భరత్ అనే నేను ఇప్పుడు టాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తున్న లేటెస్ట్ సంచలనం. రంగస్థలం వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. దాంతో ఇప్పుడు అందరి కళ్లు భరత్ అనే నేను వైపు తిరిగాయి. ఇప్పటి వరకు అన్నీ మాంచి సినిమాలే అందిస్తూ వస్తున్న కొరటాల శివ డైరక్టర్ కావడం, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో కావడంతో ఈ సినిమా మీద మరింత బజ్ పెరిగింది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మూడు పాటలు బయటకు వచ్చాయి 'భరత్ అనే నేను. హమీ ఇస్తున్నాను'.. 'ఐ డోండ్ నో'.. 'వచ్చాడయ్యా సామి' పాటలు బయటకు వచ్చాయి. ఈ మూడూ కూడా సినిమాటిక్, మాస్ సాంగ్స్ కావు. కేవలం సిట్యువేషన్ ఇంకా మీనింగ్ ఫుల్ సాంగ్స్. కానీ ఫ్యాన్స్ కు కావాల్సింది మాంచి మాస్ బీట్ పాటలు. అలాంటి పాటలు భరత్ అనే నేనులో వున్నాయా? అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.
ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో మాంచి మాస్ బీట్ సాంగ్ వదలండో అన్ని పోస్ట్ లు పెడుతున్నారు. మరి అలాంటి పాట ఎప్పుడు వస్తుందో? కానీ ఇండస్ట్రీ వినిపిస్తున్న గుసగుసలు వేరుగా వున్నాయి. భరత్ అనే నేను సినిమాలో నాలుగు పాటలే వున్నాయని, మిగిలిన ఆ సాంగ్ ఒక్కటే డ్యూయట్ కావచ్చని అంటున్నారు. డ్యూయట్ అయితే వుందా అన్నది తేలాల్సి వుంది.
రైతుల ఎపిసోడ్
ఇదిలా వుంటే పాటల సంగతి ఎలావున్నా సినిమాలో డైలాగులు మాత్రం ఓ రేంజ్ లో సూటిగా నాటుకునేలా వుంటాయని తెలుస్తోంది. రాజకీయంగా టార్గెట్ చేసే విధంగా కాకుండా, ప్రజలను ఆలోచింపచేసేలా కొరటాల డైలాగులు రాసినట్లు తెలుస్తోంది. అలాగే ఓ రైతుల ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా వుంటుందని తెలుస్తోంది.
సినిమాలో కేవలం ఒక పాయింట్ అని కాకుండా రెండు మూడు సమస్యలు టచ్ చేసాడట. అందులో ప్రాధమిక విద్య అన్నది కూడా ఓ పాయింట్ అని తెలుస్తోంది. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్లు తక్కువే అయినా కొరటాల మిర్చి సినిమా టైపులో బలంగా వుంటాయని కూడా వినికిడి.