దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రఖ్యాత నటుడు ఎన్‌టీ.రామారావుపై ఆయన కుమారుడు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమా తీయడం ఆసక్తికరమైన అంశమే. బాలకృష్ణ తీసే సినిమాలో ఎన్‌టీఆర్‌కు మంచి ప్రాధాన్యత ఇచ్చి, ఆయనకు సమున్నతమైన స్థానం కల్పించడం సహజంగానే జరుగుతుంది. అయితే చరిత్రను యధాతధంగా తీస్తారా? లేక తమకు అనుకూలంగా మలచుకుంటారా? అన్నది తెలియవలసి ఉంది. కేవలం ఎన్‌టీఆర్ సినీ జీవితానికి సంబంధించి మాత్రమే బయోపిక్ తీస్తే అది అసంపూర్ణం అవుతుంది.
అంతవరకు అయితే కొత్తగా సినిమా తీయనవసరం లేదు. ఎన్‌టీఆర్ రాముడుగా, కృష్ణుడుగా, సోషల్ హీరోగానే కాకుండా, పౌరాణికాలలో విలన్ పాత్రలుగా పరిగణించే వాటిని కూడా పోషంచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకరకంగా సినిమా రంగంలో సార్థకత్వం సాధించారు. మరి రాజకీయ రంగంలో ఏమి జరిగిందన్నది ముఖ్యం. ఎన్‌టీఆర్‌ను రాజకీయాలలో హీరోగా చూపిస్తే మరి ఆయనను పదవి నుంచి దించివేసిన చంద్రబాబు నాయుడును విలన్‌గా చూపించవలసి వస్తుంది.
అది అయ్యేపని కాదు. ఎందుకంటే చంద్రబాబుకు సహకరించిన పాత్రలలో ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులు హరికృష్ణ, బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసి చంద్రబాబు ఆయనను ఆకట్టుకున్నారు. తదుపరి ఆయనకు హాండిచ్చారు. అలాగే హరికృష్ణను ఎమ్మెల్యే కానప్పుడు మంత్రిని చేశారు. ఆరునెలల్లో ఎమ్మెల్యే కాలేకపోవడంతో మంత్రిపదవిని వదలుకోవలసి వచ్చింది. దాంతో ఆయన కూడా తిరుగుబాటు చేయడం, సొంతపార్టీ పెట్టుకుని విఫలం అయి తిరిగి టీడీపీలో చేరడం వంటి సన్నివేశాలు జరిగాయి.
ఇక ఎన్‌టీఆర్ తన జీవితంలో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ ఘట్టం బాలకృష్ణతో సహా కుటుంబ సభ్యులు ఎవరికి ఇష్టం ఉండదు. ఆ తర్వాత కాలంలో ఎన్‌టీఆర్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు వర్గం విష ప్రచారం చేసి ఆయనను అన్‌పాపులర్ చేయడానికి రకరకాల వ్యూహాలు అమలు చేసింది. వాటిని పసికట్టలేకపోయిన ఎన్‌టీఆర్ అల్లుడు చేతిలో ఘోర పరాభవానికి గురై చివరికి తన పదవినే కోల్పోయారు. ఆ సందర్భంలో ఆయన కంటతడిపెట్టిన సన్నివేశం అప్పుడు మీడియా సమావేశానికి హాజరైన అనేకమంది పాత్రికేయులకు హృదయం ద్రవించేలా చేసింది.
చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన సొంతంగా పార్టీని కూడా ఏర్పాటు చేసుకోవడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో కన్నుమూశారు. కాని చనిపోవడానికి ముందు చంద్రబాబును జామాత దశమ గ్రహం అంటూ తీవ్రంగా దూషిస్తూ, తన అల్లుడు ఎలా కుట్రలు పన్నింది సవివరంగా వీడియోని రికార్డు చేశారు. అలాంటి సన్నివేశాలను బాలకృష్ణ అసలు చిత్రీకరిస్తారా? లేదా అన్నది సహజంగానే ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తిస్తుంది. అంతేకాదు.. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్‌టీఆర్ నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని కూడా లాక్కొని, చివరికి ఆయనపైనే చెప్పులు వేసిన చరిత్ర కూడా ఉంది.
ఇక ఎన్‌టీఆర్ కొన్ని పద్ధతులు అవలంభించారు. టీడీపీలో చేరడానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని కండిషన్ పెట్టారు. కాని ఇప్పుడు చంద్రబాబు ఏకంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కోట్లకు కొనుగోలు చేసి, వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని విలువలు లేని అనైతిక రాజకీయ పార్టీగా చంద్రబాబు మార్చారన్న విమర్శలు ఉన్నాయి.
ఎన్‌టీఆర్ టైమ్‌లో వారసత్వ రాజకీయాలా అని ప్రశ్నించిన చంద్రబాబు స్వయంగా తన కుమారుడు లోకేష్‌కు మంత్రి పదవిని కట్టబెట్టారు. అయితే ఆయన బాలకృష్ణకు కూడా అల్లుడు కావడంతో నోరెత్తే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్‌టీఆర్ పాలనాకాలంలో అమలు చేసిన వివిధ విధానాలను పాజిటివ్‌గా చూపించడం జరగవచ్చు. కాని 1993 నుంచి జరిగిన కీలకమైన ఘట్టాలను బాలకృష్ణ ఎలా చిత్రీకరిస్తారన్న దానిపైనే ఆ సినిమా ప్రజాదరణ ఆధారపడి ఉంటుంది.
కేవలం వచ్చే ఎన్నికలలో తన తండ్రి బొమ్మను అడ్డం పెట్టుకుని లాభపడాలన్న లక్ష్యంతో సినిమా తీస్తే బాలకృష్ణ తన తండ్రికి అన్యాయం చేసినవారు అవుతారు. ఇది చరిత్ర. అందులోను కేవలం రెండు దశాబ్దాల క్రితంవరకు జరిగిన చరిత్ర. దానిని వక్రీకరిస్తారా? లేక వాస్తవ దృక్పదంతో తీస్తారా అన్నది చర్చనీయాంశం. బాలకృష్ణ నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు ఎన్‌టీఆర్ చరిత్రను సినిమా తీస్తారని ఆశిద్దాం.
కాకపోతే అది అత్యాశే అవుతుందన్న సందేహం మాత్రం ఉంటుంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు