మోడీ: బ్యాక్ టూ ది స్టార్టింగ్ పాయింట్!

‘‘నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ చోద్యం ఏమిటంటే.. ఇప్పటికీ తాను గుజరాత్ ప్రధానమంత్రిని అనే ఆయన అనుకుంటున్నారు…’’ అంట మోడీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో సెటైర్లు వినిపిస్తూ ఉంటాయి.…

‘‘నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ చోద్యం ఏమిటంటే.. ఇప్పటికీ తాను గుజరాత్ ప్రధానమంత్రిని అనే ఆయన అనుకుంటున్నారు…’’ అంట మోడీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో సెటైర్లు వినిపిస్తూ ఉంటాయి. ఒకవైపు కావేరీబోర్డు కోసం తమిళనాడులో ప్రజల ఆందోళనలు మిన్నంటుతున్న సమయంలోనే.. పుండు మీద కారం రాసినట్లుగా.. చెన్నైలో తన అధికారిక పర్యటన పెట్టుకున్న మోడీకి గట్టి షాకే తగిలింది.

తాను ఎక్కడ యాత్రకు వెళ్లినా.. రోడ్డు పక్కన నిల్చుని అభివాదాలు చేస్తూ నీరాజనాలు పట్టే జనాలే ఇప్పటిదాకా మోడీకి తారసపడ్డారు. చెన్నైలో ఆయన భిన్నమైన అనుభవాలు రుచిచూశారు.

‘మోడీ గోబ్యాక్’ అంటూ ఎటుచూసినా ఒకటే నినాదం. తమిళులంతా ఒక్క పెట్టుగా.. మోడీకి తమ నిరసన జ్వాలలను రుచిచూపించారు. సాధారణంగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు.. ‘‘నినాదాలు మిన్నంటాయి’’ అని మనం రాసేస్తూ ఉంటాం.. కానీ చెన్నైలో నిన్న వాస్తవగా.. ‘‘నినాదం.. మిన్ను.. అంటడం’’ అంటే ఏమిటో వారు రుచిచూపించారు.

ఈ దెబ్బకు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన వెళ్లడానికే భయపడిన మోడీ హెలికాప్టర్ లో కార్యక్రమానికి వెళ్లడంతో.. ఆయన తిరిగి హెలికాప్టర్ వద్దకొచ్చేసరికి.. ఆందోళనకారులు.. హెలికాప్టర్ మార్గంలో.. పెద్దపెద్ద నల్లటి బెలూన్లపై మోడీ గో బ్యాక్ నినాదాలు రాసి.. గాల్లోకి వదిలారు. దీంతో హెలికాప్టర్ పోలేని పరిస్థితి. రూటు మార్చుకుని మోడీ, నిరసన బెలూన్లు లేని మరో రూట్ లో విమానాశ్రయం వెళ్లాల్సి వచ్చింది.

మోడీ వెనక్కి వెళ్లాలంటూ ఆయన పదవిలోకి వచ్చిన నాలుగేళ్లలో స్వదేశంలోని ఒక ప్రాంతంలో ఈ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడం ఇదే ప్రథమం. బహుశా ఇలాంటి అనుభవం ఆయనకు గతంలో ఎదురై ఉండకపోవచ్చు. అసలే భాజపా ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తుందనే ఆరోపణలు ముమ్మరంగా వస్తున్న సమయంలో.. కర్నాటక ఎన్నికలు రావడం.. అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కావేరీ బోర్డు నిర్ణయం తీసుకోకపోవడం.. ఇలాంటి చవకబారు వ్యవహారాలన్నీ మోడీ సర్కారును మరింత దిగజార్చేలా.. పరువును రచ్చకీడ్చేలా కనిపిస్తున్నాయి. ఇంతటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నింటికీ మూలకారకులైన వ్యూహకర్తలు ఎవరో గానీ.. మొత్తానికి ప్రజాగ్రహం పెల్లుబికితే మూల్యం చెల్లించాల్సింది మాత్రం మోడీనే!

ఆ సంగతి ఆయనకు నిన్ననే బోధపడి ఉండాలి.

-కపిలముని