అదృష్టం ఏమిటంటే, మైత్రీ జనాలు చెప్పిన రేట్లు రాబట్టకునే అవకాశం వుండడం. కానీ అది ఒక్కటి పక్కన పెడితే చాలా విషయాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు కాస్త ఓవర్ బడ్జెట్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా షూటింగ్ చకచకా సాగడం లేదు. చైతన్య రెండు సినిమాలు సమాంతరంగా చేయాలని అనుకోవడంతో ఎకాఎకీ సాగడం లేదు. అదీ కాక, ముందు అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం హిట్ నేఫథ్యంలో కావాలని ఎక్కువ రేట్లకు అమ్మడానికి ఇలాంటి ఫీలర్లు వదులుతున్నారన్న కామెంట్ లు కూడా వినవస్తున్నాయి
ఎంతయినా నాగచైతన్య మార్కెట్ అంత అద్భుతం ఏమీ కాదు. పైగా నాగచైతన్యకు వున్న సమస్య ఏమిటంటే, అతగాడు యాక్షన్ సినిమాలు ట్రయ్ చేసినపుడల్లా డిజాస్టర్లు పలకరిస్తున్నాయి. దడ, బెజవాడ, దోచేయ్, సాహసంశ్వాసగా సాగిపో, ఆటోనగర్ సూర్య, యుద్ధం శరణం ఇలా ప్రతి యాక్షన్ సినిమానూ డిజాస్టరే.
ఒక్క తడాఖా మాత్రమే బెటర్. అది రీమేక్. అదే లవ్ సబ్జెక్ట్ లు చేస్తే సేఫ్ జోన్ లో వుంటున్నాడు. మరి సవ్యసాచి సబ్జెక్ట్ చూస్తే యాక్షన్ సినిమానే అనుకోవాల్సి వస్తోంది. చందు మొండేటి టాలెంట్ మీదనే విషయం ఆధారపడి వుంటుంది.
పైగా ఇప్పుడు అయిటమ్ సాంగ్ మాదిరిగా స్పెషల్ సాంగ్ జోడిస్తున్నారు. ఇది ఆదిలో అనుకున్నది కాదు. ఇప్పటికిప్పుడు జోడించిన అయిడియా? సమ్మర్ సీజన్ వుండగా రావాల్సిన సినిమా పోస్ట్ సమ్మర్ లో వస్తోంది. అది కూడా కాస్త సమస్యే.
మరి ఈ సమస్యలన్నీ అధిగమించడం అన్నది ఒక్క చందు మొండేటి టాలెంట్ మీదే వుంది.