65 కిలోమీటర్లు నడిచి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

నిండు గర్భిణిలు 10 అడుగులు వేయడమే కష్టం. అలాంటిది నవమాసాలు నిండిన బిడ్డను కడుపులో పెట్టుకొని, ఓ గర్భిణి, ఏకంగా 65 కిలోమీటర్లు నడిచింది. ఆపై పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇదంతా ఆమె ఎందుకు…

నిండు గర్భిణిలు 10 అడుగులు వేయడమే కష్టం. అలాంటిది నవమాసాలు నిండిన బిడ్డను కడుపులో పెట్టుకొని, ఓ గర్భిణి, ఏకంగా 65 కిలోమీటర్లు నడిచింది. ఆపై పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇదంతా ఆమె ఎందుకు చేసిందో తెలుసా? కేవలం ఆమె భర్తపై కోపంతో. నెల్లూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని వైఎస్ఆర్ నగర్ కు చెందిన వర్షిణి, ఉపాధి కోసం భర్తతో కలిసి తిరుపతి వచ్చింది. ఇద్దరూ కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ఈ క్రమంలో వర్షిణి గర్భం దాల్చింది. అయితే నెలలు నిండేకొద్దీ ఆమెకు భర్తకు గొడవలు ఎక్కువయ్యాయి. రేపోమాపో డెలివరీ అనగా, ఆ గొడవలు తారాస్థాయికి చేరాయి.

దీంతో భర్తపై కోపంతో ఇల్లు వదిలి వచ్చేసింది వర్షిణి. తన ఊరుకు బయల్దేరింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎవ్వర్నీ లిఫ్ట్ అడగలేదు. కాలినడకనే తిరుపతి నుంచి బయల్దేరింది. అలా నాయుడుపేట వరకు వచ్చేసింది. ఇక అక్కడ్నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది.

ఆమె దీనస్థితి చూసిన ఓ వ్యక్తి 108కు కాల్ చేశాడు. సిబ్బంది వచ్చి చూసేసరికి వర్షిణి పరిస్థితి దారుణంగా ఉంది. ఏ క్షణంలోనైనా ప్రసవం అయ్యేలా ఉంది. దీంతో అంబులెన్స్ లోనే ఆమెకు డెలివరీ చేశారు. బిడ్డ ఆరోగ్యంగానే ఉంది కానీ 2 రోజులుగా తిండిలేక వర్షిణి నీరసించిపోయింది. దీంతో ఆమెను హుటాహుటిన నెల్లూరు ఆస్పత్రికి తరలించారు.

నిండు గర్భంతో 65 కిలోమీటర్లు నడిచిన వర్షిణి తెగింపు చూసి ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆత్మాభిమానంతో ఆమె తన వాళ్ల పేర్లు కూడా చెప్పడం లేదు. వర్షిణి పరిస్థితి తెలుసుకున్న దిశ పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె సొంత ఊరికి పంపించేలా ఏర్పాట్లు చేశారు.