దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. ఏపీ, తెలంగాణ మాత్రం ఓ పట్టాన లొంగేలా లేవు. అటు కేసీఆర్, ఇటు జగన్ ఇద్దరూ స్ట్రాంగ్ గా ఉన్నారు. మహా అయితే బీజేపీకి తెలంగాణపై కూసింత ఆశలున్నాయేమో కానీ, ఏపీపై ఏమాత్రం వారి పాచిక పారదని ఈపాటికే అర్థమైంది.
హైదరాబాద్ కి వచ్చిపోయే అమిత్ షా, ఇంకో రెండు గంటలు వీలు చూసుకుంటే ఏపీలో కాలు పెట్టలేరా..? పదే పదే తెలంగాణకి వచ్చిపోయే కేంద్ర నాయకులు, ఏపీకి వచ్చి ఇక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేయలేరా..? కానీ చేయట్లేదు.
ఏపీకి వచ్చినా, ఎంత రెచ్చిపోయినా ఫలితం లేదని వారికి తెలుసు. అందుకే వారి ఫోకస్ అంతా తెలంగాణపై ఉంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపించాలనుకుంటోంది బీజేపీ. మత రాజకీయాలకు కూడా అక్కడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అందుకే బీజేపీ ఏపీని వద్దనుకుంది, జగన్ ని చూసి కాస్త వెనకడుగు వేసింది. తెలంగాణలో మాత్రం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.
కేఏపాల్ తెలంగాణలో రెచ్చిపోవడం ఏంటి, ఆయనపై దాడి జరగడం ఏంటి, ఆ తర్వాత నేరుగా అమిత్ షా అపాయింట్ మెంట్ ఏంటి..? ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఏంటి..? ఇదంతా చూస్తుంటే క్రిస్టియన్ ఓట్లను పక్కాగా చీల్చే ఎత్తుగడగా అనిపిస్తుంది. పాల్ కి పెద్ద సీన్ లేకపోవచ్చు, కానీ పాల్ కి, నేరుగా అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చి పెద్దమనిషిని చేశారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికలనాటికి ఓట్లు చీల్చి, కాస్తో కూస్తూ బీజేపీకి ఉపయోగపడమనే ఉపదేశమిచ్చి పంపించారు. ఆ మాటకొస్తే తెలంగాణలో కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీల వెనక బీజేపీ అజెండా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణలో అధికారం కోసం శత విధాల ప్రయత్నిస్తోంది బీజేపీ.
కేసీఆర్ తో ఎప్పటికైనా గొడవే..?
కేసీఆర్ ని తెలంగాణలో నిలువరించకపోతే.. ఆయన ఏకంగా కేంద్రంపైకి దండెత్తేలా ఉన్నారు. ఆ మధ్య అక్కడా ఇక్కడా తిరిగి అందర్నీ కలుస్తూ హడావిడి చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని అనలేం కానీ.. కనీసం ఆ మూమెంట్ మొదలయ్యేందుకు ఆయనలాంటి వారు ప్రయత్నం చేస్తే.. చివరకూ అందరూ ఒక్కటయ్యే అవకాశముంది.
ఆ ప్రమాదాన్ని ముందే ఊహించిన బీజేపీ.. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రాకుండా, తెలంగాణకే పరిమితం అయ్యేలా పావులు కదుపుతోంది. కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో చేసిన పర్యటనల కంటే ఎక్కువగా.. కేంద్ర మంత్రులు తెలంగాణకు వస్తున్నారు. ఇక్కడ ఏదో జరిగిపోతోంది, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనంటూ బిల్డప్ ఇస్తున్నారు.
ఈటల లాంటి పార్టీలు దొరికితే..
ఈటల లాంటి నాయకులు మరింతమంది టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరితే కమలదళంలో మరింత నమ్మకం పెరుగుతుంది. కానీ ఈటల తర్వాత కేసీఆర్ జాగ్రత్తపడ్డారు.
ఫామ్ హౌస్ పాలిటిక్స్ కి స్వస్తి చెప్పి జనంలోకి వస్తున్నారు. మరోవైపు కేటీఆర్ కూడా బాగా హుషారయ్యారు. హరీష్ ని మరింత దగ్గర చేశారు. అటు కేసీఆర్ కూడా బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగానే చూస్తున్నారు. అదే సమయంలో ఆ పార్టీ అంటే భయం లేదని స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.
కేసీఆర్ వేరు, జగన్ వేరు..
జగన్ నేరుగా ఎక్కడా బీజేపీని టార్గెట్ చేయలేదు, ఏపీలో ఆ పార్టీకి అంత సీన్ లేదని తెలిసి పూర్తిగా పక్కనపెట్టేశారు. ఇలాంటి తటస్థులను అనవసరంగా కెలికి శత్రువులుగా మార్చుకోవడం తెలివి తక్కువ పని. అందుకే అమిత్ షా సహా.. ఇంకెవరైనా హైదరాబాద్ వస్తారే కానీ, ఏపీలో అడుగు పెట్టరు. ఇక్కడంతా వీర్రాజు వీరంగమే. లేకపోతే ఆ పార్టీ తోక పట్టుకుని తిరుగుతున్న పవన్ ప్రసంగమే.
మొత్తమ్మీద బీజేపీ లాంటి జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఒకదానిపైనే ఫోకస్ పెట్టి, ఇంకో రాష్ట్రంలో అస్త్ర సన్యాయం చేసిందంటే.. జగన్ ఏ రేంజ్ లో ఇక్కడ బలపడ్డారో అర్థమవుతుంది.