ఇటీవలే ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్ హఠాన్మరణం పాలయ్యారు. ఇంతలోనే మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైమండ్స్ మరణ వార్త వస్తోంది. రోడ్డు ప్రమాదంలో సైమండ్స్ మరణించారని ఆస్ట్రేలియన్ పోలీసులు ప్రకటించారు.
తన ఆటతీరుతో క్రికెట్ ప్రియులను ప్రత్యేకంగా ఆకట్టుకోవడమే కాదు, కావాల్సినన్ని వివాదాలను వెంటేసుకు తిరిగిన క్రికెటర్ కూడా సైమండ్స్. 2008 లో టీమిండియా ఆస్ట్రేలియా టూర్ సందర్భంలో మంకీగేట్ వివాదంలో సైమండ్స్ పేరు చర్చలో నిలిచింది. భారత క్రికెట్ హర్భజన్ సింగ్ తనను మంకీ అని దూషించాడంటూ సైమండ్స్ ఆరోపించాడు. దీనిపై పెద్ద విచారణే సాగింది.
ఆ సమయంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్లు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం, అంపైర్ల నిర్ణయాలు చెత్తగా ఉండటం, పాంటింగ్ తీరు విమర్శల పాలవ్వడం.. మిగిలిన క్రికెట్ ప్రపంచం అంతా ఇండియా టీమ్ పట్ల సానుకూలంగా స్పందించడం.. పెద్ద దుమారమే సాగింది.
ఇలా ఎన్నో వివాదాల ఆ సీరిస్ లో వాటికి కేంద్ర బిందువుల్లో ఒకడిగా నిలిచాడు సైమండ్స్. ఇక అదే సీరిస్ లో ఒక ఆస్ట్రేలియన్ స్ట్రీకర్ బట్టలన్నీ విప్పి మైదానంలోకి రావడం, అతడిని సైమండ్స్ తన భుజబలం ఉపయోగించి కింద పడేయడం కూడా ప్రముఖ వార్తగా నిలిచింది. స్పోర్ట్స్ ఈవెంట్స్ లో అలా బట్టలన్నీ విప్పేసి మైదానాల్లోకి చొచ్చుకురావడం పాశ్చాత్య దేశాల్లో రొటీనే. ఆ తరహాలో వచ్చిన ఒక స్ట్రీకర్ భద్రతా సిబ్బందికి ఎంతకూ దొరకకపోవడంతో.. పిచ్ వైపుగా వచ్చిన అతడిని సైమండ్స్ కింద పడేశాడు. సైమండ్స్ బలప్రదర్శన దెబ్బకు అతడు కింద పడిపోయాడు.
ఆస్ట్రేలియాలో ఉన్న చట్టాల ప్రకారం.. సైమండ్స్ చేసింది నేరమట. దీనిపై సదరు స్ట్రీకర్ ఫిర్యాదు చేసి ఉంటే సైమండ్స్ కేసును ఎదుర్కొనాల్సి వచ్చేదట. అయితే తను సైమండ్స్ ఫ్యాన్ అని అందుకే అతడిపై ఫిర్యాదు చేయడం లేదని ఆ స్ట్రీకర్ తర్వాత ప్రకటించాడు.
2007 08 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పరిణామాలతో భారత క్రికెట్ ప్రియులకు చేదు అయినప్పటికీ.. సైమండ్స్ ఆ తర్వాత మాత్రం ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ తొలి ఏడాది వేలంలో అత్యధిక ధర పలికిన క్రికెటర్లలో సైమండ్స్ ఒకరు. అప్పట్లోనే ఐదు కోట్ల రూపాయల పై స్థాయి ధర పలికింది సైమండ్స్ కు. తొలి యేడాది డెక్కన్ చార్జర్స్ కు ఆడాడు. ఆ సీజన్లో హైదరాబాద్ జట్టు అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
అయితే రెండో ఏడాదే డీసీ జట్టు ఐపీఎల్ చాంఫియన్ కావడంతో సైమండ్స్ పాత్ర కీలకమైనది. ఇలా క్రికెట్ ప్రియులకు ఎన్నో అనుభూతులను ఇచ్చిన సైమండ్స్ జీవితం రోడ్ యాక్సిడెంట్ తో అర్ధాంతరంగా ముగియడం విషాదకరం.