తెలంగాణలో ఇప్పుడు మూడుకోణాల రాజకీయ సమరం నడుస్తోంది. అధికారంలో ఉన్న తెరాస పతనానికి బీజేపీ, కాంగ్రెస్ తమ వంతు పాటు పడుతున్నాయి. కేసీఆర్ బలంగా పాతుకుపోతున్నాడు.. ఈ ఎన్నికల్లోనే అధికారం లాక్కోవాలి అనేది ఈ రెండు పార్టీల కోరిక. ఈ త్రిముఖ రాజకీయంలో తమాషా ఎపిసోడ్ ఒకటి నడుస్తోంది.
ప్రత్యర్థులను దుమ్మెత్తిపోయడం ద్వారా తమకు ప్రజానుకూలతను సంపాదించుకోవడం చాలా సాధారణం. అందుకే, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ హవా పెరుగుతున్నదనే ఉద్దేశంతో కేసీఆర్ ఎడాపెడా మోడీ మీద దాడి చేస్తున్నారు. బీజేపీ కూడా కేసీఆర్ మీద దాడి చేస్తుంటుంది. నిన్నటికి నిన్న అమిత్ షా కూడా.. కేసీఆర్ లాంటి అసమర్థ పాలనను తన జీవితంలో చూడలేదని కొత్తగా సెలవిచ్చారు. కాంగ్రెస్ కూడా కేసీఆర్ ను తీవ్రంగా దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది. ముందే చెప్పుకున్నట్టు ఇది సాధారణంగా జరిగే సంగతి.
కానీ తెలంగాణలో ప్రత్యేకంగా కనిపిస్తున్న తమాషా ఏంటంటే.. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా.. కేసీఆర్ తో ఎదుటి పార్టీకి అక్రమ సంబంధం ఉన్నదనే ప్రచారంతో తాము లబ్ధి పొందాలని ఆరాటపడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి కేసీఆర్ కు అక్రమ సంబంధం ఉన్నదని.. కేసీఆర్ కు మేలు చేయడానికే బీజేపీ వక్ర రాజకీయాలు నడుపుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సేమ్ టూ సేమ్ బీజేపీ కూడా అంతే.
కేసీఆర్ తో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయిపోయిందని.. వీరిద్దరూ కలిసి మోడీ వ్యతిరేకతతో జట్టుకట్టారని.. పైకి మాత్రం ఒకరినొకరు మాటలు అనుకుంటూ నాటకాలు ఆడుతున్నారని.. కాంగ్రెస్ తో కేసీఆర్ మైత్రీ బంధానికి ప్రశాంత్ కిశోర్ హబ్ లాగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది.
ఇద్దరూ కలిసి కేసీఆర్ ను చాలా పెద్ద బూచిలాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ బూచితో దొంగచాటు స్నేహం కొనసాగిస్తున్నాడు గనుక.. ఎదుటి పార్టీకి కూడా ఓట్లు వేయవద్దని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఇద్దరిదీ ఒకే తీరు.
అమిత్ షా తెలంగాణలో పెట్టిన సభ మొత్తానికి తెరాసలో గట్టిగానే ప్రకంపనలు సృష్టించింది. తెరాసకు చెందిన ప్రతి నాయకుడూ.. అమిత్ షాను విమర్శించడానికే రెండు రోజులుగా తమ సమయం కేటాయిస్తున్నారు. ఇదే పెద్ద నిదర్శనం. తీరా అమిత్ సభ అయిన తర్వాత రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఒకవైపు అమిత్ షా కేసీఆర్ ను ఎడాపెడా విమర్శిస్తే.. ‘‘మీ చీకటి మిత్రుడు గనుక.. కేసీఆర్ ను పల్లెత్తు మాట అనలేదంటూ అమిత్ షాను విమర్శించారు. చోద్యంగా కనిపిస్తోంది. ఇది. తెలంగాణలో బీజేపీని దెబ్బ కొట్టాలంటే.. కేసీఆర్ తో అక్రమ సంబంధం ముడిపెట్టడం మినహా మరోదారి కాంగ్రెస్ కు కనిపించడం లేదా? ఏమో మరి!