దేశంలో సీఎంలను మార్చేయడంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కన్నా వేగంగా దూసుకెళ్తోంది. కేంద్రంలో అధికారం తమ చేతిలో ఉన్న రోజుల్లో సీఎంలను దించేసి, సీల్డ్ కవర్లో నేతల పేర్లను పంపడంలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ పండిపోయింది. కాంగ్రెస్ విధానాలను కలలో కూడా వ్యతిరేకించే కమలం పార్టీ మాత్రం ఈ విషయంలో తన వైరినే ఫాలో అవుతూ ఉంది.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ వాళ్లు తాము ఎంపిక చేసిన సీఎంల చేత రాజీనామాలు చేయించి, వేరే వాళ్లను ఆ సీట్లో కూర్చోబెట్టారు.ఈ పరంపరలో ఉత్తరాఖండ్, కర్ణాటకల తర్వాత బుల్లి రాష్ట్రం త్రిపురలో అదే జరిగింది. విప్లవ్ దేవ్ చేత రాజీనామా చేయించి, మరొకరిని ఆ సీట్లో కూర్చోబెడుతోంది.
విప్లవ్ దేవ్ త్రిపురలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వచ్చే ఏడాది త్రిపురలో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విప్లవ్ దేవ్ పై ప్రజా వ్యతిరేకత ఉందని, అందుకే బీజేపీ అధిష్టానం ఆయన స్థానంలో మరొకరిని సీఎంగా కూర్చోబెడుతోందని వార్తలు, విశ్లేషణలు వస్తున్నాయి.
ఉత్తరాఖండ్ లో ఈ సూత్రం విజయవంతం అయ్యిందని, ఎన్నికల ముందు సీఎంను మార్చేస్తే ప్రజలు మళ్లీ ఓటేస్తారని బీజేపీ భావిస్తోందనే మాట వినిపిస్తోంది. కర్ణాటకలోనూ ఇలాంటి ప్రయోగమే చేశారు. వచ్చే ఏడాది అక్కడ కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది.
మొత్తానికి సీఎంలను మార్చేయడంలో మాత్రం బీజేపీ త్వరలోనే కాంగ్రెస్ రికార్డులను కూడా తుడిచేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కర్ణాటక ప్రస్తుత సీఎం కూడా తన పదవిని నిలబెట్టుకోవడానికి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తూ ఉన్నారు. బీజేపీ సీఎంల పదవీ కాలాలు ఇప్పుడు పూర్తిగా ఢిల్లీ దయగా మారినట్టుగా ఉన్నాయి!